Andhra Pradesh: పరిశ్రమలకు కరెంట్ షాక్
ABN , Publish Date - Nov 30 , 2024 | 07:58 AM
కొన్ని దశాబ్దాల పాటు స్థిరంగా ఉంటున్న ఈ విద్యుత్ సుంకాన్ని కిందటి వైసీపీ ప్రభుత్వంలో రూపాయికి పెంచారు. దీంతో పారిశ్రామిక రంగంపై భారం పడింది. కరోనా అనంతర పరిస్థితుల్లో ఈ విద్యుత్ సుంకం పారిశ్రామిక రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఫలితంగా కొన్ని పరిశ్రమలు..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వినియోగదారులపై విద్యుత్ సుంకం అనేది ఎప్పటినుంచో ఉంది. ప్రజలపై కానీ, పరిశ్రమలకు కానీ 1964 నుంచి కేవలం ఆరు పైసలే ఎనర్జీ డ్యూటీ (ఈడీ) విధించేవారు. కొన్ని దశాబ్దాల పాటు స్థిరంగా ఉంటున్న ఈ విద్యుత్ సుంకాన్ని కిందటి వైసీపీ ప్రభుత్వంలో రూపాయికి పెంచారు. దీంతో పారిశ్రామిక రంగంపై భారం పడింది. కరోనా అనంతర పరిస్థితుల్లో ఈ విద్యుత్ సుంకం పారిశ్రామిక రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఫలితంగా కొన్ని పరిశ్రమలు వెంటిలేటర్‌పైకి చేరాయి. భారీ యంత్రాలు వినియోగించే పరిశ్రమలు ఎక్కువగా ఈ ప్రభావానికి గురయ్యాయి. వీటిలో ఎక్కువగా స్పిన్నింగ్ మిల్లులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 95 స్పిన్నింగ్ మిల్లులు ఉంటే, అందులో 35 వరకు మూతపడ్డాయి. ఎన్టీఆర్ జిల్లాలో రెండు, కృష్ణాజిల్లాలో రెండు స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి.
ట్రూ అప్ చార్జీలు మరో భారం
ట్రూ అప్ చార్జీల భారం పారిశ్రామిక రంగానికి గుదిబండగా మారింది. 2014–19లో ట్రూ అప్ చార్జీలు 22 పైసలుండగా, 2023–24లో 40 పైసలకు చేరింది. ఇది విద్యుత్ వినియోగదారులపై తీవ్ర భారాన్ని మోపింది. తాజాగా 2022–23లో రూ.6 వేల కోట్ల నష్టాన్ని చూపిస్తూ 60 పైసలు, 2023–24లో పెంచని కారణంగా చవిచూసిన 11 వేల కోట్ల నష్టాలకు కలిపి రూపాయి చొప్పున విధించబోయే పరిస్థితులు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కూటమి ప్రభుత్వంలోనూ..
కిందటి వైసీపీ ప్రభుత్వం విధించిన విద్యుత్ సుంకం చార్జీలు టీడీపీ కూటమి ప్రభుత్వంలో అయినా తగ్గుతాయనుకుంటే ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశం ఆ ఆశ కూడా లేకుండా చేసింది. పరిశ్రమల వరకు ఈ సుంకాన్ని యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకోవటంతో పారిశ్రామిక రంగం షాక్‌కు గురైంది. కాగా, డిస్కమ్స్, విద్యుత్ సంస్థల అసమర్థత కారణంగా తలెత్తిన నష్టాలను పరిశ్రమలపై మోపడం తగదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. పెంచదలచుకుంటే సహేతుకంగా ఉండేలా 10 నుంచి 12 పైసల వరకు పెంచాలంటున్నారు. అలాకాకుండా, అధికారులు చెప్పారని కిందటి ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయటం సరికాదనేది పారిశ్రామికవేత్తల వాదన.
మనుగడ కష్టమే..
ఎనర్జీ డ్యూటీ (ఈడీ)ని కిందటి ప్రభుత్వంలో రూపాయికి పెంచారు. ప్రస్తుత ప్రభుత్వం దీనిని 12 పైసలకు తగ్గించాలని కోరుతున్నాం. పరిశ్రమలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. వీటిపై ఆధారపడి ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. సిక్ ఇండస్ట్రీస్‌ను బతికించటానికి విద్యుత్ సుంకంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. స్పిన్నింగ్ మిల్లులపై రోజుకు రూ.20 వేలు, నెలకు రూ.20 లక్షలు, ఏడాదికి రూ.2.40 కోట్ల మేర భారం పడుతోంది. ఒక స్పిన్నింగ్ మిల్లు లేదా ఏదైనా పరిశ్రమకు ఏడాదికి రూ.2 కోట్ల లాభం వస్తే.. రూ.2.40 కోట్ల చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఇలాంటి వాటివల్ల స్వల్ప లాభాలతో ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం విద్యుత్ సుంక నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి.
– పి.కోటిరావు, ఏపీ చాంబర్స్ డైరెక్టర్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here