Vijaya Sai Reddy: టీడీపీకి 16, వైసీపీకి 15.. విజయసాయి లెక్క ఇదే..!!
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:55 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయాన్ని వైసీపీ జీర్ణించుకోలేక పోతుంది. ఆ పార్టీ ముఖ్యనేతలు ఓటమి గురించి కాకుండా ఇతర అంశాలపై కామెంట్ చేస్తున్నారు. వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్‌లో తమ పార్టీ బలం గురించి ప్రస్తావించారు. టీడీపీ కన్నా తక్కువేమి కాదని అక్కసు వెళ్లగక్కారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయాన్ని వైసీపీ జీర్ణించుకోలేక పోతుంది. ఆ పార్టీ ముఖ్యనేతలు ఓటమి గురించి కాకుండా ఇతర అంశాలపై కామెంట్ చేస్తున్నారు. వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్‌లో తమ పార్టీ బలం గురించి ప్రస్తావించారు. టీడీపీ కన్నా తక్కువేమి కాదని అక్కసు వెళ్లగక్కారు. పార్లమెంట్‌లో వైసీపీకి 15 మంది సభ్యులు ఉన్నారని వివరించారు. వాస్తవానికి లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 4 చోట్ల విజయం సాధించింది. విజయసాయి రెడ్డి మాత్రం రాజ్యసభ సీట్లను కలిపి ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 16 స్థానాల్లో జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. బీజేపీ 3, జనసేన 2 రెండుచోట్ల విజయం సాధించింది.
వైసీపీకి షాక్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు షాక్ ఇచ్చారు. ఇదివరకు 22 మంది సభ్యులు ఉండగా, ఈ సారి నలుగురు మాత్రమే గెలిచారు. 22 మంది సభ్యుల ఓటు ద్వారా రాజ్యసభకు 11 మంది నామినేట్ అయ్యారు. రాజ్యసభ 11 స్థానాలను లోక్ సభలో గల 4 సీట్లను కలిపితే 15 సీట్లు అవుతాయి. తెలుగుదేశం పార్టీకి లోక్ సభలో 16 సీట్లు వచ్చాయి. టీడీపీ కన్నా తామే తక్కువ కాదని సాయిరెడ్డి స్పష్టం చేశారు. పెద్దల సభలో తమ పార్టీకి చెందిన ఎంపీల బలం మోదీ ప్రభుత్వానికి అవసరం అవుతుందని సాయిరెడ్డి ధీమాతో ఉన్నారు. రాజ్యసభలో తమ సభ్యుల మద్దతు రాష్ట్ర, దేశ ప్రయోజనాల ఆధారంగా మద్దతు ఇస్తారని గుర్తుచేశారు.
రివ్యూ
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై సమీక్ష చేస్తామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రివ్యూ తర్వాత ఏం జరిగిందో తెలియనుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విజయసాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబు జతకట్టని పార్టీ దేశంలో ఏదైనా ఉందా అని సెటైర్లు వేశారు.