AP Politics: సంక్రాంతికి పొలిటికల్ పందెం కోళ్లురె‘ఢీ’.. వాడకం మామూలుగా లేదుగా..!
ABN , Publish Date - Jan 15 , 2024 | 03:17 PM
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ ఏ రేంజ్‌లో జరుపుకుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఓ వైపు పందెం కోళ్లు బరిలోకి దిగడానికి రెడీ అవుతుంటే.. మరోవైపు పొలిటికల్ లీడర్స్ రంగంలోకి దిగిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ ఏ రేంజ్‌లో జరుపుకుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఓ వైపు పందెం కోళ్లు బరిలోకి దిగడానికి రెడీ అవుతుంటే.. మరోవైపు పొలిటికల్ లీడర్స్ రంగంలోకి దిగిపోతున్నారు. నేతలు పోటాపోటీగా సంబరాల్లో పాల్గొనడం, పనిలో పనిగా హీటెక్కించే పొలిటికల్ కామెంట్స్ చేసేయడంతో పొలిటికల్ సందడి కూడా ఊపందుకున్నది. సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకోవడానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నెల రోజుల కిందటే పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నాయి. ఇంతకీ పార్టీలు చేస్తున్న పనులేంటి..? జనాలను తమవైపు తిప్పుకోవడానికి నేతలు పడుతున్న పాట్లేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఇదీ అసలు కథ
రెండోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ.. ఎట్టి పరిస్థితిల్లో అధికార పార్టీ గెలవకూడదని టీడీపీ, జనసేన పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు సంక్రాంతి పండుగ కావడంతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఏపీలోని గ్రామాల్లో వచ్చి వాలిపోయారు. దీంతో నియోజకవర్గ ప్రజలందర్నీ కలవడానికి ఇదే సరైన సమయం అని భావించి.. జనాల కోసం లేనిపోనివన్నీ నేతలు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు, కోడి పందేల్లో పాల్గొనడం.. గ్రామాల స్థాయిలో కార్యకర్తలు, అభిమానులతో భేటీ కావడం.. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలను ప్రత్యేక అతిథులుగా ట్రీట్ చేయడం లాంటివి చేస్తున్నారు. అంతేకాదండోయ్.. ఉదయం నుంచి సాయంత్రం చిందు, మందు.. సాయంత్రం పూట.. పార్టీలు ఇవ్వడం లాంటివి చేస్తున్నారు నేతలు. దీనికి తోడు పోటీలు పెట్టడం గెలిచిన వారికి పార్టీల తరఫున బహుమతులు అందజేయడం చేస్తున్నారు. మరోవైపు.. జనాల్లో కలిసిపోయి వారితో కలిసి సందడిలో పాల్గొనడం.. డ్యాన్స్ చేస్తే కాలు కదపడం, పాటలు పెడితే నోరు మెదపడం లాంటివి చేసే పనిలో బిజిబిజీ నేతలు బిజిబిజీగా గడుపుతున్నారు.
పనిలో పనిగా..!
సంక్రాంతిని అడ్డుపెట్టుకుని క్యాడర్, ఊర్లకు వచ్చిన జనాలతో వరుసగా భేటీ కావడం, పార్టీలోకి చేర్చుకోవడం, ఏదో ఒక రూపంలో గిఫ్టులు గట్రా ఇవ్వడం.. ఇలా ఒకటా రెండా ఏం చేసైనా సరే తమవైపునకు తిప్పుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీపడుతున్నాయి. పార్టీ ఆఫీసుల్లో సంక్రాంతి చేయడం.. జనాలను భారీగా తరలించడం ఇలా కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీలో పలు నియోజకవర్గాలకు కొత్త వ్యక్తులను ఇంచార్జీలుగా నియమించడంతో ఈ పండుగ పేరుతో జనాలను తెగ వాడేస్తున్నారు. ఇదిగో ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఫలానా వ్యక్తిని మన పార్టీలోకి తీసుకొస్తే కావాల్సింది ఇస్తానని ఓపెన్‌గా ఆఫర్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పైకి పోలీసులు కోళ్ల పందేలు జరొపద్దని చెబుతున్నప్పటికీ అధికార పార్టీ నేతలు మాత్రం దగ్గరుండి జరుపుతున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు నేతలు.
టార్గెట్.. టార్గెట్..!
పండుగ సందడిలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు కూడా గట్టిగా పేలుతున్నాయ్. మంత్రులు అంబటి రాంబాబు, రోజా లాంటి వారు ఇప్పటికే విమర్శలు ఎక్కుపెట్టడం మొదలెట్టేశారు. మరోవైపు.. జనసేన, టీడీపీ అధినేతలు అమరావతిలోనే భోగి మంటల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్వర్వులను, వైసీపీ మేనిఫెస్టోను భోగి మంటల్లో వేసి నిరసన తెలపడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు జగన్ కూడా తాడేపల్లి ప్యాలెస్‌లో సంక్రాంతి పండుగలో పాల్గొంటున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత నేరుగా జనాల్లోకి యాక్షన్ ప్లాన్‌తో ఏపీ వ్యాప్తంగా పర్యటనకు రంగం సిద్ధం చేశారు. క్యాడర్ మొదలుకుని లీడర్ల వరకూ అందర్నీ కలిసి.. పార్టీని గెలిపించడానికి ఏం చేయాలి..? స్థానికంగా ఏం చేయాలి..? లోటు పాట్లేంటి..? అని తెలుసుపనిలో పడనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి జగన్ షురూ చేయబోతున్నారు. పండుగ తర్వాతే నియోజకవర్గాల ఇంచార్జుల నాలుగో జాబితాను కూడా రిలీజ్ చేయబోతున్నారు. చూశారుగా.. సంక్రాంతి పొంగల్‌ను రాజకీయ పార్టీలు ఏ రేంజ్‌లో వాడేస్తున్నాయో!!