Share News

SCAM : ఇద్దో.. లచ్చ..!

ABN , Publish Date - May 29 , 2024 | 11:38 PM

చేసిన తప్పులు, అక్రమాలు బయటకు పొక్కడంతో స్కాంవీరులు దుప్పటి పంచాయితీకి వెళ్లారు. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను కలిసి లక్ష రూపాయల లంచం ఆఫర్‌ చేసినట్లు తెలిసింది. లక్షలకు లక్షలు స్వాహా చేసి.. ఓ లక్ష రూపాయలతో అధికారుల నోరు మూయించాలని ప్రయత్నించి.. విఫలమైనట్లు ప్రచారం జరుగుతోంది. గుంతకల్లు ఎంపీడీఓ కార్యాలయంలో గతంలో అభివృద్ధి పనుల నిధులు పక్కదారిపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ...

SCAM : ఇద్దో.. లచ్చ..!

ఆ స్కాం గురించి మరిచిపోండి

అధికారులకు అక్రమార్కుల ఆఫర్‌

ఫలించని దుప్పటి పంచాయితీ

అనంతపురం విద్య, మే 29: చేసిన తప్పులు, అక్రమాలు బయటకు పొక్కడంతో స్కాంవీరులు దుప్పటి పంచాయితీకి వెళ్లారు. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను కలిసి లక్ష రూపాయల లంచం ఆఫర్‌ చేసినట్లు తెలిసింది. లక్షలకు లక్షలు స్వాహా చేసి.. ఓ లక్ష రూపాయలతో అధికారుల నోరు మూయించాలని ప్రయత్నించి.. విఫలమైనట్లు ప్రచారం జరుగుతోంది. గుంతకల్లు ఎంపీడీఓ కార్యాలయంలో గతంలో అభివృద్ధి పనుల నిధులు పక్కదారిపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు విచారణకు డిమాండ్‌ చేస్తున్నారు. గుంతకల్లుకు చెందిన కొందరు జడ్పీ సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. అక్రమాలపై విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై ఇటీవల ఆంధ్రజ్యోతిలో కథనం


ప్రచురితమైంది. అభివృద్ధి నిధులలో సుమారు రూ.85 లక్షలు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకూ విచారణ పట్టాలెక్కలేదు. ఈ స్కాం బయటకు రావడంతో గతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన మండల స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు, ఆఫీస్‌ సిబ్బంది, కొందరు వైసీపీ నాయకులు దుప్పటి పంచాయితీకి దిగినట్లు తెలుస్తోంది. అందరూ ఏకమై రూ.లక్ష తీసుకుని రాయబేరాలకు వెళ్లినట్లు తెలిసింది. ప్రభుత్వ సొమ్ము సొంత ఖాతాకు మళ్లించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళా ఉద్యోగి ద్వారా ప్రస్తుతం గుంతకల్లు ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులకు రూ.లక్ష ఆఫర్‌ చేసినట్లు సమాచారం. అయితే ఆ అధికారులు తిరస్కరించారని తెలిసింది. ‘మీ పంచాయితీ మాకు వద్దు.. విచారణ జరిగితే మా పరిస్థితి ఏమిటి..? ఆ తిప్పలేవో మీరే పడండి’ అని స్పష్టం చేసినట్లు సమాచారం. స్కాంపై విచారణ జరిగితే ఇరుక్కుపోతామని భావించిన పలువురు అధికారులు.. ఎలాగైనా అక్రమాలను కప్పిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 29 , 2024 | 11:38 PM