Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

AP Politics: 2019లో వైసీపీని గెలిపించిన ప్రశాంత్ కిశోర్.. ఈ సారి గెలుపెవరిదో చెప్పేశారు

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:40 AM

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భారీ పరాజయం ఎదుర్కోనున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) జోస్యం చెప్పారు.

AP Politics: 2019లో వైసీపీని గెలిపించిన ప్రశాంత్ కిశోర్.. ఈ సారి గెలుపెవరిదో చెప్పేశారు

ఆంధ్రలో టీడీపీ గెలుపు ఖాయం.. ప్రశాంత్‌ కిశోర్‌ జోస్యం

భవంతిలో కూర్చుని బటన్‌ నొక్కితే ఓట్లు రాలవు

ప్రజలు అభివృద్ధి కోరతారు..

యువత ఉద్యోగాలు అడుగుతారు

ఇతరత్రా ప్రయోజనాలు ఆశించరు

ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వాన్నీ ఓడించలేరు

ప్రజాధనం ఖర్చుచేస్తూ వారి బాగోగులు

చూస్తున్నామనుకోవడం తప్పు

జగన్‌కూ కేసీఆర్‌ గతే: ప్రశాంత్‌ కిశోర్‌

అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భారీ పరాజయం ఎదుర్కోనున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) జోస్యం చెప్పారు. ఆయన రాజకీయ భవిష్యత్‌ క్షీణ దశలో ఉందని, తెలంగాణలో కేసీఆర్‌కు పట్టిన గతే ఆయనకూ పట్టబోతోందన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓట్లు వేసేటప్పుడు ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారని.. ఉచిత పథకాలకు కాదని స్పష్టం చేశారు. ‘యువత.. ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు.. ఇతరత్రా ప్రయోజనాలు కాదు. ఉచితాలపైనే జగన్‌ పూర్తిగా ఆధారపడ్డారు. దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. మామూలు ఓటమి కాదు.. భారీ పరాజయం తప్పదు’ అని తేల్చిచెప్పారు. ప్రజలు సమర్థ నిర్వహణను చూస్తారని.. కేవలం వనరుల నిర్వహణను కాదని చెప్పారు. ప్రజాధనాన్ని ఖర్చుచేస్తూ వారి బాగోగులను చూస్తున్నామని భావిస్తే అది పొరపాటని. జగన్‌ ఇదే చేస్తున్నారని.. తెలంగాణలో కూడా కేసీఆర్‌ ఇదేచేసి దెబ్బతిన్నారని తెలిపారు. ఎన్నికల ఫలితాలను ధనబలం మాత్రమే నిర్ణయించగలదని అనుకుంటే.. ఏ ప్రభుత్వాన్నీ ఓడించలేరని స్పష్టం చేశారు.


జగన్‌ భారీ పరాజయం చవిచూడనున్నారని.. ఎందుకంటే.. భవంతిలో కూర్చుని బటన్‌ నొక్కి నేరుగా డబ్బును జమచేసినంత మాత్రాన ఓట్లు రాలవని తేల్చిచెప్పారు. ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వమూ ఓడిపోదని పునరుద్ఘాటించారు. దక్షిణాదిన రాజకీయాల్లో డబ్బు సంస్కృతి అలవడిందని.. కానీ తీసుకున్న డబ్బు ఆధారంగా ప్రజలు ఓట్లు వేయరని తెలిపారు. ‘ఎందుకంటే ఉత్తర భారతంలో కంటే దక్షిణాదినే జనం ఎక్కువ ప్రభుత్వాలను మార్చేశారు’ అని చెప్పారు. ఏతావాతా వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయం తథ్యమని ఆయన అంచనా వేశారు. గత ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌ వైసీపీకి వ్యూహకర్తగా ఉండి ఆ పార్టీని విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల కిందట ఇక ఎవరికీ రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని ప్రకటించి.. బిహార్‌ రాజకీయాల్లో మార్పు కోసం ‘జన్‌సురాజ్‌’పేరిట పాదయాత్ర చేపట్టారు. అయితే ఆయన ఐ-ప్యాక్‌ టీం ఇప్పటికీ జగన్‌కు పనిచేస్తోంది. ఆ మధ్య పీకే టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా సమావేశమయ్యారు. ఆ పార్టీ తరఫున పనిచేయబోతున్నారని వార్తలు వచ్చినా ఉభయవర్గాలూ వాటిని తోసిపుచ్చాయి.

Updated Date - Mar 04 , 2024 | 07:14 AM