TSPSC High Court: భద్రత ఫీచర్లను ఎందుకు ఎత్తేశారు?

ABN , First Publish Date - 2023-06-23T15:18:52+05:30 IST

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ని హైకోర్టు కడిగి పారేసింది. ఈ నెల 11న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహణ లోపాలపై సీరియస్‌ అయ్యింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న భద్రత ఫీచర్లను పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి పేపర్‌ లీకేజీని ఎదుర్కొన్న టీఎ్‌సపీఎస్సీ.. మరింత అప్రమత్తంగా

TSPSC High Court: భద్రత ఫీచర్లను ఎందుకు ఎత్తేశారు?

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు అభ్యర్థుల బయోమెట్రిక్‌ ఎందుకు తీసుకోలేదు?

టీఎస్‌పీఎస్సీని కడిగిపారేసిన హైకోర్టు..

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC)ని హైకోర్టు (High Court) కడిగి పారేసింది. ఈ నెల 11న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహణ లోపాలపై సీరియస్‌ అయ్యింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న భద్రత ఫీచర్లను పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి పేపర్‌ లీకేజీని ఎదుర్కొన్న టీఎ్‌సపీఎస్సీ.. మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సింది పోయి.. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించిందని నిలదీసింది. పరీక్షల నిర్వహణ పేరుతో అభ్యర్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు.. నిబంధనల ప్రకారం ఎందుకు వ్యవహరించలేదని ప్రశ్నించింది. సమయం లేదనుకున్నప్పుడు ఇంత హడావుడిగా పరీక్షలను ఎందుకు నిర్వహించాలో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. భద్రత ప్రమాణాలను పాటించకుండా నిర్వహించిన ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలంటూ ఆదిలాబాద్‌ జిల్లా నేరెడిగొండకు చెందిన బి.ప్రశాంత్‌, పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గురువారం ఈ వ్యాజ్యం జస్టిస్‌ పి.మాధవీదేవి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.గిరిధర్‌రావు, న్యాయవాది బి.నర్సింగ్‌ వాదనలను వినిపించారు. ‘‘ప్రిలిమ్స్‌ను పకడ్బందీగా నిర్వహించినట్లు గొప్పలు చెప్పిన టీఎ్‌సపీఎస్సీ.. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు అభ్యర్థుల బయోమెట్రిక్‌ను తీసుకోలేదు. ఓఎంఆర్‌ షీట్‌పై అభ్యర్థుల ఫొటో, హాల్‌టికెట్‌ నంబర్లు లేవు. దీని వల్ల ఒక అభ్యర్థికి బదులు మరొకరు పరీక్షను రాసే ప్రమాదముంది. అనేక అక్రమాలకు ఆస్కారముంది. ఎలాంటి కసరత్తు లేకుండానే గ్రూప్‌-1 పరీక్షను నిర్వహించారు’’ అని ఆరోపించారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ విషయంలో టీఎ్‌సపీఎస్సీ దారుణంగా విఫలమైందని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను పాటించకపోతే దానికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు. ‘‘నోటిఫికేషన్‌ నిబంధనలను పాటించనప్పుడు.. రీ-నోటిఫికేషన్‌ ఇవ్వాల్సింది. అలా ఎందుకు చేయలేదు. ప్రిలిమ్స్‌ అంతా లోపభూయిష్టంగా ఉంది. పేపర్‌ లీకేజీ కుంభకోణం బయటపడ్డాక కూడా.. టీఎ్‌సపీఎస్సీ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. తమవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకే ఈ తతంగం నడిపించినట్లుంది’’ అని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీఎ్‌సపీఎస్సీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని వ్యాక్యానించారు. టీఎ్‌సపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ.. బయోమెట్రిక్‌ యంత్రాలకు రూ.1.85 కోట్ల మేర ఖర్చవుతుందని, ఇంత తక్కువ సమయంలో 3.85 లక్షల మంది బయోమెట్రిక్‌ సాధ్యం కాదని వివరించారు. ‘‘సరైన అభ్యర్థి వచ్చాడా? లేదా? అని నిర్ధారించుకునే పని ఇన్విజిలేటర్‌లది. ఇన్విజిలేటర్‌కు అనుమానం వస్తే.. అభ్యర్థి నిరూపించుకోవాలి. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించాలి. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో మాదిరిగా ఓఎంఆర్‌పై అభ్యర్థి పేర్లు, ఫొటోలు, హాల్‌టికెట్‌ నంబర్లను పేర్కొనడం సాధ్యం కాదు. పోలీసు పరీక్షలకు చాలా తక్కువ మంది హాజరవుతారు’’ అని వివరించారు. పేపర్‌ లీకేజీ దర్యాప్తు పూర్తవ్వకుండానే.. అందరూ నిందితులని పేర్కొనడం సమంజసం కాదన్నారు. పరీక్షల్లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకునే అధికారం టీఎ్‌సపీఎస్సీకి ఉందన్నారు. త్వరలో గ్రూప్‌-4 పరీక్షలు జరగనున్నాయని, 10 లక్షల మంది హాజరవుతారని, అంతమంది ఓఎంఆర్‌ షీట్లను ఫొటో, పేరు, హాల్‌టికెట్‌ నంబర్‌తో ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. టీఎ్‌సపీఎస్సీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా బయోమెట్రిక్‌ ఎందుకు తీసుకోలేదని, ఓఎంఆర్‌ షీట్‌పై పేరు, ఫొటో, హాల్‌టికెట్‌ నంబర్‌ ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించింది. ‘‘3.85 లక్షల మంది అభ్యర్థులున్నారని చెప్పారు. వారి వద్ద ఫీజులు వసూలు చేశారు కదా..? అంతమందికీ హాల్‌టికెట్‌లు జారీ చేశారు కదా? ఓఎంఆర్‌ షీట్‌పై పేరు, హాల్‌టికెట్‌, ఫొటో ఎందుకు ముద్రించలేదు? ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు బయోమెట్రిక్‌ యంత్రాలకు ఖర్చు అవుతుందని ఎందుకు చెబుతున్నారు? అలాంటప్పుడు నోటిఫికేషన్‌లో ఈ భద్రత ఫీచర్లను ఎందుకు పొందుపర్చారు? నోటిఫికేషన్‌లో పేర్కొని.. ఇప్పుడు సాధ్యం కాదని చెప్తే దాని అర్థమేంటి? పేపర్‌ లీకేజీ ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి.. ఉన్న భద్రత ఫీచర్లను ఎత్తేస్తారా? పేపర్‌ లీకేజీ దర్యాప్తు ఇంకా జరుగుతోంది సరే..! పేపర్‌ లీకేజీ ఘటన అయితే జరిగిందన్నది నిజం కాదంటారా? మరింత భద్రత పాటించాల్సిన అవసరం లేదంటారా? పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించడం టీఎ్‌సపీఎస్సీకి ఉన్న చట్టబద్ధమైన విధి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భద్రత ఫీచర్ల ఎత్తివేతపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2023-06-23T15:18:52+05:30 IST