ఉద్యోగాల కల్పనకే నైపుణ్య గణన
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:46 AM
యువతకు ఉద్యోగాల కల్పనే నైపుణ్య గణన లక్ష్యమని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. నిరుద్యోగ యువతకు ఈ నైపుణ్య గణన ఉపయోగపడాలని అధికారులకు సూచించారు.

కంపెనీలకు అందుబాటులో నిరుద్యోగుల సమాచారం: లోకేశ్
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): యువతకు ఉద్యోగాల కల్పనే నైపుణ్య గణన లక్ష్యమని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. నిరుద్యోగ యువతకు ఈ నైపుణ్య గణన ఉపయోగపడాలని అధికారులకు సూచించారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. నైపుణ్య గణన సమయంలోనే యువత సర్టిఫికెట్లు, అర్హతలను ఏకీకృతం చేయాలన్నారు. దానివల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. నైపుణ్యాలపై ప్రాథమిక మూల్యాంకనానికి మైక్రోసాఫ్ట్ సంస్థ అంగీకరించిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గణన సమయంలో ఇళ్ల వద్ద లేనివారు యాప్ ద్వారా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. గణన పూర్తయిన తర్వాత జె.పాల్ సంస్థ ద్వారా విశ్లేషించాలని మంత్రి ఆదేశించారు. గణన అనంతరం ఆ సమాచారాన్ని పరిశ్రమలకు అందుబాటులో ఉంచితే, అవసరమైన వారిని ఉద్యోగాల్లో తీసుకుంటారన్నారు. నైపుణ్య గణన డేటాను లింక్డిన్, నౌకరీ.కామ్, జాబ్ ఎక్స్ లాంటి సంస్థలతో అనుసంధానం చేయాలన్నారు.
ట్రెయిన్ అండ్ హైర్ విధానంలో యూనివర్సిటీల్లోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ముందుకొచ్చాయని అధికారులు తెలిపారు. కాగా, నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ ఆధ్వర్యంలో అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుచేసి, నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ ఇవ్వాలని మంత్రి సూచించారు. ఓంక్యాప్ ద్వారా విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. అమరావతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు.