Share News

Nellore Industrialists : బాబును కలిసిన పారిశ్రామికవేత్తలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 04:05 AM

నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తల బృందం గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసింది. పలు పెట్టుబడుల ప్రతిపాదనలపై వారి మధ్య చర్చ జరిగింది.

Nellore Industrialists : బాబును కలిసిన పారిశ్రామికవేత్తలు

  • వందల కోట్లతో పెట్టుబడుల ప్రతిపాదనలు

  • వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడి

అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తల బృందం గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసింది. పలు పెట్టుబడుల ప్రతిపాదనలపై వారి మధ్య చర్చ జరిగింది. మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో విశాఖపట్నంతోపాటు నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి కనబరిచారు. సీఎంను కలిసినవారిలో మెడిటాబ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ మితేష్‌ పటేల్‌, ఎఫ్‌సీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ ఎఫ్‌సీ పటేల్‌, మోలిక్యులర్‌ కేటలిస్ట్‌ కంపెనీ సీఈవో బలగాని వెంకట్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ భరత లక్ష్మి ఉన్నారు. 200- 300 ఎకరాల్లో మోలిక్యులర్‌ కేటలిస్ట్‌ కంపెనీ తాము ఒక జెనోమిక్స్‌ జోన్‌ ఏర్పాటు చేసి రూ.200కోట్ల పెట్టుబడితో ఉన్నత స్థాయి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. ఇందులో 150మందికి ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, రూ.500 కోట్లతో 600మందికి ఉద్యోగావకాశాలు వచ్చేలా పలు ప్రదేశాల్లో ఆతిథ్య కేంద్రాలు, కన్వెన్షన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రవేగ్‌ హాస్పటాలిటీ సంస్థ తన ప్రతిపాదనలో పేర్కొంది. రన్‌వే అందుబాటులో ఉంటే రూ.400 కోట్ల పెట్టుబడితో ఏవియేషన్‌ కార్యకలాపాలు చేపడతామని, 1000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని స్కై ఫ్రాంటియర్‌ సంస్థ తెలిపింది. ఫిలిప్పీన్స్‌ దేశంలో ప్రస్తుతం ఉన్న తమ కార్యకలాపాలను ఇక్కడికి మారుస్తామని, 50ఎకరాలు ఇవ్వగలిగితే రూ.150 కోట్ల పెట్టుబడితో 1000మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని డోస్‌పాక్‌ ఆటోమేషన్‌ సంస్ధ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై పరిశీలన జరిపిస్తామని, అవసరమైన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Dec 27 , 2024 | 04:05 AM