DK Aruna: హైకోర్టు తీర్పును స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి పట్టించుకోవట్లేదు

ABN , First Publish Date - 2023-09-01T14:06:38+05:30 IST

స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి ఇద్దరూ అందుబాటులో లేకపోవడం బాధాకరమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) వ్యాఖ్యానించారు. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని తీసుకుని డీకే అరుణ అసెంబ్లీకి వచ్చారు.

DK Aruna: హైకోర్టు తీర్పును స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి పట్టించుకోవట్లేదు

హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy), అసెంబ్లీ కార్యదర్శి ఇద్దరూ అందుబాటులో లేకపోవడం బాధాకరమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) వ్యాఖ్యానించారు. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని తీసుకుని డీకే అరుణ అసెంబ్లీకి వచ్చారు. కానీ అక్కడ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి అందుబాటులో లేరు. దీంతో ఆమె నిరాశ చెందారు. ఇటీవల గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ‘‘గద్వాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వడానికి వచ్చా. కానీ స్పీకర్, కార్యదర్శి ఇద్దరూ లేరు. నిన్న సాయంత్రం (గురువారం) ఫోన్ చేసే వచ్చాను.. వస్తున్నట్లు మెసేజ్ కూడా పెట్టాను. కానీ స్పీకర్ దగ్గర సమావేశం ఉందని వెళ్లినట్టు కార్యదర్శి చెబుతున్నారు. స్పీకర్ పేషీలో ఆర్డర్ కాపీ ఇచ్చాం. అసెంబ్లీ స్పీకర్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి తీర్పును అమలు చేయాలి. ఆగస్టు 24న ఈ తీర్పు వచ్చింది. ఆర్డర్ కాపీతో స్పీకర్‌ను కలవడానికి వస్తే ఇద్దరూ లేరు. ఈ తీర్పు నాలుగేళ్ల కింద వస్తే నా గద్వాల‌ను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ చాలా ఆలస్యంగా ఈ తీర్పు వచ్చింది. కార్యదర్శిపై ప్రభుత్వ ఒత్తిడి (BRS Government) ఏమైనా ఉండొచ్చన్న అనుమానం ఉంది. ముందు సమాచారం ఇచ్చినా వీరిద్దరూ లేకపోవడం బాధాకరం.’’ అని డీకే అరుణ వాపోయారు.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

‘‘గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై సోమవారం భారత ఎన్నికల ప్రధాన అధికారిని కలుస్తాం. డీకే అరుణ విషయంలో వచ్చిన తీర్పును కచ్చితంగా అమలు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది.’’ అని దుబ్బాక బీజేపీ రఘునందన్‌రావు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-09-01T14:06:38+05:30 IST