Share News

Andhra Pradesh : కంచుకోట పదిలమే !

ABN , Publish Date - May 12 , 2024 | 04:01 AM

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అంటే టక్కున గుర్తొచ్చేది హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం.

Andhra Pradesh : కంచుకోట పదిలమే !

హిందూపురంలో ఎదురులేని టీడీపీ

బాలయ్య గెలుపు లాంఛనమే!

వైసీపీ అభ్యర్థి దీపిక తరఫున

మంత్రి పెద్దిరెడ్డి మంత్రాంగం

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అంటే టక్కున గుర్తొచ్చేది హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ హయాం నుంచి ప్రస్తుతం ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ వరకు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ సైకిల్‌కు ఎదురేలేదు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలివీచినా ఇక్కడ బాలకృష్ణ ఘనవిజయం సాధించారు.

వరుసగా రెండు సార్లు గెలిచిన ఆయన మూడోసారీ నెగ్గి హ్యాట్రిక్‌ సాధించాలని భావిస్తున్నారు. వైసీపీ నుంచి ఈ నియోజకవర్గంతో సంబంధం లేని తిప్పేగౌడ నారాయణ దీపిక పోటీ చేస్తున్నారు. ఆమెను ముందుపెట్టి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెరవెనుక పావులు కదుపుతున్నారు.

ఏడోసారి నందమూరి కుటుంబీకులు..

టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983లో తొలిసారి పార్టీ అభ్యర్థి పామిశెట్టి రంగనాయకులు గెలుపొందారు. 1985, 89, 94 ఎన్నికల్లో ఎన్టీఆర్‌, ఆయన మరణానంతరం ఉప ఎన్నికల్లో 1996లో నందమూరి హరికృష్ణ, 1999లో సీసీ వెంకటరాముడు, 2004లో రంగనాయకులు రెండోసారి, 2009లో అబ్దుల్‌ ఘనీ, 2014, 19ల్లో నందమూరి బాలకృష్ణ టీడీపీ నుంచి విజయం సాధించారు.

హిందూపురం అభివృద్ధికి ఎన్టీఆర్‌ శ్రీకారం చుడితే.. ఆయన వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగించారు. పెద్దమొత్తంలో నిధులు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేశారు. పట్టణంలో రోడ్లు అభివృద్ధి చేశారు.

హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలతో చెరువులను నింపారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. నియోజకవర్గంలో వాల్మీకి, మైనారిటీ ఓట్లు అధికం. వాల్మీకులు టీడీపీ వెంటే ఉన్నారు. ముస్లింలు కూడా బాలయ్య గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి.

ఇక వైసీపీ ఇక్కడ బెంగళూరులో స్థిరపడిన చిత్తూరు జిల్లా వాసి దీపికను బరిలోకి దించింది. 2014, 19లో రెండుసార్లు వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. 2019లో బాలకృష్ణ చేతిలో ఓడిపోయిన మహమ్మద్‌ ఇక్బాల్‌ను ఆ పార్టీ హిందూపురం ఇన్‌చార్జిగా నియమించి, ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. గతేడాది జూలైలో ఇక్బాల్‌ను తప్పించి దీపికకు అవకాశం ఇచ్చారు. ఈ నియామకం వెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారు.

పైగా ఆమె గెలుపు బాధ్యతలను కూడా ఆయనే తీసుకున్నారు. అయితే ఇక్కడ పార్టీలో నాలుగు వర్గాలు ఉన్నాయి. వీరి మధ్య విభేదాలు చల్లార్చడానికి ఆయన చేసిన యత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఇక్బాల్‌ టీడీపీలో చేరి వైసీపీకి షాకిచ్చారు. గెలవలేకపోయినా మెజారిటీ అయినా తగ్గించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

- పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి


నందమూరి బాలకృష్ణ బలాలు

బలమైన పార్టీ కేడర్‌.. వరుసగా రెండు సార్లు విజయం.. ఎన్టీఆర్‌ వారసుడిగా హిందూపురంపై ప్రత్యేక ముద్ర.. ప్రజల దాహార్తి తీర్చేందుకు గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి రూ.194 కోట్లతో ప్రత్యేక పైపులైన్‌ ఏర్పాటు. రహదారుల అభివృద్ధి. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో కార్పొరేట్‌ స్థాయి సౌకర్యాల కల్పన.. ఉచితంగా కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు.. కరోనా కాలంలో సొంత నిధులతో ప్రజలకు సాయం.. వైద్య పరికరాలు అందజేత. రెండేళ్లపాటు అన్న క్యాంటీన్‌ నిర్వహణ.

బలహీనతలు..

సినిమా షూటింగ్‌ల కారణంగా నియోజకవర్గానికి పూర్తి సమయం కేటాయించకపోవడం.. స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం.. పార్టీ కార్యకర్తలను నేరుగా కలవకపోవడం..

దీపిక బలాలు..

హిందూపురం నుంచి ప్రధాన పార్టీల తరఫున బరిలో దిగుతున్న తొలి మహిళ.. ఆమె భర్త రెడ్డి సామాజికవర్గం కావడం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందుండి నడిపించడం..

బలహీనతలు..

రాజకీయాలకు కొత్త. నియోజకవర్గం ఆనుపానులు తెలియకపోవడం.. పార్టీలో నాలుగు వర్గాలు నాలుగు స్తంభాలాట. ఆమె చుట్టూ ఓ సామాజికవర్గం కోటరీ.. అనుచరులపై చెరువు, దేవాలయ భూముల కబ్జా ఆరోపణలు.

నియోజకవర్గ స్వరూపం..

మండలాలు: హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు

మొత్తం ఓటర్లు: 2,48,187,

పురుషులు: 1,24,219,

మహిళలు: 1,23,899,

ట్రాన్స్‌జెండర్లు: 19 మంది

కీలక సామాజిక వర్గాల ఓటర్లు

ముస్లింలు-46 వేలు, వాల్మీకి-41 వేలు, ఎస్సీలు-36 వేలు,

పద్మశాలి-16 వేలు, కురుబ-13 వేలు, రెడ్లు-11 వేలు, వడ్డెర-10 వేలు, ఆర్యవైశ్యులు-9 వేలు, బలిజలు-8 వేలు

Updated Date - May 12 , 2024 | 04:01 AM