Share News

Janasena : జనసేన.. 100% స్ట్రైక్‌ రేట్‌!

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:08 AM

గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేసి ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచిన పార్టీ.. ఆ పార్టీ అధినేత పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి పాలయ్యారు.

Janasena : జనసేన.. 100%  స్ట్రైక్‌ రేట్‌!

పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపు

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేసి ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచిన పార్టీ.. ఆ పార్టీ అధినేత పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి పాలయ్యారు. పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. పార్లమెంట్‌ ఊసే లేదు. మళ్లీ జీరో నుంచి ప్రారంభించాలి. అయినా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెనక్కి తగ్గలేదు. మొక్కవోని దీక్షతో ముందడుగు వేశారు. తక్కువ సీట్లతో ఎన్నికల బరిలోకి దిగారు. జగన్‌ను ఓడించాలన్న భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. తనకున్న ప్రజాబలంపైనే నమ్మ కం పెట్టుకున్నారు. వైసీపీని గద్దె దించడానికి భారీ యుద్ధం చేశారు. కూటమి కోసం తన సీట్లను త్యాగం చేశారు. చివరకు జనసేన పోటీచేసిన 21 స్థానాలనూ గెలిపించుకున్నారు. ముందే చెప్పినట్లు వైసీపీని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు జనసేన అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల ముందు 98శాతం స్ర్టైక్‌ రేట్‌ చూపించాలని పార్టీ నాయకులను పవన్‌ ఆదేశించారు. కానీ ప్రజలు మాత్రం జనసేన అభ్యర్థులకు 100 శాతం స్ర్టైక్‌ రేట్‌ ఇచ్చారు. పిఠాపురం నుంచి రైల్వేకోడూరు వరకూ ప్రతి అభ్యర్థి మంచి మెజారిటీతో విజయం సాధించారు. జనసేన 18స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ నాయకులే చెప్పుకున్నారు. వారు కూడా ఊహించని స్థాయిలో పోటీచేసిన అన్నిచోట్లా ఆ పార్టీ గెలుపొందింది. పిఠాపురంలో దాదాపు 69వేల మెజారిటీతో పవన్‌ గెలిచారు. తిరుపతిలో స్థానికేతరుడైనా దాదాపు 50వేల మెజారిటీతో గెలిచారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కాంగ్రెస్‌ నేతలు ఆయన్ను టార్గెట్‌ చేసి వ్యక్తిగత విమర్శలు చేశారు. అయితే ఎన్నికలకు ముందు వైఎస్‌ రాజశేఖరరెడ్డి విజ్ఞతతో ఆలోచించి, చిరంజీవిపై విమర్శల జోరు తగ్గించారు. కానీ జగన్‌ మాత్రం అహంకారంతో పవన్‌పై లేనిపోని నిందలు వేస్తూ, అనరాని మాటలన్నారు. సోషల్‌ మీడియాలో బండబూతులు తిట్టించారు.

చంద్రబాబుకు చిరంజీవి శుభాకాంక్షలు

అరుదైన విజయాన్ని అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. మీ మీద, పవన్‌ కల్యాణ్‌, మోదీ మీద ప్రజలు కనబరచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాం’అని చిరంజీవి అన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 04:08 AM