Share News

CPI State Secretary RamaKrishna : సమ సమాజ స్థాపనకు ఉద్యమించాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 05:06 AM

‘రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, లౌకిక వాదం, ప్రజాస్వామ్య పరిరక్షణకు, సమ సమాజ స్థాపనకు... త్యాగాలు, పోరాటాలకు తిరిగి సమాయత్తం కావాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శికే రామకృష్ణ పిలుపునిచ్చారు.

CPI State Secretary RamaKrishna : సమ సమాజ స్థాపనకు ఉద్యమించాలి

  • సీపీఐ శత వార్షికోత్సవంలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

గుంటూరు(తూర్పు), డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, లౌకిక వాదం, ప్రజాస్వామ్య పరిరక్షణకు, సమ సమాజ స్థాపనకు... త్యాగాలు, పోరాటాలకు తిరిగి సమాయత్తం కావాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు గాంధీపార్కు వద్ద గురువారం జరిగిన సీపీఐ శత వార్షికోత్సవ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘బీజేపీ ప్రభుత్వానికి స్వాతంత్య్ర సమరయోధులపై గౌరవం లేదు. రాజ్యాంగంపై విశ్వాసం లేదు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశ సంపదను అంబానీ, అదోనీలకు దోచిపెడుతుంది. కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తున్నాం. స్వాతంత్య్రపోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కల్గిన పార్టీలుగా కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు ఘనత సాధించాయి’ అని రామకృష్ణ అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెలుగురి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ... ‘దేశంలో నేడు పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుంది. లక్షల కోట్ల సంపద కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోతుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు సీపీఐ సీనియర్‌ నాయకులను ఘనంగా సన్మానించారు.

Updated Date - Dec 27 , 2024 | 05:06 AM