TSPSC: పేపర్‌ లీక్‌ కేసులో టీఎస్‌పీఎస్సీపై సిట్ సీరియస్

ABN , First Publish Date - 2023-05-23T18:59:54+05:30 IST

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)పై సిట్ సీరియస్ అయింది. నోటీసులు ఇచ్చినా సమాచారం ఇవ్వడం లేదంటూ సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

TSPSC: పేపర్‌ లీక్‌ కేసులో టీఎస్‌పీఎస్సీపై సిట్ సీరియస్

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)పై సిట్ సీరియస్ అయింది. నోటీసులు ఇచ్చినా సమాచారం ఇవ్వడం లేదంటూ సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తుకు సహకరించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని బోర్డ్‌కు సిట్ వార్నింగ్ ఇచ్చింది. కాన్ఫిడెన్షియల్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మీ అంశంలో కీలక సమాచారాన్ని సిట్ సేకరించింది. లీకేజీ అంశంలో శంకర్ లక్ష్మీ ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేపర్లు వాల్యుయేషన్ చేయలేదని టీఎస్‌పీఎస్సీ (TSPSC) తప్పుడు వివరాలు ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో నిందితురాలు రేణుక రాథోడ్ వ్యవహారంలో కీలక సమాచారాన్ని సిట్ సేకరించింది. బుధవారం మరోసారి విచారణకు రావాలని రేణుకకు సిట్ నోటీసులిచ్చింది. ఈ కేసులో సాంకేతిక, ఇతర ఆధారాల మేరకు సిట్‌ అధికారులు ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, రేణుక, ఢాక్యానాయక్‌, రాజేశ్వర్‌ నాయక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించగా.. న్యూజిలాండ్‌లో ఉన్న ప్రవీణ్‌తోపాటు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు, మాజీ సిబ్బంది పాత్ర వెలుగులోకి వచ్చింది. దాంతో.. అరెస్టుల సంఖ్య 18–21గానే ఉంది. అయితే.. అనూహ్యంగా ఇటీవల అరెస్టుల సంఖ్య పెరిగింది. మొత్తం 36 మందిని సిట్‌ అరెస్టు చేయగా.. న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌ ఇంకా అరెస్టు కావాల్సి ఉంది.

టీఎస్‌పీఎస్సీ వర్సెస్‌ సిట్‌

సిట్‌ చేతికి మెరిట్‌ లిస్టులు వచ్చాక.. ఉన్నతాధికారులు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందాలు మెరిట్‌లో ఉన్న అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్‌ను తనిఖీ చేయడం మొదలు.. వారికి ఉన్న విషయ పరిజ్ఞానం, సాధించిన మార్కులను బేరీజు వేసుకుంది. అంతేకాదు.. అభ్యర్థుల ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలించి, టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు, ఈ కేసులో నిందితులతో సంబంధాలున్నాయా? అనే అంశంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఖమ్మం (Khammam) నగరానికి చెందిన లౌకిక్‌, సుష్మిత దంపతుల ద్వారా మరికొందరికి డీఏవో ప్రశ్నపత్రం లీకైనట్లు సిట్‌ గుర్తించింది. బెంగళూరు (Bengaluru)కు చెందిన ఆడిటర్‌తోసహా.. మరో ఇద్దరికి బేడీలు వేసింది. సిట్‌ చేతికి మెరిట్‌ లిస్టు వచ్చాకే ఒక్కసారిగా అరెస్టులు పెరిగాయి. నిందితుల సంఖ్య 37కు, అరెస్టుల సంఖ్య 36కు పెరిగింది.

Updated Date - 2023-05-23T18:59:54+05:30 IST