TSRTC Merger Bill : ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
ABN , First Publish Date - 2023-08-06T18:42:17+05:30 IST
తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లుకు (TSRTC Merger Bill) అసెంబ్లీ ఆమోదం (TS Assembly) తెలిపింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Governer Tamilisai) ఆమోదం తర్వాత అసెంబ్లీకి వచ్చిన ఈ బిల్లును ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రవేశపెట్టారు. మెజార్టీ శాసన సభ్యులు బిల్లును ఆమోదించడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారేందుకు ముందడుగు పడింది..
తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లుకు (TSRTC Merger Bill) అసెంబ్లీ ఆమోదం (TS Assembly) తెలిపింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Governer Tamilisai) ఆమోదం తర్వాత అసెంబ్లీకి వచ్చిన ఈ బిల్లును ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రవేశపెట్టారు. మెజార్టీ శాసన సభ్యులు బిల్లును ఆమోదించడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారేందుకు ముందడుగు పడింది. కేటీఆర్ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay Kumar) మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీ (PRC) ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తిస్తుందన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్, దాని ఆస్తులు యథాతథంగా ఉంటాయన్నారు. ఉద్యోగులతో చర్చించి.. పదవీ విరమణ బెన్ఫిట్స్ నిర్ణయిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తామని చర్చలో భాగంగా పువ్వాడ తెలిపారు.
మొత్తం 8 బిల్లులు..!
కాగా.. ఇదే సభలో తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లును కూడా మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. బాన్సువాడ, ఆలేరు మున్సిపాలిటీల్లో పలు గ్రామాలను పంచాయితీరాజ్‌లో కలుపుతూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించింది. దీంతో పాటు పంచాయితీ రాజ్ చట్ట సవరణ బిల్లుకూ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం శాసన సభ నిరవధిక వాయిదా పడింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 8 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.
ఇవాళ ఉదయం నుంచి ఇలా..?
ఇదిలా ఉంటే.. ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం తమిళిసై ఎట్టకేలకు బిల్లను ఆమోదించారు. గవర్నర్ అనుమతితో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. అయితే.. ఆర్టీసీ విలీన బిల్లును గత రెండు రోజులుగా గవర్నర్ పెండింగ్‌లో ఉంచడంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. మరోవైపు.. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ తర్వాత విలీనంపై ప్రభుత్వానికి 5 ప్రశ్నలు సంధించడం, కార్మిక సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించడం, ప్రభుత్వం నుంచి ఆ ప్రశ్నలకు వివరణ రావడం.. ఆ తర్వాత మరికొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ తమిళిసై మరోసారి ప్రభుత్వానికి లేఖ రాయడం ఇవన్నీ జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి ఈ బిల్లుపై పెద్ద రచ్చే జరిగింది. ఆఖరికి గవర్నర్ ఆమోదించడం.. ఇటు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం మెజార్టీ శాసన సభ్యులు ఆమోద ముద్ర వేయడంతో.. ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారేందుకు మార్గం సులువైందని చెప్పుకోవచ్చు.