Share News

AP High Court : సాకులు చెప్పడం మీకు అలవాటైపోయింది

ABN , Publish Date - Dec 31 , 2024 | 05:18 AM

పౌరుల అక్రమ నిర్బంధం విషయంలో వాస్తవాల నిర్ధారణకు సీసీటీవీ ఫుటేజ్‌ సమర్పించాలని తాము ఆదేశించిన ప్రతిసారీ సాంకేతిక కారణాలు...

AP High Court :  సాకులు చెప్పడం మీకు అలవాటైపోయింది

  • సీసీటీవీ ఫుటేజీ ఇవ్వకుండా ఏవేవో కారణాలు చెబుతారా?

  • పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం పల్నాడు జిల్లా మాచవరం

  • ఎస్‌హెచ్‌వోపై అసహనం

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పౌరుల అక్రమ నిర్బంధం విషయంలో వాస్తవాల నిర్ధారణకు సీసీటీవీ ఫుటేజ్‌ సమర్పించాలని తాము ఆదేశించిన ప్రతిసారీ సాంకేతిక కారణాలు, ఏవో సాకులు చెప్పి పోలీసులు ఆయా ఫుటేజ్‌లను కోర్టు ముందు ఉంచడం లేదంటూ పోలీసులపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పోలీసులకు ఇది అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ అక్రమ నిర్బంధం కేసులో పోలీస్‌ స్టేషన్‌ సీసీటీవీ ఫుటేజ్‌ను సంబంధిత కోర్టు ముందు ఉంచాలని తామిచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా.. సాంకేతిక కారణాలు చూపుతూ అఫిడవిట్‌ దాఖలు చేసిన పల్నాడు జిల్లా, మాచవరం పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీటీవీ మ రమ్మతులకు చర్యలు తీసుకున్న వివరాలేవీ లేవని అందులో పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాల్సిన బాధ్యత సంబంధిత ఎస్‌హెచ్‌వోపై ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఎస్‌హెచ్‌వోపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సుమోటోగా కోర్టుధిక్కరణ కింద చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో వివరణ ఇవ్వాలంటూ ఎస్‌హెచ్‌వోను ఆదేశించింది. ఈ మేర కు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


తన సోదరుడు కటారి గోపిరాజును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కటారి నాగరాజు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం నవంబరు 2 నుంచి 8 వరకు సీసీటీవీ ఫుటేజ్‌ను పెన్‌డ్రైవ్‌లో ఉంచి సంబంధిత మేజిస్ట్రేట్‌ ముందు ఉంచాలని, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు రాగా ఎస్‌హెచ్‌వో దాఖలు చేసిన కౌంటర్‌ను ధర్మాసనం పరిశీలించింది. ఎస్‌ఎంపీఎస్‌ కాలిపోయిందని, సీపీటీవీ ఫుటేజ్‌ రిట్రీవ్‌ చేయడం సాధ్యపడనందున ఫుటేజ్‌ను కోర్టు ముందు ఉంచలేకపోయామని కౌంటర్‌లో ఎస్‌హెచ్‌వో పేర్కొనడాన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది.

Updated Date - Dec 31 , 2024 | 05:21 AM