Share News

AP News: సస్పెన్షన్‌లోనే ఏబీవీ పదవీ విరమణ

ABN , Publish Date - May 31 , 2024 | 04:08 AM

కక్ష సాధించడంలో ముఖ్యమంత్రి జగన్‌కు మించినవారు ఉండరేమో? ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, బ్యూరోక్రాట్‌ అయినా సరే ఆయన టార్గెట్‌ చేస్తే విలవిలలాడి పోవాల్సిందే.

 AP News: సస్పెన్షన్‌లోనే ఏబీవీ పదవీ విరమణ
AB Venkateshwara Rao

తొలి సస్పెన్షన్‌కు నేటితో ఐదేళ్లు.. సీఎం అయిన మర్నాడే వేటు

కోర్టు ఆదేశంతో పోస్టింగ్‌ ఇచ్చినా 14 రోజుల్లో మళ్లీ సస్పెన్షన్‌

ఐదేళ్లూ ఉద్యోగానికి దూరం.. సస్పెన్షన్‌లోనే పదవీ విరమణ చేస్తున్న డీజీ ర్యాంక్‌ అధికారి

ఈ ఘటన దేశంలోనే తొలిసారి

క్యాట్‌ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం.. ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ

విధుల్లోకి తీసుకోకుంటే ఏబీవీకి పూడ్చుకోలేని నష్టం: బెంచ్‌

సీఎస్‌ను కలిసినా మౌనమే స్పందన..

నేడు రిటైర్మెంట్‌ ఉత్తర్వులు!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్ కక్ష

కక్ష సాధించడంలో ముఖ్యమంత్రి జగన్‌కు మించినవారు ఉండరేమో? ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, బ్యూరోక్రాట్‌ అయినా సరే ఆయన టార్గెట్‌ చేస్తే విలవిలలాడి పోవాల్సిందే. ఫ్యాక్షనిస్టుల తరహాలో వెంటాడి, వేటాడి అంతు చూసే దాకా వదలని మనస్తత్వం ఆయనదని అఖిల భారత సర్వీసు అధికారులే హడలిపోతున్నారు. జగన్‌ కక్షసాధింపు చర్యలకు బలైన ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే ఇందుకు ఉదాహరణ. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఏబీవీని జగన్‌ సీఎం అయ్యాక టార్గెట్‌ చేశారు. డీజీ ర్యాంక్‌ అధికారికి ఐదేళ్ల పాటు పోస్టింగే లేకుండా చేశారు. ఒక ముఖ్యమంత్రి పనిగట్టుకుని ఒక ఐపీఎస్‌ అధికారిని ఇంతగా సాధించిన చరిత్ర దేశంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదని అఖిల భారత సర్వీసు అధికారులు విస్తుపోతున్నారు. తప్పుచేసి ఉంటే ఒకసారి సస్పెండ్‌ చేస్తారు. లేకపోతే ఏదైనా పని్‌షమెంట్‌ ఇస్తారు. కానీ ఒక డీజీ ర్యాంక్‌ అధికారి ఐదేళ్లూ పోస్టింగ్‌ లేకుండా, పైగా సస్పెన్షన్‌ కాలంలో పదవీ విరమణ చేయనుండడం దేశంలో ఇదే మొదటిసారి. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు అధికార టీడీపీ వైపు మొగ్గు చూపేలా చేశారన్న అనుమానంతో


కొనుగోలు చేయకున్నా..?

జగన్‌ ఆయనపై కక్ష గట్టారు. అసలు కొనుగోళ్లు చేయకున్నా.. నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ ఆయన్ను వేధింపులకు గురి చేశారు. 2019 మే 30న ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజు అంటే.. మే 31న ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కోసం తన కుమారుడికి చెందిన సంస్థకు ఏబీ వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్‌ ఇప్పించారన్న ఆరోపణలను సృష్టించారు. గత ప్రభుత్వంలో కొనుగోలు అంశంపై ఉన్నతాధికారుల అభ్యంతరాలు చెప్పినా వినిపించుకోలేదని అభియోగాలు మోపారు. ప్రధానంగా నిఘా పరికరాల వ్యవహారం, ఇజ్రాయెల్‌కు రహస్యాలు చేరవేశారని కూడా కేసు నమోదు చేసింది. దీంతో ఆయన్ను విధుల నుంచి తప్పించారు.


సుదీర్ఘ న్యాయపోరాటం

ప్రభుత్వం తనను సప్పెండ్‌ చేయడంపై ఏబీవీ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. తొలిసారి క్యాట్‌, కేంద్ర హోంశాఖలో ఆయనకు ఊరట దక్కలేదు. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. 2022 జూన్‌ 15న ఆయనకు ఉపశమనం లభించింది. కోర్టు జోక్యంతో ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా ఏబీవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన్ను మనశ్శాంతిగా ఉద్యోగం చేసుకోనీయలేదు. 14 రోజుల తర్వాత.. అదే ఏడాది జూన్‌ 29న మళ్లీ సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత ఆయన నిరంతర న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్‌ చేస్తూ జారీచేసిన ఉత్తర్వులపై ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించారు. ఒకే కారణంతో రెండు సార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేశారు. దీనిపై విచారణ జరిపిన క్యాట్‌ కీలక ఆదేశాలిచ్చింది. సస్పెన్షన్‌ చెల్లదని ఎత్తివేస్తూ తక్షణం బాధ్యతలు అప్పగించాలని, వేతన బకాయిలు చెల్లించాలని క్యాట్‌ ఆదేశించింది.


అమలు కాని తీర్పు....

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ చెల్లదని, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని క్యాట్‌ తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయలేదు. తీర్పు కాపీని సీఎస్‌ జవహర్‌రెడ్డికి పంపినా ప్రభుత్వం దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీఎం జగన్‌ ఆమోదం కోసం సీఎస్‌ ఫైలు పంపినా.. ఇటీవల లండన్‌ వెళ్లే ముందు జగన్‌ ఆ ఫైలు చూడటానికి నిరాకరించారని సమాచారం. దీంతో ఏబీవీని తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకునే ప్రక్రియ నిలిచిపోయింది. జగన్‌ ఒకటో తేదీన తిరిగి స్వదేశానికి వస్తారు. అయితే వెంకటేశ్వరరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయాలి. దీంతో కోర్టు తీర్పు అమలు కాకుండానే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.


ఇదే ధోరణి కొనసాగితే...

ఏబీ వెంకటేశ్వరరావు 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. వివిధ హోదాల్లో పనిచేసి 30 ఏళ్ల పాటు పోలీసు శాఖలో సేవలందించారు. 2019 ఎన్నికల ముందు ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నారు. వైసీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను పోస్టింగ్‌ నుంచి పక్కనపెట్టారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక సస్పెండ్‌ చేసి పోస్టింగే లేకుండా చేశారు. 30 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందించిన ఐపీఎస్‌ ఉన్నతాధికారి అకారణంగా సస్పెన్షన్‌ కాలంలో రిటైర్‌ కావడం అరుదైన సంఘటనగా చెప్పుకొంటున్నారు. తీవ్ర తప్పిదాలు చేసిన అధికారినైనా రిటైర్డ్‌ అయ్యే ముందు సస్పెన్షన్‌ తొలగించి, విచారణ కొనసాగేలే ఆదేశాలిస్తారు. దీనివల్ల ఆయనకు రావాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అన్నీ పొందే అవకాశం ఉంటుంది. కానీ జగన్‌ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ ఐదేళ్లు జగన్‌ ఆదేశాలతో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు చేసిన అరాచకాలకు వచ్చే ప్రభుత్వం ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తే పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రాలకు ఐఏఎ్‌సలు, ఐపీఎస్‌లు వస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Updated Date - May 31 , 2024 | 07:59 AM