TS News: బండి సంజయ్‌పై మహిళ కమిషన్ సీరియస్
ABN , First Publish Date - 2023-03-18T17:12:26+05:30 IST
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళ కమిషన్ సీరియస్ అయింది.

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళ కమిషన్ సీరియస్ (Woman Commission Serious) అయింది. శనివారం సుమారు రెండున్నర గంటల పాటు సంజయ్‌ను విచారించింది. రాజకీయంగా, మరొక విధంగానైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, మరోసారి ఇలాంటి వాక్యాలు చేయకూడదని కమిషన్ సూచించింది.
మహిళల పట్ల పలు సందర్భాల్లో బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మహిళ కమిషన్ వీడియోల రూపంలో చూపించి ప్రశ్నల వర్షం కురిపించింది. బతుకమ్మను, మహిళలను లంగలు, దొంగలు అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలు చూపిస్తూ కమిషన్ విచారణ చేసింది. భవిష్యత్తులో మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదంటూ బండి సంజయ్‌కు ఆదేశించింది. కాగా ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బండి సంజయ్ వ్రాత పూర్వకంగా వివరణ ఇచ్చారు.
అనుకోకుండా చేసిన వాఖ్యలు తప్ప ఎలాంటి దుర్దేశంతో చేయలేదని, అన్ని వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేయలేదంటూ బండి సంజయ్ సంజాయిషీ ఇచ్చుకున్నట్లు సమాచారం. ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో కవితను తాను అక్కగా సంబోధించనట్లు కమిషన్‌కు చెప్పినట్లు తెలియవచ్చింది. మహిళలపై మరోసారి సామెతలను ప్రయోగించొద్దంటూ కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. ఇంకోసారి ఇలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు విశ్వాసనీయ సమాచారం. ఎవరైనా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే.. కఠిన చర్యలు తప్పవంది. కాగా మరొకసారి బండి సంజయ్‌ని కమిషన్ విచారించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
కాగా ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళ కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. ‘తప్పు చేసిన కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా’ అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న మహిళ కమిషన్.. ఈ నెల 13న వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటిసులు ఇచ్చింది. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున శనివారం హాజరవుతానంటూ..మహిళ కమిషన్‌కు సంజయ్ సమాధానం ఇచ్చారు.