National Awards: పంచాయతీలకు జాతీయ పురస్కారాలు

ABN , First Publish Date - 2023-04-07T20:50:01+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla district) గంభీరావుపేట గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయి అవార్డు (National Awards) లభించింది.

National Awards: పంచాయతీలకు జాతీయ పురస్కారాలు

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla district) గంభీరావుపేట గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయి అవార్డు (National Awards) లభించింది. స్థానిక సంస్థల్లో జిల్లా పరిషత్‌ నుంచి గ్రామ పంచాయతీల వరకు జాతీయ స్థాయిలో పురస్కారాలను అందుకుంటూ జిల్లా అగ్రగామిగా నిలుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటిస్తున్న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాల్లో భాగంగా 2021 - 2022 సంవత్సరానికి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట (Gambhiraopet) గ్రామ పంచాయతీ స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల విభాగంలో దేశంలో మూడో ర్యాంక్‌ను సాధించింది. ఈ నెల 16న న్యూఢిల్లీ (New Delhi)లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో రూ.30 లక్షల నగదుతో పురస్కారాన్ని అందించనున్నారు.

గంభీరావుపేట మెరిసింది ఇలా..

గంభీరావుపేట గ్రామ పంచాయతీ అభివృద్ధిలో దూసుకెళ్తోంది. గ్రామ పంచాయతీ భవనం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సీసీ రోడ్ల నిర్మాణం, పబ్లిక్‌ టాయిలెట్లు, హెల్త్‌ సబ్‌ సెంటర్‌లతోపాటు మురికి కాలువలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. తెలంగాణ (Telangana)లోనే తొలి కేజీ టు పీజీ విద్యా సంస్థల సముదాయం ప్రారంభించారు. 3500 మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియాల్లో చదువుకోవడానికి వేర్వేరుగా భవనాలు, 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్మించారు. అంతర్జాతీయ వసతులతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశారు.

పెద్దపల్లి జిల్లాలో..

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ప్రతి ఏటా ‘దీన దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతత్‌ వికాస్‌ పురస్కార్‌’ పేరిట 9 అంశాల్లో మూడు పంచాయతీల చొప్పున అవార్డులను ప్రదానం చేస్తారు. అందులో భాగంగా కేంద్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం అవార్డులను ప్రకటించింది. ‘పరిశుభ్రత- పచ్చదనం’ విభాగంలో 3వ ర్యాంకు సాధించిన సుల్తాన్‌పూర్‌ గ్రామ పంచాయతీకి అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద రూ.30 లక్షల నగదును అందించనున్నారు. ఏప్రిల్‌ 16న ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమం ద్వారా అవార్డులను ప్రదానం చేయనున్నారు. అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివిధ కేటగిరీల్లో అవార్డులు రాగా, జాతీయ స్థాయిలోనూ అవార్డు రావడంతో సుల్తాన్‌పూర్‌ సర్పంచ్‌ అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-07T20:50:01+05:30 IST