Hyderabad: తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

ABN , First Publish Date - 2023-03-22T15:47:28+05:30 IST

హైదరాబాద్: హయత్‌నగర్ మునుగానూర్ ద్వారక నగర్‌లోని మేజిస్ట్రేట్ ఇంటి వద్ద తీన్మార్ మల్లన్న (Tinmar Mallanna).. మరికొందరిని పోలీసులు హాజరుపరిచారు.

Hyderabad: తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

హైదరాబాద్: హయత్‌నగర్ మునుగానూర్ ద్వారక నగర్‌లోని మేజిస్ట్రేట్ ఇంటి వద్ద తీన్మార్ మల్లన్న (Tinmar Mallanna).. మరికొందరిని పోలీసులు హాజరుపరిచారు. విచారణ జరిపిన జడ్జ్ మల్లన్నకు 14రోజుల రిమాండ్ (Remand) విధించారు. దీంతో మల్లన్నతో పాటు మరో నలుగురిని పోలీసులు చర్లపల్లి జైలు (Charlapally Jail)కు తరలించారు.

తీన్మార్ మల్లన్నపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని.. ఈ ప్రభుత్వం ప్రజా గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని మల్లన్న భార్య మమత విమర్శించారు. ఈ రోజు ఉదయం నుంచి పోలీసులు మల్లన్నను పలు పోలీస్ స్టేషన్లకు తరలించారని.. ఇక్కడా మల్లన్నను పోలీసులు కలవ నియ్యలేదని, అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మల్లన్న రిమాండ్‌పై గురువారం ఎల్బీనగర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని మమత తెలిపారు. క్యూ ఆఫీస్‌పై దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.

తీన్మార్ మలన్న రిమాండ్ రిపోర్టు

తీన్మార్ మల్లన్న కేసులో 8 మంది నిందితులుగా ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో ఆరుగురు అరెస్టు కాగా మరో ఇద్దరు పరారయ్యారన్నారు. ఎస్‌వోటీ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్న టీమ్‌పై 363 ,342, 395, 332, 307 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ 7 (1) కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్‌ను మల్లన్న టీమ్ అక్రమంగా కిడ్నాప్ చేసి దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఫర్జాదీగూడ, రాఘవేంద్ర భవన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను అడ్డుకొని క్యూ న్యూస్ ఆఫీస్‌కు తీసుకెళ్లి దాడి చేశారన్నారు. చైన్ స్నాచర్ల కోసం వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసులను నిలదీశారని, ఎవరు? ఎందుకు వాహనాలు చెక్ చేస్తున్నారో చెప్పాలని, ఐడీ కార్డు చూపించాలని మల్లన్న టీమ్ పోలీసులతో గొడవ పడ్డారని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-03-22T15:47:28+05:30 IST