Share News

Coastal Erosion : ఏపీ తీరంలో 29.2 శాతం కోత

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:45 AM

రాష్ట్రంలో సముద్ర తీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కోతకు గురవుతూనే ఉంది.

Coastal Erosion : ఏపీ తీరంలో 29.2 శాతం కోత

కాకినాడ, కృష్ణా, నెల్లూరు, విశాఖల్లో ఎక్కువ

వాతావరణంలో మార్పుల ప్రభావంతోపెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు

విశాఖపట్నం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సముద్ర తీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కోతకు గురవుతూనే ఉంది. గత మూడు దశాబ్దాల్లో ఇచ్ఛాపురం నుంచి తడ వరకూ గల 1011.7 కిలోమీటర్ల సుదూర తీరంలో 29.72 శాతం మేర కోతకు గురైంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సముద్ర అధ్యయన నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో తీరప్రాంత కోతపై నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ 1991 నుంచి 2021 వరకూ చేసిన అధ్యయనం వివరాలను కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఏపీలో 1101.7 కి.మీ. తీరంలో 29.72 శాతం కోతకు గురైంది. అత్యధికంగా 98.65 కి.మీ. (9.75 శాతం), మధ్యస్తంగా 64.75 కి.మీ. (6.4 శాతం), తక్కువగా 137.29 కి.మీ. (13.57 శాతం) తీరం కోతకు గురైంది. కాకినాడ, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మధ్యస్తంగా తీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. దాదాపు 42శాతం తీరంలో ఇసుకమేటలు వేశాయి. కళింగపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవులకు దిగువ భాగంలో ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయి. పోర్టుల నిర్మాణంలో భాగంగా 8.79 కి.మీ. మేర తీరంలో రక్షణ గోడలు నిర్మించారని కేంద్రం పార్లమెంటులో నివేదించింది.


  • తీర ప్రాంత రక్షణకు చర్యలు అవసరం

మూడు దశాబ్దాలుగా వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చాయి. వేడి పెరగడం, సుదీర్ఘ వేసవి, వర్షాల్లో అసమతుల్యం, కార్బన్‌ డయాక్సైడ్‌ పెరగడం, ప్లాస్టిక్‌ వినియోగం, నదులు,వాగుల ద్వారా వ్యర్థాలు సముద్రంలో కలవడం, రసాయన పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా నదులు, సముద్రంలోకి వదిలేయడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. సముద్ర ఉపరిత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇంకా అభివృద్ధి పేరిట పోర్టులు, తీరంలో రిసార్టులు, హోటళ్లు పెరుగుతున్నాయి. మరోవైపు మడ అడవులను ఇష్టానుసారంగా కొట్టేస్తున్నారు. వీటన్నింటికీ తోడు తుఫాన్ల తీవ్రత పెరిగింది. ఈనేపథ్యంలో సముద్రం, తీరం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని విశాఖపట్నంలో ప్రాంతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన కేంద్రం చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ వీవీఎ్‌సఎస్‌ శర్మ పేర్కొన్నారు. కాకినాడ పరిసరాలు ఎక్కువగా ప్రభావానికి గురవుతున్నాయన్నారు. విశాఖ ఆర్కే బీచ్‌రోడ్డు ఎప్పటికప్పుడు కోతకు గురవుతుందన్నారు. తాజాగా నాలుగు రోజుల నుంచి బీచ్‌ రోడ్డు వైపు అలలు వస్తున్నాయన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్‌కు దక్షిణ వైపు రక్షణ గోడ కూలిపోయిందన్నారు. తీర రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Updated Date - Dec 21 , 2024 | 04:46 AM