Share News

AP Politics: వైసీపీతో అంటకాగే అధికారుల గుండెల్లో ఈసీ రైళ్లు!

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:57 AM

ఎన్నికల కమిషన్‌ వేట మొదలుపెట్టింది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం కీలక శాఖల అధికారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

AP Politics: వైసీపీతో అంటకాగే అధికారుల గుండెల్లో ఈసీ రైళ్లు!

  • వైసీపీతో అంటకాగే అధికారులపై కఠిన చర్యలు

  • ఎస్‌ఐ, వీఆర్‌వో, ఇతరులపై క్రమశిక్షణా చర్యలు.. సస్పెన్షన్‌

  • త్వరలో మరికొందరిపైనా.. నిబంధనలు మీరేవారిపై నిఘా

  • ఫిర్యాదులపై తక్షణ చర్యలు.. కలెక్టర్లకు మరిన్ని ఆదేశాలు

  • అనుమతి లేని హోర్డింగులను తక్షణమే తీసేయండి

  • పోస్టర్లు, కటౌట్లను కూడా: సీఈవో ఆదేశాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి) :

ఎన్నికల కమిషన్‌ (Election Comission) వేట మొదలుపెట్టింది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను (Assembly, Loksabha Elections) పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం కీలక శాఖల అధికారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అధికారులుగా సర్వీసు నిబంధనలకు లోబడి ప్రభుత్వానికి, ప్రజలకూ జవాబుదారీగా ఉండాల్సిన వారు హద్దులుమీరి అధికార పార్టీ జెండాను భుజానేసుకొని తిరగడాన్ని ఈసీ అడ్డుకుంటోంది. అలాంటి పనులు ఇక చెల్లవంటూ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొందరిని సస్పెండ్‌ చేసి ఇంటికి పంపించగా, మరి కొందరిపై విచారణ సాగిస్తోంది. తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక, పోలీసు, రెవెన్యూ అధికారులపై వస్తున్న ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో అధికారపార్టీతోపాటు, రాజకీయ పక్షాలతో అంటకాగుతున్న అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారపార్టీ సొంత మనుషులుగా ముద్రవేసుకుని వారి నుంచి కోరకున్న పోస్టింగ్‌లు, ఇతర ప్రయోజనాలు పొందిన వారు ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈసీకి భయపడి దూరంగా ఉంటే ఆ పార్టీ ఒప్పుకోదు. అయినా బరితెగించి అధికారపార్టీకి అండగా ఉండాలని ప్రయత్నిస్తే ఈసీ ఊరుకోదు. దీంతో పార్టీ జెండాలు మోసిన కొందరు అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకలా మారింది. ఇప్పటికే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అక్రమాల కేసుకు సంబంధించి ఓ ఐఏఎస్‌, మరో ఇద్దరు అధికారులు ఎన్నికల కమిషన్‌ ఆగ్రహానికి గురయ్యారు. ఆ కేసులో మరింత లోతైన విచారణ సాగుతోంది. ఏ క్షణాన ఏ అధికారిపై వేటు పడనుందోనన్న ఆందోళన ఆ ప్రాంత అధికారుల్లో నెలకొంది.

పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో గత శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. అయితే, స్థానిక వైసీపీ నేత లక్ష్మణరావు కూడా కవాతులో పాల్గొన్నారు. ఇది మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు స్థానిక ఎస్‌ఐ గోవిందరావును వెంటనే వీఆర్‌కు పంపించారు. ఇది ఎన్నికల కమిషన్‌ ప్రభావమే. ఒక వేళ ఆ ఎస్‌ఐ విషయంలో జిల్లా యంత్రాంగం సకాలంలో చర్యలు తీసుకోకుంటే ముందు ఉన్నతాధికారులే సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉండేది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున ఎన్నికల విధులతో సంబంధం ఉన్న పోలీసు, రెవెన్యూ, ఇతర అధికారుల ప్రవర్తనపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఉన్నతాధికారులు ప్రాధమిక విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీ ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం డిమిలీ గ్రామ రెవెన్యూ అధికారి కె. రమేశ్‌ ఏకంగా వైసీపీ కోసం రాజకీయ ప్రచారం చేశారు. దీన్ని మండల తహసీల్దార్‌ నిర్ధారించారు. వెంటనే వీఆర్‌వో రమేశ్‌ను సస్పెండ్‌ చేస్తూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

రెవెన్యూ, పోలీసులపైనే ఫిర్యాదులు

ఎన్నికల విధుల్లో రెవెన్యూ, పోలీసు విభాగాలే కీలకం. ఎన్నికల నిర్వహణలో ఎలక్టోరల్‌ అధికారులుగా రెవెన్యూ అధికారులు ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో పోలీసుల పాత్ర కీలకం. అందుకే అధికారపార్టీ ఈ రెండు విభాగాల అధికారులపై దృష్టి పెట్టింది. పోలీసు, రెవెన్యూ విభాగాల్లో అస్మదీయులను చేరదీసి వారికి కోరుకున్న చోట పోస్టింగ్‌లు, పదోన్నతులు, ప్రయోజనాలు కల్పించింది. తద్వారా వారిని ఎన్నికల సమయంలో వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇలా దొడ్డిదారిలో లబ్ధిపొందిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించి మరీ అధికార పార్టీకి సేవ చేస్తున్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఓట్ల తొలగింపు వంటి అంశాల్లో 42 వేల ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 90 శాతం అడ్డదారిలో లబ్ధిపొందిన రెవెన్యూ అధికారులపైనే ఉన్నాయి. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ కలెక్టర్‌, తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ కేడర్‌ అధికారులను ఎన్నికల కమిషన్‌ సస్పెండ్‌ చేసింది. అయినా, కొందరు అధికారులు ధీమాగా ఉన్నారు. మండల స్థాయిలో వైసీపీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

కఠిన చర్యలు తీసుకోండి: ఈసీ ఆదేశం

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై, కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ రాజకీయ పార్టీలతో అంటకాగే రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులపై నిఘా పెట్టింది. అధికారులపై వచ్చే ఆరోపణలపై సత్వరమే విచారించి చర్యలు తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఫిర్యాదులపై స్పందించకపోతే మీపైనే చర్యలు ఉంటాయని కలెక్టర్లకు సైతం హెచ్చరికలు జారీ చేసింది.

‘‘ఇది జగనన్న రాజ్యం. ఆయనకు మేం వీరభక్తులం. ఆ తర్వాతే అధికారులం. వైసీపీ సేవే ప్రభుత్వ, ప్రజా సేవ. ఇంతకు మించిన భాగ్యం మరొకటి లేదు’’ అంటూ అధికార పార్టీ వైసీపీతో అంటకాగే అధికారుల గుండెల్లో ఎన్నికల సంఘం రైళ్లు పరిగెట్టిస్తోంది. తామెన్ని తప్పులు చేసినా జగనన్న కాపాడుతారన్న ధీమాతో రెచ్చిపోయి మరీ అరాచకాలకు పాల్పడుతున్న అధికారులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు.

Updated Date - Mar 18 , 2024 | 07:59 AM