Share News

TDP: నా సవాల్‌పై వైసీపీ ఎమ్మెల్యే భయపడుతున్నారు: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి

ABN , Publish Date - Mar 01 , 2024 | 10:24 AM

తూర్పుగోదావరి: బహిరంగ చర్చ కోసం శుక్రవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళతానని, ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

TDP:  నా సవాల్‌పై వైసీపీ ఎమ్మెల్యే భయపడుతున్నారు: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి

తూర్పుగోదావరి: బహిరంగ చర్చ కోసం శుక్రవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) సత్తి సూర్యనారాయణ రెడ్డి (Satthi Suryanarayana Reddy) ఇంటికి వెళతానని, ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని టీడీపీ నేత (TDP Leader), మాజీ ఎమ్మెల్యే (Ex MLA) నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli Ramakrishna Reddy) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన అనపర్తిలో మీడియాతో మాట్లాడుతూ బహిరంగ చర్చ అంటే వైసీపీ ఎమ్మెల్యే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చర్చ కోసం ఎమ్మెల్యే ఇంటికి వెళతానంటే తన శరీరంలో పార్టులు తీసేస్తానంటూ ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారని, తనను పోలీసులతో అడ్డుకుంటున్నారని అన్నారు. తాను చేసిన సవాల్‌పై ఇప్పటివరకు ఎమ్మెల్యే స్పందించలేదని, అవినీతిపై బహిరంగ చర్చకు ఆయన భయపడుతున్నారని అన్నారు. తనను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలను, బ్లేడ్ బ్యాచ్‌ను ఎమ్మెల్యే తన ఇంటికి రప్పించుకున్నారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

కాగా తూర్పుగోదావరి జిల్లా, అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చోటు చేసుకున్నాయి. సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై బహిరంగ లేఖతో ఫిబ్రవరి 19 న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి.. అక్కడ సిబ్బందికి స్వయంగా అందచేశారు. అవినీతిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే రావాలని సవాల్ (Challenge) చేశారు. అయితే రామకృష్ణారెడ్డి తన ఆసుపత్రికి వెళ్ళటంపై సూర్యనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నప్పుడు ఇంటికి వస్తే సంగతి తేల్చుతానంటూ ఎమ్మెల్యే ప్రతి సవాల్ చేశారు.

ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి సవాల్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. మార్చి 1వ తేదీ (శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ఇంటికి వస్తా.. మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా.? అంటూ ప్రతి సవాల్ విసిరారు. ఈ ఇద్దరు నేతల సవాళ్ళు, ప్రతి సవాళ్ళపై అనపర్తిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Mar 01 , 2024 | 12:02 PM