Share News

RAIN : వాన విధ్వంసం

ABN , Publish Date - May 26 , 2024 | 12:12 AM

జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులు జీవం పోసుకున్నాయి. అత్యధికంగా కళ్యాణదుర్గంలో 86.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కణేకల్లు 70.0, ఉరవకొండ 62.8, కుందుర్పి 58.6, వజ్రకరూరు 46.2, శెట్టూరు 44.2, బెళుగుప్ప 36.8, బొమ్మనహాళ్‌ 34.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల కారణంగా యల్లనూరు, పెద్దపప్పూరు, కూడేరు, పుట్లూరు, కుందుర్పి, పెద్దవడుగూరు, కంబదూరు, బెలుగుప్ప, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల్లో అరటి, బొప్పాయి, టమోటా, పత్తి పంటలు ...

RAIN : వాన విధ్వంసం
Cotton crop submerged in rainwater

ఉద్యాన పంటలకు భారీ నష్టం

396.52 హెక్టార్లల్లో రూ.13.83 కోట్లు మట్టిపాలు

నేలకూలిన విద్యుత స్తంభాలు, ట్రాన్సఫార్మర్లు

విద్యుత సరఫరాకు గంటల తరబడి అంతరాయం

అనంతపురం అర్బన, మే 25: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులు జీవం పోసుకున్నాయి. అత్యధికంగా కళ్యాణదుర్గంలో 86.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కణేకల్లు 70.0, ఉరవకొండ 62.8, కుందుర్పి 58.6, వజ్రకరూరు 46.2, శెట్టూరు 44.2, బెళుగుప్ప 36.8, బొమ్మనహాళ్‌ 34.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల కారణంగా యల్లనూరు, పెద్దపప్పూరు, కూడేరు, పుట్లూరు, కుందుర్పి, పెద్దవడుగూరు, కంబదూరు, బెలుగుప్ప, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల్లో అరటి, బొప్పాయి, టమోటా, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 396.52 హెక్టార్లల్లో రూ.13.83కోట్ల విలువైన ఉద్యాన


పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ఎక్కువ శాతం అరటి ఉంది. ఈ నెలలో ఇప్పటి దాకా కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 454.92 హెక్టార్లలో ఉద్యాన పంటలకు రూ.15.60 కోట్ల నష్టం జరిగింది. ఇందులో రూ.13.14 కోట్ల విలువైన 370.80 హెక్టార్ల అరటి ఉంది. మిగతా విస్తీర్ణంలో టమోటా, బొప్పాయి, కర్బూజ, దానిమ్మ, వక్క, మునగ పంటలు ఉన్నాయి.

మరువపారిన చెరువు

ఉరవకొండ: పట్టణంలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. క్లాక్‌ టవర్‌ కూడలిలో నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ప్రవహించాయి. బూదగవి చెరువు నిండి మరువ పారింది.

చెరువులకు నీరు

కళ్యాణదుర్గం రూరల్‌: మండల పరిధిలోని చాపిరి చెరువులోకి ఐదేళ్ల తరువాత భారీగా నీరు చేరుతోంది. దీంతో చాపిరి, దొడగట్ట, గంగవరం, దుద్దేకుంట, సిబాయి, గోళ్ల తదితర గ్రామాల పరిధిలో భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హులికల్లు చెరువుకూ భారీగా నీరు చేరింది. కానీ చెరువుకు గండిపడటంతో నీరు వృథాగా పోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని జ్ఞానభారతి పాఠశాలలో చెట్టు విరిగి విద్యుత వైర్లపై పడటంతో విద్యుత తీగలు కూడా తెగిపోయాయి. దీంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు విద్యుత సరఫరాకు అంతరాయం కలిగింది.


నీట మునిగిన పత్తిపంట

బొమ్మనహాళ్‌: మండలంలో ఏకధాటిగా రెండు గంటలపాటు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో పత్తి పంట నీట మునిగింది. ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల విద్యుత వైర్లు తెగిపోయి.. అంధకారం అలుముకుంది. కొళగానహళ్లి వద్ద కబ్బాలివంక, ఉద్దేహాళ్‌ వద్ద వేదవతి హగరి నదికి, శ్రీధరఘట్ట చెరువుకు నీరు చేరింది.

ఉద్యాన పంటలు ధ్వంసం

పుట్లూరు: గాలీవాన కారణంగా మండలంలో ఉద్యానవన పంటలకు పెద్దఎత్తున నష్టం జరిగింది. అరటి, బొప్పాయి, మొక్కజొన్న తదితర పంటలు నేలకొరిగాయి. పుట్లూరు, కడవకల్లు, ఓబులాపురం, కందికాపుల, చింతకుంట, సూరేపల్లి, చిన్నమల్లేపల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కడవకల్లులో పెద్ద లింగమయ్య, ఓబులాపురంలో రామమోహనరెడ్డి, సాయినాథ్‌రెడ్డి, ఆదిరెడ్డి, సోమచంద్రరెడ్డి, నారాయణరెడ్డి, చిన్నమల్లేపల్లిలో చంద్రశేఖర్‌నాయుడు అరటి తోటలు ధ్వంసమయ్యాయి. మండలవ్యాప్తంగా సుమారు 500 ఎకరాలకు పైగా అరటి తోటలకు నష్టం జరిగిందని ఉద్యానవనశాఖ అధికారి శైలజ తెలిపారు. పంట నష్టం అంచనా కొనసాగుతోందని తెలిపారు. మండలవ్యాప్తంగా చెట్లు, విద్యుత స్తంభాలు విరిగిపోయిన కారణంగా విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


రైతులను ఆదుకోవాలి..

గాలీవాన కారణంగా నష్టపోయిన ఉద్యానవన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గత ఏడాది వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్నారు. చేతికి వచ్చిన పంట ధ్వంసం కావడంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. నష్టపోయిన ప్రతిరైతులకు పరిహారం అందించాలి.

- రామాంజనేయులు, రైతు సంఘం నాయకుడు

విద్యుత శాఖకు భారీ నష్టం

అనంతపురం రూరల్‌: ఈదురుగాలుల కారణంగా విద్యుత శాఖకు ఉమ్మడి జిల్లాలో రూ.87 లక్షల నష్టం జరిగిందని విద్యుత శాఖ ఎస్‌ఈ సురేంద్ర తెలిపారు. గుత్తి, అనంతపురం రూరల్‌, బెళుగుప్ప, విడపనకల్లు, గార్లదిన్నె, ఆత్మకూరు, ఉరవకొండ, బొమ్మనహళ్‌, పెద్దవడుగూరు, పుట్లూరు తదితర మండలాల్లో విద్యుత స్తంభాలు, ట్రాన్సఫార్మర్లు కూలిపోయాయి. విద్యుత లైన్లు తెగిపోయాయి. మరమ్మతు పనులను శుక్రవారం రాత్రి నుంచే చేపట్టామని అధికారులు తెలిపారు. మొత్తంగా 33 కేవీ విద్యుత స్తంభాలు 17, 11 కేవీ స్తంభాలు 170, ఎల్‌టీ పోల్స్‌ 220, ట్రాన్సఫార్మర్లు ఏడు కూలిపోయాయి. మొత్తం 407 విద్యుత స్తంభాలు దెబ్బతిన్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు.

ఎగిరిపోయిన రేకులషెడ్లు

గార్లదిన్నె: ఈదురు గాలుల కారణంగా పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత స్తంభాలు విరిగిపోయాయి. కొప్పలకొండ నుంచి కేశవాపురం గ్రామానికి విద్యుత సరఫరా చేసే ట్రాన్సఫార్మర్‌ కూలిపోయింది. సుమారు 10 విద్యుత స్తంభాలు నేలకూలాయి. దీంతో కేశవాపురం, కొప్పలకొండ గ్రామాలకు విద్యుత సరఫరా నిలిచిపోయింది. కొప్పలకొండ గ్రామానికి కల్లూరు నుంచి విద్యుత సరఫరా అయ్యేలా ఏఈ విజయ్‌కుమార్‌ చర్యలు తీసుకున్నారు. పెనకచెర్ల కొత్తపల్లిలో రైతు నాగభూషణ మామిడి తోటలో మూడు రేకులషెడ్లు ఎగిరిపోయాయి. మామిడి మొక్కలు విరిగిపోయాయి. దీంతో భారీగా నష్టపోయానని రైతు వాపోయారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, రాప్తాడు ఉద్యాన అధికారి రత్నకుమార్‌, గ్రామ ఉద్యాన అధికారి రాధాకృష్ణ మామిడి తోటను శనివారం పరిశీలించారు.


బొప్పాయి, అరటి పంటలు ధ్వంసం

బెళుగుప్ప: మండలంలో గాలీవాన బీభత్సం సృష్టించాయి. దుద్దేకుంటలో రైతులు రుద్రప్ప(4 ఎకరాలు), రంగస్వామి (3 ఎకరాలు) సాగుచేసిన అరటిపంట నేలకొరిగింది. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టి యాలక్కి రకం సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. అంకంపల్లిలో లక్ష్మీకాంతరెడ్డి నాలుగు ఎకరాలలో సాగుచేసిన అరటి, నరేంద్ర చౌదరికి చెందిన మూడు ఎకరాల బొప్పాయి, శ్రీనివాసులు తోటలో రెండు ఎకరాల అరటిపంట నేలకొరిగింది. మరో 15 రోజులలో చేతికొచ్చే పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎర్రగుడి, తగ్గుపర్తి గ్రామాల మధ్య గాలులకు 15 విద్యుత స్తంభాలు పడిపోయాయి. మండలంలో శుక్రవారం రాత్రి కరెంటు లేక ప్రజలు ఇబ్బందిపడ్డారు.

ఆశలన్నీ నేలపాలు

ఎకరానికి రూ.లక్ష పెట్టుబడితో మే లు రకం యాలక్కి అరటి పంటను నాలుగు ఎకరాలలో సాగు చేశాను. చేతికి వచ్చే సమయంలో గాలీవానకు దెబ్బతింది. పంట మొత్తం నేలపాలైంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.

- రుద్రప్ప, దుద్దేకుంట

చేతికొచ్చిన పంట..

ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే ప్రకృతి కన్నెర్ర చేసింది. చేతికొచ్చిన బొప్పాయి పంట నోటికందకుండా పోయింది. ఐదు ఎకరాలలో పంట సాగుచేయగా.. మూడు ఎకరాలు ధ్వంసమైంది.

- నరేంద్రచౌదరి, అంకంపల్లి


గాలివానకు నేలకొరిగిన విద్యుత స్తంభాలు

తాడిపత్రి టౌన: పట్టణంలోని యల్లనూరు రోడ్డు, పుట్లూరు రోడ్డు, నందలపాడు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చుక్కలూరు, తేరన్నపల్లి, సజ్జలదిన్నె, తేళ్లమిట్టపల్లి, బుగ్గ, వెంకటాంపల్లి తదితర గ్రామాల్లో విద్యుత స్తంభాలు, ట్రాన్సఫార్మర్లు నేలకొరిగాయి. గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. 24 గంటలు గడిచినా విద్యుత సరఫరాను పునరుద్ధరించలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

- పెద్దపప్పూరు మండలం సింగనగుట్టపల్లికి చెందిన రైతు నారాయణస్వామికి చెందిన రెండు ఎనుములు శుక్రవారం రాత్రి పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత స్తంభాలు నేలకొరగడంతో గంటల తరబడి విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు చిమ్మచీకట్లో గడపాల్సి వచ్చింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 26 , 2024 | 12:12 AM