Amaravati : తదుపరి సీఎస్ సాయి ప్రసాద్?
ABN , Publish Date - Dec 25 , 2024 | 04:30 AM
రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి(సీఎస్) నియామకంపై కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్‌కు పొడిగించిన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు
ఈ నెలాఖరుకు నీరబ్ పదవీ విరమణ
సీనియారిటీ జాబితాలో శ్రీలక్ష్మి సీనియర్
కానీ.. అవినీతి, జైలు, కేసులతో కళంకం
ఈ నేపథ్యంలో సాయి వైపే సర్కారు మొగ్గు
ఈ నెలాఖరుతో నీరబ్ పదవీ విరమణ
అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి(సీఎస్) నియామకంపై కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్‌కు పొడిగించిన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. మళ్లీ పొడిగింపునకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదు. దీంతో ఆయన పదవీ విరమణ ఖాయమైందన్న చర్చ సాగుతోంది. అనంతరం ఆయనకు మరో పదవి ఇచ్చే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై సర్కారు దృష్టి పెట్టింది. పలు పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ సీనియారిటీ ప్రాతిపదికన సాయి ప్రసాద్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ జాబితాలో నీరభ్ కుమార్ ప్రసాద్ తర్వాత శ్రీలక్ష్మి ఉన్నారు.
అయితే, ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఉండటంతో ఇప్పటికీ ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత సీనియారిటీ జాబితాలో అనంత రాము ఉన్నారు. కానీ ఆయన సామర్థ్యంపై చంద్రబాబుకు సదభిప్రాయం లేదు. ఆయన తర్వాత సీనియారిటీలో సాయి ప్రసాద్ ఉన్నారు. ఈయన గతంలో చంద్రబాబు పేషీలో కార్యదర్శిగా కీలక భూమిక నిర్వహించారు. ఆ తర్వాత జగన్ హయాంలో కూడా సీసీఎల్‌ఏ, రెవెన్యూ స్పెషల్ సీఎ్‌సగా రెండు బాధ్యతలూ నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన సాయి ప్రసాద్‌కు చంద్రబాబు కీలక పోస్టు ఇవ్వరని మొదట్లో అనుకున్నప్పటికీ అలా చూసుకుంటూ పోతే ఎవరికీ అవకాశాలు ఇవ్వలేమని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.