APSRTC: పండగ లాంటి మరో శుభవార్త చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ..
ABN , Publish Date - Dec 29 , 2024 | 09:58 AM
సంక్రాంతి పండగకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రత్యేక స్థానం ఉందో చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈ పండగకు మాత్రం స్వగ్రామానికి వచ్చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి మరింత ప్రత్యేకమని చెప్పాలి.

విశాఖ: సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 1000 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఇవాళ (ఆదివారం) ప్రకటించింది. వెయ్యి బస్సుల్లో దూర ప్రాంతాలకు 200 సర్వీసులు నడపగా.. విజయనగరం జోనల్ పరిధిలో 800 బస్సులు తిప్పనున్నట్లు వెల్లడించింది. విశాఖ నుంచి గరుడ, గరుడ ప్లస్, అమరావతి, నైట్ రైడర్, క్రూయిజ్, అల్ట్రా డీలక్స్ సర్వీస్‌లు దూర ప్రాంతాలకు నడపనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చేవారికి, అలాగే విశాఖలో ఉంటూ స్వస్థలాలకు వెళ్లేవారికి ప్రత్యేక బస్సులు ఉపయోగపడనున్నాయి. అయితే హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 2,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి పండగకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రత్యేక స్థానం ఉందో చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ ఉన్నా ఈ పండగకు మాత్రం స్వగ్రామానికి వచ్చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి మరింత ప్రత్యేకమని చెప్పాలి. ఉద్యోగ, ఉపాధి రీత్యా దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఈ పండగకు ఇంటికి వచ్చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వాసులంతా గ్రామాలకు వెళ్లిపోతారు.
ఈ నేపథ్యంలో బస్సుల రద్దీ విపరీతంగా ఉంటుంది. బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సంక్రాంతి పండగకు పెద్దఎత్తున ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంటారు. ఈ సందర్భంగా 2,400 ప్రత్యేక బస్సులను హైదరాబాద్ ఎంజీబీఎస్ ఎదురుగా ఉన్న సీబీఎస్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రత్యేక బస్సు సేవలు జనవరి 9 నుంచి జనవరి 13 వరకూ అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఈసారి ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఏపీలోని పలు ప్రాంతాలకు 3 వేల ప్రత్యేక బస్సులు నడపాలని భావిస్తోంది. జనవరి, 2025 మెుదటి వారం నుంచే ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నాయి.