Share News

AP employees: ఈనెలా అదే పరిస్థితా?... జీతాలు మహాప్రభో అంటున్న ఏపీ ఉద్యోగులు

ABN , Publish Date - Feb 03 , 2024 | 04:10 PM

Andhrapradesh: వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి దారుణంగా మారినట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సరైన సమయానికి జీతాలు పడక వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకటో తారీఖున పడాల్సిన జీతాలు ఒక్కోసారి నెల మధ్యలోనూ పడిన సందర్భాలు ఉన్నాయి.

AP employees: ఈనెలా అదే పరిస్థితా?... జీతాలు మహాప్రభో అంటున్న ఏపీ ఉద్యోగులు

అమరావతి, ఫిబ్రవరి 3: వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి దారుణంగా మారినట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సరైన సమయానికి జీతాలు పడక వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకటో తారీఖున పడాల్సిన జీతాలు ఒక్కోసారి నెల మధ్యలోనూ పడిన సందర్భాలు ఉన్నాయి. ఈనెల (ఫిబ్రవరి) కూడా ఉద్యోగులు, పెన్షనర్లకు అదే పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకటో తారీఖు దాటి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో డబ్బులు ఇంకా జమ అవ్వలేదు. కేవలం న్యాయశాఖ, పోలీసు, సచివాలయం ఉద్యోగులకు మాత్రమే వేతనాలు పడ్డాయి. మిగతా శాఖల ఉద్యోగులు, జిల్లాస్థాయి ఉద్యోగులకు వేతనాలు అందని స్థితి.

మరోవైపు పెన్షన్లు రాక పెన్షనర్లు అల్లాడుతున్నారు. మూడవ తేదీ నాటికి పెన్షన్లు ఇవ్వకపోతే ఎలా అని ప్రభుత్వాన్ని పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు. నెలకు 5 వేల 500 కోట్లు రూపాయలు వేతనాలు, పెన్షన్లు రూపంలో ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది. అయితే వచ్చే మంగళవారం తరువాతే వేతనాలు అని ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 4 వేల కోట్ల రూపాయిలు జమ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే ఉద్యోగులు, పెన్షన్ దారులకు వేతనాలు, పెన్షన్లు పడతాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక మంగళవారం కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూపులు చూస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 03 , 2024 | 04:56 PM