Share News

YS Jagan: జగన్‌ కేసు ఏ దశలో ఉంది... సుప్రీం ప్రశ్నలు

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:19 AM

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతి ఏ దశలో ఉందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో జగన్ అక్రమాస్తులపై దాఖలైన కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

YS Jagan: జగన్‌ కేసు ఏ దశలో ఉంది... సుప్రీం ప్రశ్నలు
Former CM YS Jaganmohan Reddy

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో (Supreme Court) విచారణ వాయిదా పడింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయడమే కాకుండా కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో సుప్రీంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు (సోమవారం) విచారించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతి ఏ దశలో ఉందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో జగన్ అక్రమాస్తులపై దాఖలైన కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

Fangal Cyclone: తుఫాన్ నష్టాన్ని మంత్రి గొట్టిపాటికి వివరించిన అధికారులు


రోజు వారీ విచారణకు ఆదేశించినా ఎక్కడ ఆటంకం కలుగుతుందని ప్రశ్నించింది. ఏఏ కోర్టులలో ఏఏ కేసులు దాఖలయ్యాయి... వాటి విచారణ ఏ దశలో ఉందో తెలుపుతూ సమగ్రంగా పట్టిక రూపంలో ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తరువాత ఏం చేయాలో చెబుతామని జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్ 13కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.


కాగా.. గతంలో జగన్ ఏపీ సీఎంగా ఉన్నప్పుడు రఘురామకృష్ణ రాజు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, తెలంగాణ సీబీఐ కోర్టులో విచారణ మందకొడిగా సాగుతోందని, విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడమే కాకుండా రోజువారీ విచారణ జరపాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సుప్రీంలో అనేక సార్లు విచారణ జరిగింది. సీజేఐగా జస్టిస్ సంజీవ్ కన్నా నియమితులైన తర్వాత ఆయన బెంచ్‌ ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే ఆయన బెంచ్‌లో మరో న్యాయమూర్తి అయిన సంజయ్‌ కుమార్ ఈ పిటిషన్‌ను నాట్ బిఫోర్‌ మీ అనడంతో వాయిదా పడింది. దీంతో ఈరోజు జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో అనేక దశల్లో, అనేక పిటిషన్లు, ఎన్నో విచారణ జరుగుతుండటంతో గందరగోళ పరిస్థితి ఉందని.. అసలు ఎక్కడెక్కడ ఏఏ పిటిషన్‌లు విచారణలో ఉన్నాయి, సీబీఐ కోర్టులో ఇప్పటి వరకు ఎందుకు విచారణ జరగడం లేదు.. సీబీఐ కోర్టులో రోజువారీ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎందుకు విచారణ జరగడం లేదని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.


డిశ్చార్జ్ పిటిషన్‌లకు సంబంధించిన విచారణ జరుగుతోందని అందుకే అక్కడ రోజువారీ విచారణకు ఆటంకం కలుగుతోందని జగన్‌ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్‌లు వేశారని.. ఎందుకు ఇంత జాప్యం జరుగుతోందని ధర్మాసనం మరో ప్రశ్న వేసింది. అలాగే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదని ప్రశ్నించడంతో పాటు సుప్రీంకోర్టులో జగన్ అక్రమాస్తులకు సంబంధించి పిటిషన్లు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయని ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై ఓ పట్టిక రూపంలో అఫిడవిట్‌లా ఇవ్వాలని.. దాన్ని చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు చెప్పిప్పటికీ విచారణ జరగడం లేదంటే దీనిపై ఓ కచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది. అయితే ఈ కేసును జనవరికి వాయిదా వేయాలని జగన్‌ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది కోరగా.. అందుకు సుప్రీం నిరాకరిస్తూ డిసెంబర్ 13న విచారణ జరుపుతామంటూ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం వాయిదా వేసింది. జగన్‌కు సంబంధించిన అక్రమాస్తులకు సంబంధించి అన్ని కోర్టుల్లో దాఖలైన పిటిషన్ల వివరాలు తెలుసుకున్న తరువాత సమగ్రమైన నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.


ఇవి కూడా చదవండి..

వార్ జోన్‌గా మారిన తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దు..

ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 02 , 2024 | 11:43 AM