Share News

Bonda Umamaheswara Rao: రాయి దాడి కేసు.. టార్గెట్‌ బొండా?

ABN , Publish Date - Apr 20 , 2024 | 07:53 AM

గులకరాయి దాడి ఘటనలో మలుపులు తిరుగుతున్న దర్యాప్తు ఇప్పుడు విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొండా ఉమా మహేశ్వరరావు వైపు వెళ్తుందా? కేసులో ఆయనను నిందితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

Bonda Umamaheswara Rao: రాయి దాడి కేసు.. టార్గెట్‌ బొండా?
Bonda Umamaheswara Rao

  • బెజవాడలో టీడీపీ కార్యాలయం వద్ద హైడ్రామా

  • గులకరాయి ఘటనలో అరెస్ట్‌ చేస్తారని ప్రచారం

  • మొదట ఉమా ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు

  • దీంతో పార్టీ కార్యాలయానికి చేరుకున్న బొండా

  • అక్కడికి కూడా భారీగా వెళ్లిన పోలీసులు

  • కార్యాలయం వద్దకు వచ్చిన కార్యకర్తలు.. ఉద్రిక్తత

  • ఆఫీసు వెనుక నుంచి వెళ్లిపోయిన ఉమా

విజయవాడ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): గులకరాయి దాడి ఘటనలో మలుపులు తిరుగుతున్న దర్యాప్తు ఇప్పుడు విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొండా ఉమా మహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) వైపు వెళ్తుందా? కేసులో ఆయనను నిందితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. విజయవాడ మొగల్రాజపురంలోని బొండా ఉమా ఇంటి వద్ద, అజిత్‌సింగ్‌ నగర్‌లో పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా నడిచింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పోలీసులు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వచ్చిన సమాచారం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు.


బొండా ఉమా ఇంటి వద్దకు శుక్రవారం ఉదయం ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. భద్రత నిమిత్తం తమను పంపారని ఆయనకు చెప్పారు. మధ్యాహ్నానికి ఆ సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో బొండా ఉమాకు అనుమానం వచ్చింది. తర్వాత కారులో ఇంటి నుంచి అజిత్‌సింగ్‌ నగర్‌లోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాసేపటికి టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, లా అండ్‌ ఆర్డర్‌ అధికారులు పార్టీ కార్యాలయానికి సమీపంలో వేచి ఉన్నారు. తర్వాత పోలీసు సిబ్బంది చేరుకున్నారు. దీంతో బొండా ఉమాను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. పోలీసుల రాకను గమనించిన నేతలు అన్ని డివిజన్లలో ఉన్న కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. 20 డివిజన్లలో ఉన్న కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వెల్లంపల్లి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. రాత్రి వరకు బొండా ఉమా పార్టీ కార్యాలయంలోనే ఉండి నేతలతో సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. పార్టీ కార్యాలయం వద్ద సుమారు రెండున్నర గంటలపాటు హైడ్రామా నడిచింది. కార్యకర్తలు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. అయినా వారు అక్కడి నుంచి కదల్లేదు. పోలీసులు ఏ క్షణాన అయినా లోపలకు ప్రవేశించి అరెస్టు చేస్తారన్న అనుమానంతో బొండా ఉమా అక్కడి నుంచి తప్పించుకున్నారు. పార్టీ కార్యాలయానికి విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేయించి, వెనుక వైపు నుంచి వెళ్లిపోయారు.


కాగా, రాయి దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌కుమార్‌ను పోలీసులు ఏ1గా చూపించారు. ఏ2గా టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావును చూపించినట్టు లీకులు వచ్చాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఏ2 ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. కోర్టులో సతీష్‌ను ప్రవేశపెట్టినప్పుడు పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఏ2 ఎవరన్నది స్పష్టం చేయలేదు. ఏ2 ప్రేరేపించడంతో సతీష్‌ దాడి చేశాడని పేర్కొన్నారు. బయటకు వచ్చిన లీకుల ప్రకారం ఏ2 స్థానంలో దుర్గారావు ఉంటాడా, ప్రస్తుత పరిణామాలతో బొండా ఉమా ఉంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 08:39 AM