Justice NV Ramana : ‘భాష’ ధ్యాస ఉన్నవారికే ఓట్లు!
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:30 AM
‘‘భాషాభివృద్ధికి పాటుపడే పాలకులకు మాత్రమే ఓట్లు వేస్తామని ప్రజలు నిర్ణయించుకుంటే అన్ని రాజకీయ పార్టీలు తెలుగు భాషకు పట్టం కడతాయి.

ప్రజలు ఆ దిశగా అడుగులేయాలి
అప్పుడే భాషకు ప్రభుత్వాల పెద్దపీట
వైసీపీ జారీ చేసిన జీవో 85ను రద్దు చేయాలి
భాషా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలి
సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ
తానూ వైసీపీ సర్కారు బాధితుడినేనని ప్రారంభోపన్యాసంలో ఉద్ఘాటన
బెజవాడలో ఘనంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం
విజయవాడ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘‘భాషాభివృద్ధికి పాటుపడే పాలకులకు మాత్రమే ఓట్లు వేస్తామని ప్రజలు నిర్ణయించుకుంటే అన్ని రాజకీయ పార్టీలు తెలుగు భాషకు పట్టం కడతాయి. ప్రభుత్వాలు పెద్దపీట వేస్తాయి. భాష ధ్యాస ఉన్నవారికే ఓట్లు వేయాలి’’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాజకీయ పార్టీలకు ప్రజల మద్దతు అవసరం కాబట్టి ప్రజలే ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అప్పుడు ప్రతి రాజకీయ పార్టీ భాషాభివృద్ధిపై దృష్టి సారిస్తుందని అభిప్రాయపడ్డారు. తెలుగు భాషా రచయితలు, కవులు, భాషాభిమానులు ఎన్ని మహాసభలు నిర్వహించినా, ఎన్ని నినాదాలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఈ పరిస్థితిని మార్చే ఆయుధం ప్రజల ఓటేనని స్పష్టం చేశారు. ప్రజలను ఆ విధంగా చైతన్యపరిచేలా రచయితలు తమ రచనలు సాగించాలని సూచించారు. ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలు విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండీ శైలజా కిరణ్ జ్యోతి వెలిగించి మహాసభలను ప్రారంభించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘భాషాభిమానం ఉన్నవారు ముఖ్యమంత్రులు, మంత్రులుగా ఉన్నప్పుడు భాషకు న్యాయం జరుగుతుంది. రచయితలు దివిటీపట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే రచనలు చేయాలి. మానవ సంబంధాలను స్ఫురింపజేసే రచనలు చేసేవారికి ప్రజాభిమానం ఉంటుంది. రచయితలు.. ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు, రివార్డులు మరిచిపోయి రచనలు చేయాలి. ప్రజలే భాషను నిర్మించుకోవాలి. భాషను పరిపుష్ఠి చేయడమంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు.
భావవ్యక్తీకరణకు భాష ఒక ఆయుధం. భాష అంతరించిపోతే పత్రికలు చదివేవారు, చానళ్లు వీక్షించేవారు కూడా ఉండరు. పత్రికలు, చానళ్లు భాషాభివృద్ధికి పాటుపడాలి. భాష విషయంలో తమిళనాడులో ఉన్న ఐక్యత తెలుగు ప్రజల్లోనూ రావాలి. రాష్ట్రంలో వీలైనంత త్వరగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో ఉన్న తెలుగు వర్సిటీ తెలంగాణకు వెళ్లిపోయినందున అక్కడ ఉన్న సిబ్బంది, విద్యార్థుల గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడానికి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 85ను కూటమి సర్కారు రద్దు చేయాలి. దీనికి సంబంధించి గుంటుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు జీవోను రద్దు చేసింది. అయినా, వైసీపీ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రంలో తిరిగి భాషా ప్రాధికార సంస్థను నెలకొల్పాలి. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించాలి. ప్రబంధాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి తెలుగు అనేక రూపాలు తీసుకుంది. కథలు, నాటకాలు, కవిత్వంగా మారింది. తెలుగు పలుకుబడి ఎంతో వినసొంపుగా, వినడానికి సంగీతంలా ఉంటుంది. రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం మాతృభాషను కొల్లగొట్టడం సహింపరానిది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
మాతృభాషతోనే అభివృద్ధి
స్వాతంత్య్ర పోరాటంలో తెలుగువారికి తగిన గుర్తింపు రాలేదని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాష అభివృద్ధితోనే దక్షిణ కొరియా అమెరికా కంటే మెరుగైన మేధోసంపత్తిని, అభివృద్ధిని సాధించిందన్నారు. దక్షిణ కొరియాలో పరిశోధనలన్నీ అక్కడి మాతృభాషలోనే జరుగుతున్నాయని తెలిపారు. భాషాభిమానంతోనే బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా అవతరించిందని, పాలకులు ఈ విషయాలను గుర్తించాలని సూచించారు. పరభాషా సంస్కృతిలో ఉన్న మంచి విషయాలను నేర్చుకోవడంలో తప్పులేదని, అయితే, మొత్తంగా పరభాషనే గుడ్డిగా ఉపయోగిస్తే మొదటికే ప్రమాదం వస్తుందని హెచ్చరించారు. తెలుగులో చదవడం, మాట్లాడడమంటే వెనకబడిపోవడం అన్న భావన చాలామందిలో ఉందని, ఇది చాలా తప్పని వ్యాఖ్యానించారు. మన సుఖదుఃఖాలను పిల్లలతో తెలుగులో పంచుకోవడానికి, సంభాషించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. శ్రీశ్రీ, ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, గురజాడ, కందుకూరి వం టివారు తెలుగు భాష పరిరక్షణకు కంకణం కట్టుకుని పనిచేశారని తెలిపారు. తెలుగు వారసత్వ భాష అని, దీని గురించి పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయాలని సూచించారు.
నేనూ బాధితుడినే!
వైసీపీ ప్రభుత్వం వేధించిన వారిలో తాను కూడా ఒక బాధితుడినేనని జస్టిస్ ఎన్వీ రమణ పరోక్షంగా వ్యాఖ్యానించారు. తెలుగు భాష అభివృద్ధి, పాఠశాలల్లో తెలుగు మాధ్యమం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగును అణగదొక్కడానికి గత ప్రభుత్వం జీవో 85ను తీసుకొచ్చిందన్నారు. ఆ ప్రభుత్వంలో అనేక ఘటనలు జరిగాయని, వాటిలో తాను కూడా ఒక బాధితుడిగా మిగిలానని పేర్కొన్నారు.
అదనపు మార్కులు ఇవ్వాలి
తెలుగు మాధ్యమంలో చదువుతున్నవారికి విద్య, ఉద్యోగాల్లో 3-5 శాతం అదనపు మార్కులు ఇవ్వాలి. ఈ విధానాన్ని అమలు చేస్తే తెలుగు భాష మనుగడకు ఎలాంటి ప్రమాదం ఉండదు. దేశంలో ఒకప్పుడు రెండోస్థానంలో ఉన్న తెలుగు భాష నాలుగో స్థానానికి పడిపోవడం బాధాకరం. దేశంలో 15కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. భాష విషయంలో ప్రజల్లో వస్తున్న మార్పులు చూస్తుంటే భయమేస్తోంది. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాలను తీసేస్తున్నారు. భాష లేనప్పుడు జాతికి మనుగడ ఉండదు.
- ఎన్. తులసిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత
‘తెలుగు’ కోసం నిరాహారదీక్ష
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి. ప్రజలు దీనికోసం పోరాటం చేయాలి. అవసరమైతే నేనే నిరాహార దీక్షకు దిగుతాను. నేను ఎప్పటికీ తెలుగు బిడ్డనే. తమిళనాడులో అన్ని పాఠశాలల్లో తమిళ మాధ్యమాన్ని కచ్చితంగా అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తెలుగు పత్రికల సర్క్యులేషన్ పెరిగేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. తమిళులకు ఇబ్బంది వస్తే ఆ సమాజం మొత్తం రాజకీయాలకతీతంగా స్పందిస్తుంది. అదే ఐక్యత తెలుగు జాతిలోనూ రావాలి. - ఎంపీ గోపీనాథ్ (కృష్ణగిరి, తమిళనాడు)
ఆధునికతను ఆహ్వానిస్తూనే ‘అమ్మ’ను కాపాడుకోవాలి
సమాజంలో రోజురోజుకూ వస్తున్న ఆధునికతను ఆహ్వానిస్తూనే మాతృభాష, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి. ఇప్పటికీ గ్రామాల్లో రైతులు 1,000 రకాల ధాన్యాల పేర్లను చకచకా చెబుతారు. మార్కెట్ శక్తులు మొట్టమొదట దాడి చేసేది భాష మీదే. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా తెలుగు భాష పరిరక్షణకు పాటుపడాల్సిన అవసరం ఉంది.
- గోరటి వెంకన్న, తెలంగాణ ఎమ్మెల్సీ
సాహిత్యంతో సమాజంలో మార్పు
శాసనాల ద్వారా సమాజాన్ని కొంతవరకే నియంత్రించగలం. అధిక శాతం మార్పు రావాలంటే సాహిత్యం ద్వారానే సాధ్యం. రచయితలు, కవులు, కళాకారులు కలిసి రేపటి తరానికి ఈ సభల ద్వారా దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి సభల ద్వారా తెలుగు భాష పరిపుష్ఠం కావడంతోపాటు సాహిత్యం, పద్యం, గద్యం, కథ, కథానికలు వంటి కవితా ప్రక్రియలన్నీ చిరస్థాయిగా నిలుస్తాయి. రేపటి తరం కోసం ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించడం అభినందనీయం.
- జస్టిస్ దుర్గాప్రసాద్, హైకోర్టు జడ్జి