Deputy CM Pawan : కాలుష్య కారక పరిశ్రమలపై పవన్ కన్నెర్ర
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:48 AM
కాకినాడ తీరప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని డిప్యూటీ సీఎం, పర్యావరణ, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తీర ప్రాంతంలో యూనివర్సల్ బయో?
కాకినాడలో యూనివర్సల్ బయో ఫ్యూయల్ సంస్థ మూసివేత
సమగ్ర దర్యాప్తునకు డిప్యూటీ సీఎం ఆదేశం
తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మరణంపైనా విచారణ
సర్పవరం జంక్షన్ (కాకినాడ), అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ తీరప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని డిప్యూటీ సీఎం, పర్యావరణ, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తీర ప్రాంతంలో యూనివర్సల్ బయో?ఫ్యూయల్స్ సంస్థ విడుదల చేస్తున్న కాలుష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలోని ఈ ఫ్యాక్టరీని పరిశీలించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు.. దీనిని తాత్కాలికంగా మూసివేయించారు. కొంతకాలంగా వాయు కాలుష్యంపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. పీసీబీ చైర్మన్ కృష్ణయ్య, జిల్లా పీసీబీ ఈఈ శంకరరావులతో ఫోన్‌లో మాట్లాడారు. యూనివర్సల్ బయో ప్యూయల్స్ సంస్థ కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, వాస్తవ పరిస్థితిని పరిశీలించి తక్షణం నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈమేరకు అధికారులు ఇటీవల క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. అక్కడ ముడి పదార్థాల కింద వాడే ఫ్యాటీ యాసిడ్‌లో కల్తీ జరిగిందని, ఫలితంగా ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు వెలువడుతున్నాయని తేల్చారు.
సదరు కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ముడి సరుకు ధరలు పెరడంతో కల్తీ రసాయనం వాడినట్టు ప్రాథమికంగా గుర్తించామని, ఈ నెల 24న ఫ్యాక్టరీని మూసివేయించామని పీసీబీ ఈఈ శంకరరావు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు మరింత సమగ్రంగా దర్యాప్తు చేస్తామని, సముద్ర తీర ప్రాంతంలోని మరిన్ని ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే, కాకినాడ బీచ్‌రోడ్డు, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెద్ద సంఖ్యలో మరణిస్తున్న విషయం డిప్యూటీ సీఎం దృష్టికి రావడంతో దీనిపై విచారణ జరిపి, తాబేళ్ల మరణానికి కారకులపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని పీసీసీఎఫ్ చిరంజీవ్ చౌదరిని ఆదేశించారు.