Share News

AP Govt : భూముల ధరల పెంపు వాయిదా

ABN , Publish Date - Dec 27 , 2024 | 03:23 AM

రాష్ట్రంలో భూముల మార్కెట్‌ ధరలు పెంచాలన్న నిర్ణయంపై సర్కారు పునరాలోచనలో పడింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భూముల మార్కెట్‌ ధరలను పెంచాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది.

AP Govt : భూముల ధరల పెంపు వాయిదా

  • పునరాలోచనలో ప్రభుత్వం

  • జనవరి 1 నుంచి పెంపు లేనట్టే!

  • ఈనెల 30న కీలక సమావేశం

  • అన్నీ చర్చించాకే నిర్ణయం: మంత్రి అనగాని

అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల మార్కెట్‌ ధరలు పెంచాలన్న నిర్ణయంపై సర్కారు పునరాలోచనలో పడింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భూముల మార్కెట్‌ ధరలను పెంచాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లలో అనేకసార్లు భూముల మార్కెట్‌ ధరలను పెంచారు. దీని వల్ల ప్రజలు, సామాన్యులపై ఎనలేని భారం పడింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు మార్కెట్‌ ధరలు పెంచాలని ప్రభుత్వంపై అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల ఇతిబాధలు పట్టించుకోకుండా ఆదాయం పెంపే లక్ష్యంగా ఏకంగా ఏటా 14వేల కోట్ల రెవెన్యూ చూపించేలా ప్రతిపాదనలు చేశారు. దీనిపై ఆర్థికశాఖ గంపెడాశలు పెట్టుకుంది. ఇది అమలైతే ఒక్క రిజిస్ట్రేషన్ల ద్వారానే ఏటా 14వేల కోట్ల ఆదాయం వస్తుందని, కాబట్టి భూముల మార్కెట్‌ ధరలు పెంచేందుకు అనుమతించాలని ఆర్థికశాఖ, రెవెన్యూశాఖల అధికారులు ముఖ్యమంత్రి వద్ద పట్టుబట్టారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 2025 జనవరి 1 నుంచే భూముల మార్కెట్‌ ధరలు పెంచాలని తొలుత నిర్ణయించింది. దీనిపై ప్రజల్లో కొంత ఆందోళన, అలజడి నెలకొన్నాయి. భూముల ధరలు పెంచొద్దని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యమాలూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పునరాలోచనలో పడింది.


ఈ అంశంపై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుందామని, జనవరి 1 నుంచి భూముల మార్కెట్‌ ధరల పెంపు నిర్ణయం అమలును వాయిదావేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 30న మంగళగిరిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జోనల్‌ రెవెన్యూ సమావేశం జరగనుంది. అదేరోజు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని మంత్రి అనగాని ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ‘మాది ప్రజా ప్రభుత్వం. వారికి కష్టం కలిగేలా ఏకపక్ష నిర్ణయాలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతకు ముందే ప్రజలకు హామీ ఇచ్చారు. కాబట్టి భూముల మార్కెట్‌ ధరలు పెంచాలన్న అంశంపై మరోసారి అధికారులతో చర్చించాలనుకున్నాం. రెవెన్యూ సదస్సులో రెండో సెషన్‌ తర్వాత రిజిస్ట్రేషన్‌ ఐజీలతో సమావేశం నిర్వహించి తాజా పరిస్థితిపై వారిచ్చే నివేదికలపై చర్చిస్తాం. ఆ త ర్వాత సీఎంకు నివేదిస్తాం’ అని అనగాని స్పష్టం చేశారు. ఇప్పటికే నిఘా విభాగం కూడా ఈ అంశంపై నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ‘రాష్ట్రంలో ఒకవైపు రెవెన్యూ సదస్సులు గ్రామగ్రామాన జరుగుతున్నాయి. ప్రభుత్వం తమ సమస్యలు తీరుస్తుందన్న నమ్మకంతో ప్రజలు భారీగా తరలివచ్చి సదస్సుల్లో ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తున్నారు. ఈ తరుణంలో భూముల మార్కెట్‌ ధర లు పెంచడం ప్రతికూల ప్రభావం చూపిస్తుంది’ అని నిఘా విభాగం ప్రభుత్వానికి సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - Dec 27 , 2024 | 03:24 AM