Share News

Thota Trimurthulu: ‘తోట’కు బెయిల్ వచ్చినా చిక్కులు తప్పట్లే.. అనర్హుడయ్యే ఛాన్స్!

ABN , Publish Date - Apr 18 , 2024 | 09:22 AM

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసులో ప్రత్యేక కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ..

Thota Trimurthulu: ‘తోట’కు బెయిల్ వచ్చినా చిక్కులు తప్పట్లే.. అనర్హుడయ్యే ఛాన్స్!

  • పీసీఆర్‌ చట్టంతో చిక్కులే!

  • 1955లో ప్రవేశపెట్టిన ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ యాక్ట్‌

  • అంటరానితనం నేరానికి జరిమానా, కనీస శిక్ష పడినా ఎన్నికల్లో పోటీకి అనర్హులే

  • ఈ చట్టం ప్రకారం త్రిమూర్తులు అనర్హుడయ్యే చాన్స్‌

  • శిరోముండనం కేసుపై హైకోర్టుకు వెళ్లడానికి

  • సిద్ధమవుతున్న దళిత, పౌరహక్కుల సంఘాలు

(కాకినాడ–ఆంధ్రజ్యోతి)

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసులో ప్రత్యేక కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం 18నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వచ్చిందని, రెండేళ్ల లోపు శిక్ష అయినందున తోటకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బందులు లేవని అనుచరులు చెబుతున్నారు. తాను ఎన్నికల బరిలోనే ఉంటానంటూ తోట కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అట్రాసిటీ చట్టం కంటే ముందు 1955లో ప్రవేశపెట్టిన ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ యాక్ట్‌(పీసీఆర్‌) ప్రకారం అంటరానితనం నేరానికి సంబంధించిన సెక్షన్లలో జరిమానా, కనీస శిక్ష పడినా ఎన్నికల్లో పోటీకి అనర్హులే. దీని ప్రకారం తోటపై వేటు వేయాలంటూ దళిత సంఘాలు, పౌరహక్కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నాయి.


Thota Trimurthulu.jpg

పీసీఆర్‌ చట్టం అంటే..

అట్రాసిటీ చట్టం కంటే ముందు దేశంలో 1955లో ప్రవేశపెట్టిన ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్‌ చట్టం ఉండేది. ఇందులో సెక్షన్‌–8 సబ్‌క్లాజ్‌–1లో అంటరానితనం పేరుతో జరిగే నేరాల్లో జరిమానా, ఏ ఇతర చిన్న శిక్ష పడినా సదరు ప్రజాప్రతినిధి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతారని స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చట్టం కింద హైకోర్టును బాధితులు ఆశ్రయిస్తే న్యాయస్థానంలో తోటకు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు విశ్లేషించారు. అట్రాసిటీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు ఈ చట్టం కిందే కేసులు నమోదు చేస్తున్నారు. అంతకుముందున్న పీసీఆర్‌ చట్టం కింద కేసులు నమోదు చేయడం లేదు. శిరోముండనం కేసులో నేరం రుజువైనందున నిందితుడికి మరింత ఎక్కువ శిక్షపడాలని అభ్యర్థిస్తూ హైకోర్టును ఆశ్రయించవచ్చని ముప్పాళ్ల అన్నారు. పాత చట్టంకింద కేసును న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటే తోట ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారని చెప్పారు. పీసీఆర్‌ చట్టానికి మరింత కోరలు తొడిగి అట్రాసిటీ చట్టం తెచ్చిన నేపథ్యంలో న్యాయస్థానం పాత చట్టం కింద కేసును విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తీసుకుంటే మాత్రం దేశంలో ఇదొక సంచలనం అవుతుందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.

దర్జాగా ఆలయాల దర్శనానికి...

శిరోముండనం కేసులో 18నెలల జైలు శిక్ష పడిన తోట త్రిమూర్తులు బుధవారం శ్రీరామనవమి కావడంతో అనుచరులతో కలసి మండపేటలో ఆలయాలను దర్శించుకున్నారు. ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ తోట తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అటు వైసీపీ అధిష్ఠానం సైతం తోటకు మండపేట టికెట్‌ రద్దు చేయాలంటూ దళిత సంఘాలు పట్టుబడుతున్నాయి.

Thota-Trimurthulu-3.jpg

తోట, అనంతబాబును రీకాల్‌ చేయాలి

దళిత ద్రోహులైన తోట త్రిమూర్తులు, అనంతబాబులను ఎమ్మెల్సీ పదవుల నుంచి రీకాల్‌ చేసి వైసీపీ నుంచి సస్పెండ్‌ చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేశ్‌ డిమాండ్‌ చేశారు. కాకినాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో 28 ఏళ్ల పాటు పోరాడిన దళిత వీరులను అభినందిస్తున్నానని చెప్పారు. తోటకు బెయిల్‌ ఇవ్వడం విచారకరమన్నారు. ఈ కేసు పపై నోరు మెదపని వైసీపీ దళిత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బతికిఉన్నా చచ్చిన శవాలేనన్నారు. దళిత యువకుడిని చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును కొనసాగించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Updated Date - Apr 18 , 2024 | 09:23 AM