Share News

AP Elections: ఎన్నికల బెట్టింగ్‌కు వరసగా పోతున్న ప్రాణాలు..

ABN , Publish Date - Jun 10 , 2024 | 04:59 PM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ(AP Assembly), లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బెట్టింగ్(Betting) విపరీతంగా సాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. బెట్టింగ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏపీఎల్. కానీ రాష్ట్రంలో దాన్ని మించి ఎన్నికల వేళ పందాలు వేసి బికారులుగా మారుతున్నారు. మరికొంత మంది సొమ్ము చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.

AP Elections: ఎన్నికల బెట్టింగ్‌కు వరసగా పోతున్న ప్రాణాలు..

పల్నాడు: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ(AP Assembly), లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బెట్టింగ్(Betting) విపరీతంగా సాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. బెట్టింగ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏపీఎల్. కానీ రాష్ట్రంలో దాన్ని మించి ఎన్నికల వేళ పందాలు వేసి బికారులుగా మారుతున్నారు. మరికొంత మంది సొమ్ము చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మధ్యవర్తులు సైతం తమ వద్ద పెట్టిన నగదు మరొకరి దగ్గర పందెం వేసి తిరిగి చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


తాజాగా అలాంటి ఘటనే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని రెంటపాళ్ల (Rentapalla) ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు (Nagamalleswara Rao) బెట్టింగ్ వేశారు. అందుకు భిన్నంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మోజార్టీతో సీట్లు గెలుచుకుంది. అయితే నగదు చెల్లించి తీవ్రంగా నష్టపోవడంతో ఉపసర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే బాధితుడి తండ్రి పోలీసుల వేధింపుల వల్లే తన కుమారుడు మృతిచెందినట్లు ఆరోపిస్తున్నారు. పోస్ట్ మార్టర్ అనంతరం రెంటపాళ్ల గ్రామానికి మృతదేహాన్ని ర్యాలీగా తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.


అయితే జూన్ 9న కృష్ణాజిల్లా నూజివీడులోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి బెట్టింగ్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. 10 శాతం కమీషన్‌పై సుమారు రూ.30 కోట్ల వరకు సేకరించాడు. ఆ సొమ్ము మెుత్తాన్ని మరో పందెంలో పెట్టాడు. జూన్ 4న వైసీపీ ఘోర పరాజయం పొందడంతో అప్పట్నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో పందెం రాయుళ్లు అతణ్ని వెతకడం ప్రారంభించారు. నగదు చెల్లించలేక తన ఫార్మ్ హౌస్‌లో వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


దెందులూరు నియోజకవర్గంలోనూ ఇలాంటి బెట్టింగ్ బాధితులు బయటకు వస్తున్నారు. ఐదుగురు మధ్యవర్తుల వద్ద రూ.20 కోట్లు వరకు పెడితే వారు ఇప్పుడు అందుబాటులో లేరని బెట్టింగ్ రాయుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరి ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, మరొకరు కనిపించడం లేదని, మిగిలిన వారు అందుబాటులో లేరని చెప్తున్నారు. పందెం వేసేందుకు పొలం, బంగారం తాకట్టు పెట్టినట్లు కొందరు చెప్తుండగా.. రూ.10 వడ్డీకి తెచ్చి మరీ వేశామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని బయటపడతాయో చూడాలి మరి.

Updated Date - Jun 10 , 2024 | 05:02 PM