Share News

అంతరిక్ష టూరిస్ట్‌గా తెలుగు తేజం!

ABN , Publish Date - Apr 13 , 2024 | 05:45 AM

భారత పైలట్‌, తెలుగుతేజం గోపీచంద్‌ తోటకూరకు అరుదైన గౌరవం దక్కింది. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు టూరి్‌స్టగా గోపీచంద్‌ రికార్డు సృష్టించనున్నారు...

అంతరిక్ష టూరిస్ట్‌గా తెలుగు తేజం!

ఏపీ వాసి గోపీచంద్‌ తోటకూరకు అరుదైన గౌరవం

‘బ్లూ ఆరిజన్‌’ మిషన్‌లో అంతరిక్షయానం చాన్స్‌

ఈ ఘనత సాధించనున్న తొలి తెలుగు వాడిగా రికార్డు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12: భారత పైలట్‌, తెలుగుతేజం గోపీచంద్‌ తోటకూరకు అరుదైన గౌరవం దక్కింది. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు టూరి్‌స్టగా గోపీచంద్‌ రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజన్‌ సంస్థ న్యూషెపర్డ్‌ (ఎన్‌ఎస్‌)-25 మిషన్‌లో భాగంగా టూరిస్టుగా రోదసీలోకి తీసుకెళ్లనుంది. బ్లూ ఆరిజన్‌ వ్యోమనౌకలో పర్యాటకుడిగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు గోపీచంద్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా మరో ఐదుగురు కూడా ఎంపికయ్యారు. 1984లో భారత సంతతికి చెందిన రాకేశ్‌ శర్మ కూడా అంతరిక్ష యానం చేసిన సంగతి తెలిసిందే. అలాగే గతంలో అంతరిక్ష యానం చేసిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌, రాజాచారి, శిరీష బండ్ల కూడా భారత మూలాలున్న అమెరికా పౌరులు. భారత్‌ తరఫున తొలి స్పేస్‌ టూరి్‌స్టగా అవకాశం దక్కించుకున్న గోపీచంద్‌ ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్‌పోర్టు ఉండడం గమనార్హం. దీంతో అంతరిక్ష యానం చేయనున్న తొలి తెలుగు వాడిగా ఆయన రికార్డు నెలకొల్పనున్నారు.

విజయవాడలో పుట్టి.. పైలట్‌ శిక్షణ పొంది..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టిన గోపీచంద్‌ (30) ఒక పారిశ్రామిక వేత్త, పైలట్‌. అమెరికాలోని ఎంబ్రీ రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్‌ సైన్స్‌లో బీఎస్సీ చేసిన గోపీచంద్‌.. పైలట్‌గానూ శిక్షణ పొందారు. గోపీచంద్‌కు సాహస యాత్రలంటే కూడా ఇష్టం. ఇటీవలే ఆయన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఆయన ప్రిజర్వ్‌ లైఫ్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదొక వెల్‌నెస్‌ సెంటర్‌. దీన్ని అట్లాంటా శివారులో మిలియన్‌ డాలర్లతో ఏర్పాటుచేశారు. బ్లూ ఆరిజన్‌ సంస్థ ఆయన పేరుని అధికారికంగా ప్రకటించే వరకూ తన కుటుంబానికి సైతం ఈ విషయం తెలియదని గోపీచంద్‌ మీడియాకు తెలిపారు. అంతరిక్ష రంగంపై ఎనిమిదేళ్ల క్రితమే ఆసక్తి కలిగిందని ఆయన చెప్పారు.

బ్లూ ఆరిజన్‌ ఏడో మిషన్‌

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజో్‌సకు చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజన్‌ ఇప్పటికే న్యూషెపర్డ్‌ మిషన్‌ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్‌ సహా ముగ్గురు టూరిస్టులు రోదసీయాత్ర చేశారు. దాని తర్వాత చేపట్టబోయే మిషన్‌ ఈ ఎన్‌ఎస్‌-25. దీనికోసం గోపీచంద్‌ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వారిలో వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ మాసన్‌ ఏంజెల్‌, పారిశ్రామిక వేత్తలు సిల్వియన్‌, కారోల్‌ షెల్లర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కెన్నెత్‌, ఆస్ట్రోనాట్‌ ఎడ్‌ డ్వైట్‌ ఉన్నారు. వీరి ప్రయాణ తేదీ ఇంకా ఖరారు కాలేదు. బ్లూ ఆరిజన్‌.. న్యూ షెపర్డ్‌ ప్రోగ్రామ్‌ కింద చేపడుతున్న 25వ మిషన్‌ ఇది. అలాగే మానవ సహితంగా చేపడుతున్న ఏడో ప్రాజెక్టు. బ్లూ ఆరిజన్‌ ఇప్పటివరకు 31 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీరంతా సముద్ర మట్టానికి 80-100 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కర్మన్‌ లైన్‌ వరకు వెళ్లివచ్చారు.

Updated Date - Apr 13 , 2024 | 05:45 AM