Sitaram Yechuri: బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోంది..

ABN , First Publish Date - 2023-04-09T14:34:49+05:30 IST

బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో మోదీ సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు.

Sitaram Yechuri: బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోంది..

హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి సభ ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి మాట్లాడుతూ కలిసి పనిచేయడానికి సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కలిసి రావడం శుభపరిణామమన్నారు. బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో మోదీ సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఈడీ, సీబీఐల ద్వారా అక్కడి ప్రభుత్వాలు లేకుండా చేయాలని చూస్తోందని విమర్శించారు. 5వేల మందికి పైగా ఈడీ ఛార్జిషీట్‌లు ఇచ్చిందని.. కానీ 0.1 పర్సెంట్ మాత్రమే నేరం నిరూపితమైందన్నారు.

దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీతారం ఏచూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌లకు అనుకూలంగా ఉంటూ మత రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ అదానికి అప్పగిస్తున్నారని, ఏప్రిల్ 5న రైతాంగం, కూలీలు పెద్ద నిరసన తెలుపుతూ తమ రుణాలు మాఫీ చేయాలని కోరారన్నారు. కానీ వారి కార్పొరేట్ మిత్రులకు వేల కోట్ల రుణమాఫీ చేశారని విమర్శించారు.

నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయని, రైతంగం మరోసారి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారని సీతారం ఏచూరి అన్నారు. మతోన్మాద ఘర్షణలు అరికట్టాలని, దేశ చరిత్రలో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకల్లో ఏనాడూ ఘర్షణలు జరగలేదని, ఈమధ్య కాలంలో ఘర్షణలకు దారి తీస్తున్నాయని అన్నారు. కర్ణాటకలో హిందూత్వ ఓటు బ్యాంకు కోసం టిప్పు సుల్తాన్ అంశాన్ని తెచ్చి ఘర్షణలు చేస్తున్నారని, ప్రాంతీయ ప్రభుత్వాలను కులగొట్టి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని చూస్తోందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఒక సెషన్ కూడా నడిపించలేకపోయారని.. ఆధాని కుంభకోణలాపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారని సీతారం ఏచూరి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజ, కూనంనేని, తమ్మినేని, నారాయణ, రాఘవులు, చాడా వెంకటరెడ్డి తదితరులు... మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉమ్మడి సమావేశంలో సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-09T14:34:49+05:30 IST