Share News

TDP: టీడీపీ ‘రా..కదలిరా’ సభ నేడు.. గుడివాడలో హై టెన్షన్..

ABN , Publish Date - Jan 18 , 2024 | 08:10 AM

కృష్ణాజిల్లా: ‘రా కదలిరా’ పేరుతో గురువారం గుడివాడలో తెలుగుదేశం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేయగా.. దాదాపు లక్ష మంది వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

TDP: టీడీపీ ‘రా..కదలిరా’ సభ నేడు.. గుడివాడలో హై టెన్షన్..

కృష్ణాజిల్లా: ‘రా కదలిరా’ పేరుతో గురువారం గుడివాడలో తెలుగుదేశం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేయగా.. దాదాపు లక్ష మంది వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అలాగే ఈరోజు నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో ఆయన స్వగ్రామం నిమ్మకూరులో చంద్రబాబు నివాళులర్పించి.. ఆ తర్వాత గుడివాడ సభలో పాల్గొంటారు. అటు ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో పోటా పోటీగా టీడీపీ, వైసీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతిలో భాగంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో కొడాలి నాని ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. గుడివాడ పట్టణ వ్యాప్తంగా కొడాలి నాని.. వెనిగళ్ల రామ్మోహన్‌ ఫ్లెక్సీలు వెలసాయి. కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామని వెనిగళ్ల రామ్మోహన్‌ హెచ్చరించారు.

కాగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం గురువారం ఎన్టీఆర్‌ జిల్లా గుడివాడలో జరగనుంది. ఎన్టీఆర్‌ స్వస్థల ప్రాంతమైన గుడివాడలో ఈసారి ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమాయత్తం అయ్యాయి. గుడివాడ పట్టణ శివార్లలోని మల్లాయపాలెంలో పెద్ద బహిరంగ సభను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి దీనిని మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. ఈ సభ నిర్వహణను విజయవంతం చేయడం ద్వారా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక ఊపు తేవడానికి ఆ పార్టీ వ్యూహ రచన చేసింది. ఈసారి గుడివాడలో గెలుపును టీడీపీ కీలకంగా పరిగణిస్తోంది. ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా ప్రవాసాంధ్రుడు వెనిగళ్ల రామ్మోహన్‌ను ఇటీవల నియమించారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ప్రత్యామ్నాయం చూపుతామని పార్టీ నాయకత్వం హామీ ఇవ్వడంతో ఆయన కూడా రామ్మోహన్‌తో కలిసి పనిచేస్తున్నారు.

గుడివాడతోపాటు పొరుగున ఉన్న పామర్రు, గన్నవరం తదితర నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ శ్రేణులను సమీకరించి ఘనంగా ఈ సభను నిర్వహించే లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు ఈ సభలో పాల్గొంటున్నారు. ఇక్కడి ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరుతున్న ఆయన మొదట ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరును మధ్యాహ్నం మూడు గంటలకు సందర్శిస్తారు. అక్కడ రామారావు విగ్రహానికి పుష్పమాల వేసి నివాళి అర్పిస్తారు. పి 4 అన్న పేరుతో దారిద్య్ర నిర్మూలనపై రూపొందించిన ఒక పత్రాన్ని అక్కడ విడుదల చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలను ఆర్థికంగా పైకి తేవడం లక్ష్యంగా ఈ పత్రాన్ని రూపొందించారు. ఎన్టీఆర్‌ వర్ధంతి రోజు దీనిని విడుదల చేయాలని ఆయన నిర్ణయించారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లోనే గుడివాడ చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకూ ఈ సభ జరుగుతుంది. తర్వాత ఆయన రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన నివాసానికి తిరిగి వస్తారు.

Updated Date - Jan 18 , 2024 | 10:38 AM