Share News

Fangal Cyclone: తుఫాన్ నష్టాన్ని మంత్రి గొట్టిపాటికి వివరించిన అధికారులు

ABN , Publish Date - Dec 02 , 2024 | 09:55 AM

Andhrapradesh: విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. 95 శాతం మేరకు విద్యుత్ పునరుద్ధరణ పనులను అధికారులు పూర్తి చేశారు. మధ్యాహ్నం కల్లా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని మంత్రికి తెలిపారు. ప్రజలకు ఏ ఇబ్బందీ రానీయొద్దని.. తుపాన్ తగ్గే వరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు.

Fangal Cyclone: తుఫాన్ నష్టాన్ని మంత్రి గొట్టిపాటికి వివరించిన అధికారులు
Minister Gottipati ravikumar

అమరావతి, డిసెంబర్ 2: తుఫాను ప్రభావిత ప్రాంతాల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati ravikumar) ఈరోజు (సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుతం తుఫాను ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుఫాను నష్టాన్ని మంత్రి గొట్టిపాటికి అధికారులు వివరించారు. తిరుపతి జిల్లా పరిధిలో అధిక శాతం నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

జగన్‌పై ఏసీబీ విచారణ చేపట్టాలి: యనమల


మంత్రి ఆదేశాలతో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక బృందాలతో అధికారులు పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అయితే 95 శాతం మేరకు విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయని.. మధ్యాహ్నం కల్లా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని మంత్రికి తెలిపారు. ప్రజలకు ఏ ఇబ్బందీ రానీయొద్దని.. తుపాన్ తగ్గే వరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు.


భారీ నుంచి అతిభారీ వర్షాలు..

కాగా.. ఫెంగల్‌ తుఫాన్‌ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరంపైకి వచ్చినప్పటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు(సుమారు 12 గంటలపాటు) అక్కడే స్థిరంగా కొనసాగిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఆదివారం రాత్రి తరువాత మరింత బలహీనపడి పశ్చిమ, వాయువ్యంగా పయనిస్తూ కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం ఉదయం వరకు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవడంతో లోతట్టుప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కోస్తా, రాయలసీమల్లోని మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వరి, పత్తి, మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తుఫాన్‌ తీరం దాటడంతో అన్ని ఓడరేవుల్లో హెచ్చరికలను ఉపసంహరించారు.


తిరుపతిలో రికార్డు స్థాయిలో వర్షం...

తుఫాన్‌ ప్రభావంతో 24 గంటల్లో తిరుపతి జిల్లా పుత్తూరులో రికార్డు స్థాయిలో 187 మిల్లీమీటర్ల వాన పడింది. మనుబోలులో 153.2, రాచపాలెంలో 152.5, సూళ్లూరుపేట మండలం మన్నార్పోడులో 149.25, తడ మండలం భీములవారిపాలెంలో 137, చిటమూరు మండలం మల్లాంలో 134.5, నెల్లూరు జిల్లా మునుబోలులో 133.5, దొరవారిసత్రం మండలం పూలతోటలో 124, నగరిలో 120.75, సూళ్లూరుపేటలో 118 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాగు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన పడింది. రానున్న 48గంటల్లో కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

వార్ జోన్‌గా మారిన తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దు..

ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 02 , 2024 | 11:01 AM