RSS: భైంసాలో ముగిసిన ఆర్ఎస్ఎస్ కవాతు
ABN , First Publish Date - 2023-03-05T19:49:37+05:30 IST
భైంసా (Bhainsa)లో ఆర్ఎస్ఎస్ (RSS) కవాతు ముగిసింది. పురవీధుల గుండా తిరిగి సరస్వతీ శిశుమందిర్‌కు ర్యాలీ నిర్వహించారు. పెద్దసంఖ్యలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్మల్: భైంసా (Bhainsa)లో ఆర్ఎస్ఎస్ (RSS) కవాతు ముగిసింది. పురవీధుల గుండా తిరిగి సరస్వతీ శిశుమందిర్‌కు ర్యాలీ నిర్వహించారు. పెద్దసంఖ్యలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. హిందూవులంతా ఏకమై ముందుకు సాగితే ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంఘ్ కార్యకర్తలు పర్యావరణ పరిరక్షణ, గోరక్షణ, దేవాలయాల రక్షణ, సనాతనమైన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తున్నారన్నారు. హిందూ సమాజమంతా జాగృతమైతేనే భవిష్యత్తు కాలమంతా శుభప్రదంగా ఉంటుందన్నారు.
పట్టణంలో భారీ ర్యాలీ..
హైకోర్టు (High Court) ఆదేశాలకు అనుగుణంగా భైంసా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఆర్‌ఎస్‌ఎస్ పథ సంచాలన్ నిర్వహించింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2గంటలకు ఫూలేనగర్ శ్రీ సరస్వతీ శిశు మందిర్ నుంచి ప్రారంభమైన పథ సంచాలన్ పలు ప్రాంతాల మీదుగా కొనసాగింది. చివరగా ఫూలేనగర్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల శారీరక ప్రదర్శనలు కొనసాగాయి. వక్తల ప్రసంగం ముగిసిన తర్వాత కార్యక్రమం ముగిసింది.
అడుగడునా పూల వర్షం..
ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం భైంసాలో జరిగిన పథ సంచలన్ కార్యక్రమానికి పట్టణ మహిళల నుంచి అపూర్వ స్పందన లభించింది. పథ సంచలన్ కొనసాగే మార్గంలో మహిళలందరూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై అడుగడుగునా పూల వర్షం కురిపించారు. ఆయా కాలనీల మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ పథ సంచలన్‌కు తమ వంతు మద్దతు తెలిపారు.
కాషాయమయమైన భైంసా
భైంసా పట్టణంలోని ప్రధాన రోడ్డు మార్గాలు, కాలనీలు ఆదివారం కాషాయమయమయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ మహిషా నగర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథ సంచాలన్, శరీరక్ ప్రధానోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని హిందూ సంఘాలు కాషాయ జెండాలను అధికంగా ఏర్పాటు చేశారు. పథ సంచాలన్ కొనసాగే మార్గంతో పాటు ఆయా కాలనీలవాసులు తరలివచ్చే మార్గాలన్నింటిలోనూ కాషాయ జెండాలు కట్టారు. వీటితో పాటు స్వాగతానికి సంబంధించి అధిక మొత్తంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
కట్టుదిట్టంగా బందోబస్తు
భైంసాలో ఆదివారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎస్పీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, టౌన్ సీఐ శ్రీను సారథ్యంలో పోలీసు శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. బందోబస్తులో విధుల్లో ఒక ఏఏస్పీ, ఆరుగురు సీఐలు, 17 మంది ఎస్సైలు, 21 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 200 మందికి పైగా పోలీసు కానిస్టేబుళ్లు, 60 మందికిపైగా హోంగార్డులు పాల్గొన్నారు. రెండు కార్యక్రమాలను పోలీసు శాఖ వీడియోల ద్వారా చిత్రీకరించింది. పట్టణ పోలీసు స్టేషన్‌లోని కమాండ్ కంట్రోలర్ కేంద్రం నుంచి సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. వజ్ర వాహనం పథ సంచాలన్ మార్గాన్ని అనుసరించింది.