Minister KTR: విమర్శలు చేయడం ఈజీ.. పని చేయడం కష్టం..

ABN , First Publish Date - 2023-02-01T15:32:47+05:30 IST

సిరిసిల్ల జిల్లా: మన ఊరు-మన బడిలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ భవనాన్ని మంత్రి కేటీఆర్.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.

Minister KTR: విమర్శలు చేయడం ఈజీ.. పని చేయడం కష్టం..

సిరిసిల్ల జిల్లా: మన ఊరు-మన బడిలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ (KG to PG) భవనాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR).. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy)తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ విమర్శలు చేయడం ఈజీ అని, పని చేయడం కష్టమని అన్నారు. మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఒక్క మంచి పని అయినా చేశారా? అని ప్రశ్నించారు. నోరు పారేసుకోవడం తమకు కూడా తెలుసునని.. ప్రతిపక్షాల కంటే.. ఎక్కువే తిట్టగలమని అన్నారు. దేశంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తున్న రాష్ట్రం ఉందా? అని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి జోడేడ్లలాగా పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కాగా ‘మన ఊరు- మన బడి’లో భాగంగా రాష్ట్రంలోనే తొలి కేజీ టూ పీజీ క్యాంపస్‌ గంభీరావుపేటలో రూపుదిద్దుకుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒకే చోట కేజీ టూ పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు మంత్రి కేటీఆర్‌ కార్పొరేట్‌ సంస్థల సహకారంతో గంభీరావుపేటలో ఆరుఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. రూ. మూడు కోట్ల వ్యయంతో సకల వసతులతో దీనిని నిర్మించారు.

సర్కారు బడికి మంచి రోజులు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి, మన బస్తీ’ కార్యక్రమాలకు తోడుగా దాతలు, కార్పొరేట్‌ సంస్థల చేదోడుగా నిలవడంతో ప్రభుత్వ పాఠశాలలకు సకల హంగులు చేకూరాయి. రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తొలి కేజీ టు పీజీ విద్యా సంస్థల సముదాయం ఏర్పాటైంది. మరోవైపు జిల్లాలో 510 పాఠశాలలు ఉండగా మౌలిక వసతులకు సంబంధించిన వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించిన జిల్లా విద్యాశాఖ వాటిల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద 172 పాఠశాలలను ఎంపిక చేసింది. మరమ్మతులతోపాటు పాతబడులకు కొత్త సొబగులను అందించే పనులు చేపట్టింది. ఇందులో తొలి ఫలితంగా బుధవారం జిల్లాలో గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ టు పీజీ పాఠశాలతోపాటు 15 ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేజీ టు పీజీ పాఠశాలల సముదాయాన్ని ప్రారంభించారు.

జిల్లాలో ఇప్పటికే ‘మన ఊరు-మనబడి’ కార్యాక్రమంలో ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్‌లు, విద్యుద్దీకరణ, తాగునీరు, శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో నూతన గదులు, పాఠశాలలకు మరమ్మతు చేపట్టారు. ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, వంటగదులు, ప్రహరీ నిర్మిస్తున్నారు. ‘మన ఊరు-మనబడి’ ద్వారా పాఠశాలల అభివృద్ధే కాకుండా పల్లెల్లో ఇంగ్లీష్‌ చదువులు అందిస్తున్నారు. జిల్లాలో 52 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా ఇందులో 24,625 మంది బాలురు, 27,375 మంది బాలికలు చదువుతున్నారు. వీరికి గతేడాది నుంచి ఇంగ్లీషు మాధ్యమంలో బోధిస్తున్నారు. మరోవైపు జిల్లాలోనే ప్రాథమిక విద్య నుంచి ఇంజనీరింగ్‌, నర్సింగ్‌, మెడిసిన్‌, అగ్రికల్చర్‌, పాలిటెక్నిక్‌ చదువులు చదువుకునే వీలు ఏర్పడింది. సిరిసిల్ల ఏడ్యుకేషన్‌ హబ్‌గా మారింది.

Updated Date - 2023-02-01T15:32:50+05:30 IST