Share News

YSRCP: అన్నింటా..‘పెద్ద’ రెడ్డే..!

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:38 AM

నియోజకవర్గంలో ఎమ్మెల్యే దౌర్జన్యాలు, అరాచకాలకు అడ్డూ అదుపూ లేదు. అధికారంలో ఉన్నా, లేకపోయినా.. ప్రత్యర్థులను వదిలే ప్రసక్తే లేదని మీడియా ముందే చెబుతుంటారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకాలు చేయడంలో తనకు తానే సాటి. ఏ అధికారైనా ఆయన ముందు జీ హుజూర్‌ అనాల్సిందే. లేదంటే పెట్టేబేడా సర్దుకొని వెళ్లిపోవాలి.

YSRCP: అన్నింటా..‘పెద్ద’ రెడ్డే..!

దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతిలో దిట్ట

గ్రానైట్‌ ఇలాకాలో ఎమ్మెల్యే ఫ్యాక్షన్‌ అలజడులు

పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకాలు

టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు

జోరుగా ఇసుక, మట్టి అక్రమ రవాణా

రియల్‌ వెంచర్లలో పర్సంటేజీల వసూలు

మాట వినని అధికారులకు వేధింపులు

నాలుగున్నరేళ్లలో 250 కోట్ల అక్రమార్జన

నియోజకవర్గంలో ఎమ్మెల్యే దౌర్జన్యాలు, అరాచకాలకు అడ్డూ అదుపూ లేదు. అధికారంలో ఉన్నా, లేకపోయినా.. ప్రత్యర్థులను వదిలే ప్రసక్తే లేదని మీడియా ముందే చెబుతుంటారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకాలు చేయడంలో తనకు తానే సాటి. ఏ అధికారైనా ఆయన ముందు జీ హుజూర్‌ అనాల్సిందే. లేదంటే పెట్టేబేడా సర్దుకొని వెళ్లిపోవాలి. సదరు నేతకు ఇసుక, మట్టి అక్రమ రవాణా ప్రధాన ఆదాయ వనరు. ఎవరైనా రియల్‌ వెంచర్లు వేయాలంటే కప్పం కట్టాల్సిందే. ఒకే ప్రాంతంలో ఆయన ఏకంగా 200 ఎకరాలకుపైగా భూములు కొనుగోలు చేశారు. 58 నెలల్లో రూ.250 కోట్లకుపైగా వెనకేసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కడప జిల్లా సరిహద్దున ఉన్న నియోజకవర్గమది. గ్రానైట్‌ పరిశ్రమకు నెలవు. స్థానిక ఎమ్మెల్యే.. దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి అన్నింటిలోనూ ‘పెద్ద’ రెడ్డే. బాహాటంగానే తానో ఫ్యాక్షనిస్టు అని అంటారు. ఫ్యాక్షన్‌ అలజడులతో నియోజకవర్గంలో ప్రశాంతత లేకుండా చేశారు.

(అనంతపురం–ఆంధ్రజ్యోతి): ఆయనది ఓ మోస్తరు రైతు కుటుంబం. ఫ్యాక్షన్‌ నేపథ్యముంది. కుటుంబ అండతోనే రాజకీయాల్లో ఎదిగారు. ఎన్నికల్లో పోటీచేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది... మరోసారి చాన్స్‌ దక్కుతుందో లేదోనని ఆస్తులు బాగా పోగేసుకున్నారు. తనకున్న ఫ్యాక్షన్‌ నేపథ్యంతో దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమాలు సాగిస్తూ ఆస్తుల చిట్టాను అమాంతం పెంచేసుకున్నారు. వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చిన తర్వాతే రూ.వందల కోట్లు ఆర్జించారు. వందలాది ఎకరాల భూములు సంపాదించారనే విమర్శలు నియోజకవర్గవ్యాప్తంగా గుప్పుమంటున్నాయి. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఆనుకునే ఉన్న ఎస్సీ నియోజకవర్గంలో ఆయన స్వగ్రామం ఉంది. స్వగ్రామం ఉండే మండలంతో పాటు పక్క మండలంలోనూ దాదాపు 200 ఎకరాలు కుటుంబ సభ్యులతో పాటు తన పేరుతోనూ కొనుగోలు చేశారు.

ఇసుకలో కోట్లు కుమ్ముడు

నియోజకవర్గ పరిధిలో పెన్నానది నుంచి ఇసుక అక్రమంగా రవాణ చేస్తూ రూ.కోట్లు ఆర్జించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అక్కడ ఇసుక మాఫియా నడుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని ఓ ప్రముఖ కోన సమీపంలోని గ్రామానికి చెందిన నాయకుడు ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ వాటా చెల్లిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజూ వందలాది టిప్పర్ల ఇసుకను రవాణా చేస్తూ రూ.లక్షల్లో ముడుపులు ముట్టచెప్తున్నారన్న ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో మరో మండల కేంద్రంలో పెన్నానది సమీపాన అనధికారిక ఇసుక రీచ్‌ ఏర్పాటు చేసుకుని అక్రమంగా తోడేస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలతో నదిలో ఏర్పడిన గుంతలు ఎవరి కంటపడకుండా సమీపంలోనే ఉన్న రిజర్వాయర్‌ గేట్లు ఎత్తేసి నీటితో ఆ గుంతలను నింపేశారు. అక్రమ ఇసుక రవాణా ఆనవాళ్లు లేకుండా చేశారు. ఇలా రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు.

కొండల్ని పిండేస్తున్నారు

నియోజకవర్గ పరిధిలో ఓ కోనకు సంబంధించిన కొండతో పాటు కొండలు, గుట్టలను పిండిచేసి భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఎమ్మెల్యే కనుసన్నల్లో మట్టిదోపిడీ సాగుతోంది. రోడ్ల నిర్మాణం కోసం మట్టిని తరలిస్తున్నామనే బూచి చూపి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

బంధువూ నొక్కుడు

నియోజకవర్గ కేంద్రానికి దేశంలోనే నంబర్‌ వన్‌ మున్సిపాలిటీగా నిలిచిన ఘన చరిత్ర ఉంది. అలాంటి మున్సిపాలిటీ.. సదరు నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధిలో వెనుకబడింది. కాగ్‌ నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి పనులు జరగాలన్నా ఎమ్మెల్యే సమీప బంధువు కనుసన్నల్లోనే జరగాలి. ఎమ్మెల్యే సమీప బంధువే కాంట్రాక్టరు అవతారమెత్తి రూ.కోట్లు విలువ చేసే రోడ్లు, కాలువ పనులు చేసి బాగా నొక్కేస్తున్నారు. కమీషన్‌ రూపంలో వచ్చే సొమ్ములో ఎమ్మెల్యేకు వాటాలు వెళ్తునట్లు ఆరోపణలున్నాయి.

వెంచర్ల నుంచి ముడుపులు

నియోజకవర్గ కేంద్రం పరిసర ప్రాంతాలన్నీ గ్రానైట్‌ పరిశ్రమలతో నిండి ఉన్నాయి. సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలోని జమ్ములమడుగు నియోజకవర్గంలో ఓ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో... అక్కడ ఆశ్రయం కోల్పోయిన వేలాది మంది ముంపు బాధితులు ఇక్కడికి పెద్ద ఎత్తున వలస వచ్చారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. అనేక విల్లాలతో పాటు వెంచర్లు వెలిశాయి. వాటి అనుమతి కోసం రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఒక్కో వెంచర్‌ నుంచి రూ.10–15 లక్షలు ముడుపులు పుచ్చుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఆ ముడుపులన్నీ నేరుగా ఎమ్మెల్యే ఇంటికే చేరుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

లగ్జరీ కార్లు..

నియోజకవర్గ కేంద్రం వ్యాపారపరంగా పెద్ద పట్టణం. ఆ పట్టణంలో దాదాపు రూ.2 కోట్లకుపైగా ఖర్చు చేసి బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి, కార్యాలయంగా వాడుకుంటున్నారు. ఇక లగ్జరీ కార్లంటే సదరు నాయకుడికి చాలా ఇష్టం. బినామీ పేర్లతో కొనుగోలు చేసి వినియోగించుకుంటున్నారు.

మాజీ ఎమ్మెల్యే ఇంటికెళ్లి..

ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడులకు పాల్పడటమే దినచర్యగా ఎంచుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు మారణాయుధాలతో ఏకంగా ప్రత్యర్థి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ ఇంట్లోకి వెళ్లి విరుచుకుపడ్డారంటే.. ఆ ఎమ్మెల్యే దౌర్జన్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ సమయానికి ఇంట్లో మున్సిపల్‌ చైర్మన్‌ లేరు. ఆయన ఇంట్లో ఉన్నట్లయితే పరిణామాలు ఎలా ఉండేవో ఊహకే అంతుపట్టడం లేదు.

టీడీపీ నేతలపై దాడులు

మున్సిపాలిటీ మురుగునీరు సమీపంలోని పెన్నానదిలోకి వెళుతోంది. దీంతో నదీ జలాలు కలుషితమవుతున్నాయి. మురుగు నీటిని నియంత్రించేందుకు మున్సిపల్‌ చైర్మన్‌ మరమ్మతులు చేపట్టేందుకు పూనుకున్నా అధికార పార్టీ నేతలు అడ్డు తగులుతున్నారు. ఆ పనులు చేసేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్‌తో పాటు కొందరు టీడీపీ కౌన్సిలర్లపై దాడులకు తెగబడ్డారు. మీడియాపై కూడా దాడులకు దిగారు. ఎమ్మెల్యే తప్పిదాలను సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించిన టీడీపీ కౌన్సిలర్లపైనా దాడులు చేశారు.

అక్రమ కేసులు.. బెదిరింపులు

సదరు నాయకుడు తనకు అనుకూలంగా వ్యవహరించే డీఎస్పీకి పోస్టింగ్‌ ఇప్పించుకుని, ఆయన ద్వారా ప్రతిపక్ష నేతలు, టీడీపీ మద్దతుదారులపై అక్రమంగా కేసులు నమోదు చేయించి వేధింపులకు గురిచేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా పోలీసు అధికారుల ద్వారా కక్షసాధింపు చర్యలకు దిగారు. కేసుల పేరుతో టీడీపీ నాయకులను స్టేషన్‌కు పిలిపించి హింసించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మున్సిపాలిటీలో పర్యటనకు వెళ్లిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిపైన ఆ ఎమ్మెల్యే తన అనుచరులతో దాడి చేయించారు. ఓటరు జాబితా పరిశీలించేందుకు కాలనీలకు వెళ్లిన టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే కార్యాలయానికి లాక్కొచ్చి చితకబాదారు. తన మాట వినని అధికారులపైనా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు జులుం ప్రదర్శిస్తుంటారు. మున్సిపాలిటీలో తన మాట వినలేదని ఓ శాఖకు చెందిన అధికారిని, రెవెన్యూ అధికారిని బెదిరించారు.

Andhra Pradesh: పోలీసుల్లో ‘ట్యాపింగ్‌’ పరేషాన్‌!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 10:38 AM