Share News

Jaya Jayosthu: చంద్రబాబు దంపతులకు పురాణపండ గ్రంధంతో ‘జయ జయోస్తు’ పలికిన వేమిరెడ్డి దంపతులు

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:02 AM

‘జయ జయోస్తు’ అద్భుత గ్రంధాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు, నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన సతీమణి కోవూరు తెలుగుదేశం శాసన సభ అభ్యర్థి, టి.టి.డి. సలహామండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆవిష్కరించడంతో అపురూప భక్తి సేవకు మరొకసారి నెల్లూరు‌లో తెరలేచినట్లైంది

Jaya Jayosthu: చంద్రబాబు దంపతులకు పురాణపండ గ్రంధంతో ‘జయ జయోస్తు’ పలికిన వేమిరెడ్డి దంపతులు

నెల్లూరు, మార్చి 21: తెలుగు రాష్ట్రాల్లో గత మూడు మాసాలుగా వందలకొలది అనేక ఆలయాల అర్చక, పండిత వర్గాల్ని, పారాయణ పరాయణుల్ని, భక్త పాఠకుల్ని విశేషణగా ఆకర్షిస్తూ, ఆకట్టుకుంటోన్న ‘జయ జయోస్తు’ (Jaya Jayosthu) అద్భుత గ్రంధాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు, నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy), ఆయన సతీమణి కోవూరు తెలుగుదేశం శాసన సభ అభ్యర్థి, టి.టి.డి. సలహామండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (Vemireddy Prashanthi Reddy) దంపతులు ఆవిష్కరించడంతో అపురూప భక్తి సేవకు మరొకసారి నెల్లూరు‌లో తెరలేచినట్లైంది. ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) అపురూప రచనా సంకలన గ్రంధం ‘జయజయోస్తు’ మంత్ర వైభవ మహాగ్రంధాన్ని గురువారం ఉదయం వేమిరెడ్డి దంపతులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. పరమాత్మ స్వరూపాన్ని నిరూపించే మంత్రవిద్యల గొప్ప సత్యాలతో రూపొందించిన ఈ ‘జయ జయోస్తు’ గ్రంధం సర్వకాల సర్వావస్థలలో పారాయణం చేసుకునేలా... సౌందర్యమయ వ్యాఖ్యానాలతో అందించిన పురాణపండ శ్రీనివాస్ మంత్ర నిష్ఠను, రచనా వైభవాన్ని అభినందించారు. శంఖాలు, దుందుభులూ, మేఘగర్జనల్లాంటి జయ జయ ధ్వనుల మంత్రాలన్నీ ఈ ‘జయ జయోస్తు’లో ఉండటం... ఈ సమయంలో ఈ దివ్య కార్యాన్ని ఆవిష్కరించడం చంద్రబాబు విజయానికి ‘జయ జయోస్తు’లా పలుకుతున్నట్లుందని ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు.

Prabhakar-reddy.jpg

తెలుగునాట కొన్ని సంవత్సరాలుగా ఒక పుస్తకం వెనుక మరొక పుస్తకం చొప్పున సాహిత్య, ఆధ్యాత్మిక గ్రంధాలను వ్యాపార తాకిడులు లేకుండా.. పూర్తిగా నిస్వార్ధంగా అద్భుత రీతిలో అందించడంలో పురాణపండ శ్రీనివాస్ అగ్రశ్రేణిలో ఉండటం వల్లనే... రెండు రాష్ట్రాల్లో పురాణపండ శ్రీనివాస్ ధార్మిక గ్రంధాలకు ఊహాతీతమైన స్పందన సంవత్సరాలుగా లభిస్తూనే ఉందనే విషయం కన్నులముందే స్ఫుటంగా కనిపిస్తున్న సత్యం.

తమ స్వహస్తాలతో వేమిరెడ్డి దంపతులు ఎందరో భక్తులకు ఈ ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని అందజేయడం భక్త జనులకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఎంతో ఆనందం కలిగించింది. త్వరలోనే ఈ ‘జయ జయోస్తు’ అద్భుత అమోఘ మంత్ర కదంబాన్ని నెల్లూరు మాత్రమే కాకుండా చుట్టు ప్రక్కల ప్రాంతాల అనేక ఆలయాలకు, తెలుగుదేశం పార్టీ అధినాయకుని క్షేమంకోరి వేలాది భక్త శ్రేణులకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులు అందజేస్తారని పార్టీ శ్రేణుల అందుతున్న సమాచారం. జయ జయోస్తు గ్రంధాన్ని వేమిరెడ్డి దంపతుల నుండి స్వీకరించిన భక్త జనం, సాహితీ మిత్రులు అక్కడికక్కడే పారాయణం చేయడం విశేషం.

Puranapanda.jpg

పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనాలైన ‘మహామంత్రస్య’, ‘మహాసౌందర్యం’, ‘స్మరామి .. స్మరామి’, ‘శివశ్శివమ్’, ‘జయం ... జయం’, ‘భద్రే ... రుద్రే’, ‘శివోహం’, ‘యుగే .. యుగే’, ‘శ్రీపూర్ణిమ’, ‘శ్రీమాలిక’, ‘శ్రీలహరి’, ‘సౌభాగ్య’, ‘అమృతధార’, ‘అమృత వర్షిణి’, ‘నేనున్నాను’, ‘అమ్మణ్ణి’, ‘శరణు... శరణు’ ... వంటి ఎన్నో గారేంద వైభవాలతో వేల వేల పాఠకుల్ని ఆనంద పరవశంతో కట్టేశారనడానికి ఎన్నో మఠాలు, పీఠాలు , ఆలయాలే సాక్ష్యమని చెప్పక తప్పదు. రమణీయమైన గ్రంధాలు, కాంతిమంతమైన సౌందర్య సంపన్న గ్రంధాలు పురాణపండ శ్రీనివాస్ వెలువరిస్తున్నారు కాబట్టే భారతదేశ హోం శాఖామంత్రి అమిత్ షా శ్రీనివాస్‌కి కబురుపెట్టి మరీ... వివిధ రకాల అతి అరుదైన ఐదువందల ఆంజనేయ స్వామి వార్ల శిల్ప వర్ణ చిత్రాలతో, మంత్ర కధా వైభవాలతో ఈ దేశంలోనే మొట్టమొదటి ఆంజనేయ గ్రంధాన్ని ప్రచురింప చేసి న్యూ ఢిల్లీ మహా నగరంలో ఆవిష్కరించడం, పురాణపండ శ్రీనివాస్‌ని అభినందించడం అద్భుతమేనని పండితులు, రచయితలు పేర్కొనడం గమనార్హం.

Anam.jpg

గతంలో నెల్లూరు‌కి చెందిన మాజీ మంత్రి, ఆత్మకూరు శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి అనేకసార్లు శ్రీనివాస్ ప్రతిభావంతమైన గ్రంధసంపదను ఎందరికో పంచడమే కాకుండా గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేత ఆవిష్కరింప చేశారు కూడా. ఈ అంశంలోంచి చూస్తే నెల్లూరు‌కి చెందిన మరొక మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం తన కుమారుడు రాజమోహన్ రెడ్డి సూచన మేరకు పురాణపండ శ్రీనివాస్ చేత మరొక అపూర్వ గ్రంధాన్ని రచింపచేసి చంద్రబాబు నాయుడి చేతనే ఆవిష్కరింపచేయడం విశేషం. ఇప్పుడిలా వేమిరెడ్డి దంపతులు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులకు ‘జయ జయోస్తు’ పలుకుతూ ఈ మంగళ అంశాల గ్రంధాన్ని పదిమందికీ అందించడంతో.. రాజకీయాలకతీతంగా అందరూ ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులను ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు.

Somireddy.jpg

ఈ దైవీయచైతన్య గ్రంధాలకు నెల్లూరు జిల్లాలో మొట్టమొదట సుమారు పదిహేను సంవత్సరాల క్రితం రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో ధార్మిక గ్రంధాల రచన, ఉచిత వితరణకు శ్రీకారం చుట్టి... నెల్లూరు శ్రీరాజరాజేశ్వరీ ఆలయం మొదలు జొన్నవాడ కామాక్షి దేవాలయంవరకూ... పెంచలకోన నరసింహ స్వామి ఆలయం మొదలు నెల్లూరు శ్రీ రంగనాథస్వామి దేవాలయం వరకూ.. ఎన్నో ఆలయాల ద్వారా వేల భక్తులకు పవిత్ర గ్రంధాలను అందజేసిన ధన్య చరితుడు, మాజీ ఎమ్మెల్యే , కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య అనేది చరిత్ర చెప్పే సత్యం. కొందరు పెద్దలు బొల్లినేని కృష్ణయ్య హృదయ వైశాల్యానికి, నాటి ఆధ్యాత్మిక గ్రంథ వితరణను పెద్ద ఎత్తున చేపట్టి వేలమంది మనస్సులో నిలిచిపోయారని కృతజ్ఞతాపూర్వకంగా చర్చించుకోవడం విశేషం.

Krishnayya.jpg

నెల్లూరు‌లో ఈ నలుగురు రాజకీయ యోధులకు పురాణపండ శ్రీనివాస్ పారమార్ధిక ఆర్శగ్రంధ వైభవాల రచనాసంకలనకర్త కావడం కూడా ఒక పవిత్ర చరితేనంటున్నారు విజ్ఞులైన పండితులు. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎన్నో దేశాల్లో తెలుగు వారిని తన విలక్షణ పవిత్ర గ్రంధాలతో ఆకర్షిస్తున్న పురాణపండ శ్రీనివాస్‌ని తిరుమహాక్షేత్రం నుండి.. సింహాచలం వరకూ విస్తరిల్లిన వందల ఆలయాల ధర్మకర్తలు, అర్చక ప్రముఖులు, వేదపండి మండలులు ఆశీర్వదించడం ఆయన రచనా నిస్వార్ధ నిష్కపట సేవను దర్శింపచేస్తున్నాయి.

Updated Date - Mar 22 , 2024 | 12:02 AM