Share News

TDP News: ప్రకాశంలో 8 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఖరారు!

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:58 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముప్పాతిక వంతు సీట్లలో టీడీపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మొత్తం 12 సీట్లకుగాను 8 చోట్ల అభ్యర్థులు ఖరారయ్యారు.

TDP News: ప్రకాశంలో 8 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఖరారు!

పరుచూరు, అద్దంకి, కొండపి సిటింగ్‌లకే మళ్లీ టికెట్లు

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ప్రస్తుత ఇన్‌చార్జులకే చాన్సు

ఒంగోలు, యర్రగొండపాలెం కూడా

దర్శి సీటు జనసేనకు?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముప్పాతిక వంతు సీట్లలో టీడీపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మొత్తం 12 సీట్లకుగాను 8 చోట్ల అభ్యర్థులు ఖరారయ్యారు. దర్శి స్థానాన్ని మిత్రపక్షం జనసేనకిచ్చే అవకాశం ఉంది. మిగిలిన మూడు సీట్లకు సంబంధించి మెరుగైన అభ్యర్థి కోసం కసరత్తు కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరిపోయారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి), ఏలూరి సాంబశివరావు (పరుచూరు), డోలా బాల వీరాంజనేయ స్వామి (కొండపి-ఎస్సీ) నుంచి తిరిగి పోటీ చేయనున్నారు. మరో ఐదు సీట్లలో కూడా ప్రస్తుత ఇన్‌చార్జులనే బరిలోకి దించాలని నాయకత్వం నిర్ణయించింది. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం-కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు-ఎం.అశోక్‌రెడ్డి, ఒంగోలు-దామచర్ల జనార్దన్‌, యర్రగొండపాలెంలో ఎరిక్సన్‌బాబు పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

దర్శిలో జనసేనలో కొత్తగా చేరిన ప్రవాసాంధ్రుడు గరికపాటి వెంకట్‌ చురుగ్గా కనిపిస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య కుమారుడు కృష్ణచైతన్య కూడా ఆ పార్టీ టికెట్‌ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన మూడు సీట్లపై టీడీపీ నాయకత్వం కసరత్తు కొనసాగుతోంది. చీరాల ఇన్‌చార్జిగా ఎంఎం కొండయ్య ఉన్నారు. ఆయనతోపాటు అక్కడ సజ్జా హేమలత, చాపర్తి రాజేశ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కందుకూరులో ప్రస్తుతం టీడీపీ ఇన్‌చార్జిగా ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు. ఆయనకు వరుసకు సోదరుడయ్యే రాజేశ్‌ కూడా టికెట్‌ ప్రయత్నాల్లో ఉన్నారు. కొత్తగా కోటపాటి జనార్దన్‌ అనే నేత పేరును కొందరు నేతలు అధిష్ఠానానికి ప్రతిపాదించారు.

వైసీపీలోని ఒక ఎమ్మెల్యే పేరు కూడా టీడీపీ వర్గాల్లో నలుగుతోంది. సంతనూతలపాడు(ఎస్సీ)కు బీఎన్‌ విజయకుమార్‌ ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయన సోదరుడు డాక్టర్‌ అనిల్‌ ఏలూరు జిల్లా చింతలపూడి (ఎస్సీ) టికెట్‌ రేసులో గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అనిల్‌కు అక్కడ టికెట్‌ వస్తే విజయ్‌ కుమార్‌కు ఇక్కడ టికెట్‌ వస్తుందా అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా ఈ సీటుకు పాలపర్తి మనోజ్‌ కుమార్‌, బొమ్మాజీ అనిల్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఒంగోలు ఎంపీ అభ్యర్థిపైనా ఇంకా స్పష్టత రాలేదు. ఏలూరు ఎంపీ సీటు బీసీలకు ఇస్తే.. ఒంగోలు ఓసీలకు ఇస్తారని, అక్కడ వీలుకాని పక్షంలో ఇక్కడ బీసీలకు ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

Updated Date - Feb 07 , 2024 | 07:12 AM