Share News

YSRCP Candidates List: నా.. నా.. నా.. నై!

ABN , Publish Date - Mar 17 , 2024 | 03:59 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 50శాతం పదవులు అమలయ్యేలా చట్టం చేసిన ప్రభుత్వం మనదే. ఆ మేరకు సీట్లలోనూ వారికి 50 శాతం కేటాయించాం’’ అని సీఎం జగన్‌ అన్నారు.

YSRCP Candidates List: నా.. నా.. నా.. నై!

  • వైసీపీ జాబితాలో సొంత వారికే వీరతాళ్లు..

  • 49 మంది రెడ్లకు సీట్లు

  • బీసీలకు దక్కింది 48 స్థానాలే..

  • రాష్ట్ర జనాభాలో వీరిదే అగ్రస్థానం

  • కేటాయింపుల్లో మాత్రం అత్తెసరే..

  • ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్‌డ్‌ స్థానాలే

  • మాటల్లో అదరగొట్టిన జగన్‌..

  • చేతల్లో తుస్సుమన్న గన్‌

  • సర్వేలంటూ 13 జాబితాలు విడుదల..

  • చివరికి అభ్యర్థులు కరువు

  • అభ్యర్థి లేక అనకాపల్లి సీటు ఖాళీ.. ‘సామాజిక న్యాయం’ ఉత్తిదే

‘‘నా.. నా.. నా.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు’’ అంటూ ఇటీవల కాలంలో ఎక్కడ సభ పెట్టినా ఊదరగొడుతున్న వైసీపీ అధినేత, సీఎం జగన్‌.. తీరా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల కేటాయింపులకు వచ్చే సరికి ‘నై’ అనేశారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగానే ఉన్నారని స్వయంగా ఆయనే చెబుతున్న బీసీలకు మొక్కుబడిగా 48 అసెంబ్లీ సీట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇదేసమయంలో తన సొంత సామాజిక వర్గం రెడ్లకు 49 సీట్లు కేటాయించి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇక, ఎస్సీ, ఎస్టీలకు వారికే రిజర్వ్‌ చేసిన స్థానాలు ఇచ్చి మహా ఘనకార్యం చేశామని గొప్పలు చెప్పుకొన్నారు.

అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) అట్టహాసంగా ఇడుపులపాయలో ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంటు సభ్యుల జాబితా మేడి పండును తలపిస్తోంది. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఉద్ధరించని విధంగా తాము బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేశామన్న మాటలు నేతిబీరనే తలపించాయి. రాష్ట్రంలో మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలకు మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 48 సీట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. ఇదేసమయంలో కొన్ని జిల్లాలకే పరిమితమైన తన సొంత సామాజిక వర్గం రెడ్లకు మాత్రం 49 సీట్లు ఇచ్చి పైచేయి నిరూపించుకున్నారు. ఇక, ఎస్సీ, ఎస్టీలకు వారికి కేటాయించిన రిజర్వ్‌డ్‌ స్థానాలనే ఇచ్చి ఏదో మేలు చేశామన్న గొప్పలు చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే వైసీపీ ప్రకటించిన అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల పంపకాలు మొత్తం తన వారి చుట్టూనే తిరగడం గమనార్హం.

జాబితాలు ఏమయ్యాయి?

సింహం సింగిల్‌గా వస్తుందంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసిన సీఎం జగన్‌.. నియోజకవర్గాల సమన్వయకర్తలతో కూడిన 13 జాబితాలు ప్రకటించారు. అయినప్పటికీ అభ్యర్థుల కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది. శనివారం 175 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించినా, 25 లోక్‌సభ స్థానాల్లో అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించలేకపోయారు. ఏడాది నుంచే అభ్యర్థుల ఎంపికకు జగన్‌ కసరత్తు చేసినా పూర్తిస్థాయిలో ఖరారు చేయలేకపోయారు. పాలకపక్షం నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు ముఖ్యనాయకులెవరూ ముందుకు రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగాలంటూ జగన్‌ స్వయంగా కోరినా ముఖ్యనేతలు చేతులెత్తేశారు. వైసీపీ స్థాపించాక మొదటిసారి జగన్‌కు ఇలాంటి అనుభవం ఎదురవడం గమనార్హం. గత డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలో అధికారపక్షం బీఆర్‌ఎస్‌ తన సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చలేదు. ఫలితంగా ఆ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. ఇదే విషయాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తన మిత్రుడైన జగన్‌కు చెప్పినట్టు సమాచారం. దీంతో జగన్‌ తన పార్టీ అభ్యర్థుల విషయంలో ముందే జాగ్రత్తపడ్డారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను సమూలంగా మార్చేస్తానని ప్రకటించారు. టికెట్ల విషయంలో మొహమాటాలేమీ ఉండబోవంటూ గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాపులో ఎమ్మెల్యేలకు, మంత్రులకు స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యేలను గంపగుత్తగా మార్చేస్తారేమోనని చాలామంది ఆందోళన చెందారు. దీంతో, రానురాను వారు గడప గడపకూ కార్యక్రమాల్లో పాల్గొనడమే మానేశారు. ఇలా మానేసిన వారందరినీ మార్చేసి కొత్తవారిని అసెంబ్లీ స్థానాల్లో సమన్వయకర్తలుగా నియమిస్తానంటూ జగన్‌ హెచ్చరికలు కూడా చేశారు. అయినప్పటికీ పాలకపక్ష ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. గత డిసెంబరు 27న తొలివిడతలో 11మంది అసెంబ్లీ ఇన్‌చార్జులను ప్రకటించారు. వీరిలో ముగ్గురు మంత్రులు విడదల రజని, ఆదిమూలపు సురేశ్‌, మేరుగ నాగార్జున కూడా ఉన్నారు. ఇలా వెనుకబడ్డ సామాజికవర్గానికి చెందిన నేతలను బదిలీ చేయడం మినహా జగన్‌ కఠిన నిర్ణయాలను తీసుకోలేకపోయారు.

సామాజిక న్యాయం ఏదీ?

తొలి నుంచి సామాజికన్యాయం అమలు చేస్తానంటూ జగన్‌ హడావుడి చేస్తూ వచ్చారు. దీంతో.. జనరల్‌ స్థానాల్లో సైతం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను బరిలోకి దింపి కొత్త రాజకీయ సంప్రదాయానికి తెరతీస్తారేమోనని అందరూ భావించారు. కానీ, 2019 తరహాలోనే 2024లోనూ 175 మంది ఎమ్మెల్యే, 25 మంది లోక్‌సభ అభ్యర్థుల్లో 33 మంది ఎస్సీ అభ్యర్థులను, 8 మంది ఎస్టీలను రిజర్వుడు స్థానాలకే పరిమితం చేశారు. రాజకీయంలో కొత్తదనం తెస్తానన్న తన మాటను తానే తప్పి.. జనరల్‌ స్థానాల్లో బడుగు, బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. రాష్ట్రంలో బీసీలు దాదాపు 53 నుంచి 62 శాతం ఉన్నారు. జగన్‌ చెప్పిన మాట ప్రకారం.. మొత్తం 200 స్థానాల్లో సగం స్థానాలను(100 సీట్లు) బీసీలకు ఇవ్వాలి. కానీ.. అసెంబ్లీ, పార్లమెంటు రెండు కలిపి కేవలం 59 స్థానాలకే బీసీలను పరిమితం చేశారు. ఇదే సమయంలో 200 స్థానాలలో 100 సీట్లను అగ్రవర్ణాలకు కేటాయించారు. 25 లోక్‌సభ స్థానాల్లో 4 ఎస్సీ, 1 ఎస్టీ, 11 బీసీలకు, 9 అగ్రవర్ణాలకు కేటాయించారు. 2019తో పోల్చితే.. 2024లో మహిళలకు 4స్థానాలు అధికం గా ఇచ్చామని చెప్పారు. 2019లో 15గా ఉన్న మహిళల సీట్లను 19కు పెంచామని తెలిపారు. ఈ గణాంకాల మాటెలా ఉన్నా.. 175 మంది అభ్యర్థులలో 49మంది ‘రెడ్ల’కే సీట్లు దక్కాయి. రాష్ట్రంలో రెడ్ల జనాభా అంతంతగానే ఉన్నప్పటికీ.. వెనుకబడ్డవారికి కేటాయించిన 48 స్థానాల కంటే ఒక స్థానం అధికంగా కేటాయించి వారిదే పైచేయిగా చూపించారు. బడుగు బలహీనవర్గాలను కసిరికొట్టి సొంత సామాజికవర్గం రెడ్డి నేతలు 49 మందికి జగన్‌ అవకాశం కల్పించడంపై రాజకీయపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీసీలకు అన్యాయం చేస్తూనే చారిత్రాత్మక జాబితా అంటూ జగన్‌ ప్రకటించుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.

అలా ప్రకటించి.. ఇలా తీసేసి!

అనకాపల్లి లోక్‌సభ స్థానానికి సీఎం జగన్‌ తొలుత సామాజికంగా వెనుకబడ్డ వర్గానికి చెందిన రమాదేవి పేరును ప్రకటించారు. కానీ.. ఇప్పుడు అర్థంతరంగా ఆమెను పక్కన పెట్టేశారు. అనకాపల్లి నంచి బీజేపీ బరిలోకి దిగే చాన్సుందని భావిస్తున్న ఆయన.. అక్కడ నుంచి బలమైన సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపే వ్యూహంలో ఇక్కడ అసలు అభ్యర్థినే ప్రకటించకపోవడం గమనార్హం.

ఓడిపోతారని తెలిసీ..

వైసీపీ ఎంపీలు రఘురామకృష్ణరాజు(నరసాపురం), సంజీవ్‌కుమార్‌(కర్నూలు), లావు శ్రీకృష్ణదేవరాయలు(నరసరావుపేట), మాగుంట శ్రీనివాసులు రెడ్డి(ఒంగోలు), వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి(రాజ్యసభ), వల్లభనేని బాలశౌరి(మచిలీపట్నం)లు వైసీపీకి దూరమయ్యారు. దీంతో.. వైసీపీకి బలమైన అభ్యర్థులు దొరకడమే కష్టమైపొయింది. దీంతో.. కొత్తగా ఎవరు వచ్చినా కండువా కప్పి టికెట్‌ ఇచ్చేయడం వైసీపీలో పరిపాటిగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ నుంచి వైసీపీలోకి చేరకముందే, జగన్‌ చేతుల మీదుగా కండువాను కప్పుకోకముందే ఆయనకు టికెట్‌ ప్రకటించేశారు. అదేవిధంగా ఇటీవలే వైసీపీ గూటికి చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వారికి టికెట్‌ దక్కదంటూ సొంత పార్టీనేతలే ప్రచారం చేశారు. కానీ, అభ్యర్థుల కొరతతో వీరు ఓడిపోతారని తెలిసినా టికెట్లు ఇచ్చారంటే పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుందని ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రజలపై నమ్మకంతోనే మార్పులు చేశాం టికెట్‌ రానివారికి మళ్లీ గెలిచాక గుర్తింపు: సీఎం

కడప, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 50శాతం పదవులు అమలయ్యేలా చట్టం చేసిన ప్రభుత్వం మనదే. ఆ మేరకు సీట్లలోనూ వారికి 50 శాతం కేటాయించాం’’ అని సీఎం జగన్‌ అన్నారు. శనివారం ఇడుపులపాయలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలుత తండ్రి వైఎస్‌ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జాబితా విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. 25పార్లమెంట్‌ స్థానాలకు, 175 ఎమ్మెల్యే స్థానాలకు తుది జాబితా విడుదల చేశామన్నారు. దీనిలో అనకాపల్లి ఎంపీ స్థానం ఒక్కటి పెండింగ్‌లో పెట్టామన్నారు. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించగలిగామని చెప్పారు. ఈ ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేలను మార్చినట్టు చెప్పారు. 18ఎంపీ స్థానాలకు మార్పు జరిగిందన్నారు. ప్రజల మీద నమ్మకంతోనే మార్పులు చేశామన్నారు. టికెట్‌ రాని వాళ్లకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే సముచితస్థానం కల్పిస్తామన్నారు. కాగా, సీఎం మాట్లాడటానికి ముందు ఎంపీ అభ్యర్థుల జాబితాను ఎంపీ నందిగం సురేశ్‌బాబు, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్‌ చదివి వినిపించారు.

Updated Date - Mar 17 , 2024 | 08:04 AM