KP Chaudhary: కేపీ చౌదరి అరెస్ట్‌తో కదిలిన డొంక! సెలబ్రిటీలు ఏమంటున్నారంటే..!

ABN , First Publish Date - 2023-06-24T16:53:39+05:30 IST

డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన కబాలి సినీ నిర్మాత కేపీ చౌదరి వ్యవహారం తెలంగాణలో పెను దుమారం రేపుతోంది. పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఫోన్ కాల్స్, ఫొటోలను పరిశీలించాక అనేక మంది పేర్లు రావడం కలకలం రేపుతోంది. పలువురు సినీ తారలతో ఎక్కువగా

KP Chaudhary: కేపీ చౌదరి అరెస్ట్‌తో కదిలిన డొంక! సెలబ్రిటీలు ఏమంటున్నారంటే..!

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన కబాలి సినీ నిర్మాత కేపీ చౌదరి (KP Chaudhary) వ్యవహారం తెలంగాణలో పెను దుమారం రేపుతోంది. పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఫోన్ కాల్స్, ఫొటోలను పరిశీలించాక అనేక మంది పేర్లు రావడం కలకలం రేపుతోంది. పలువురు సినీ తారలతో ఎక్కువగా ఫోన్ మాడినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. కేపీ చౌదరితో ఉన్న సంబంధాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వివరించారు.

skd.jpg

సిక్కిరెడ్డి తల్లి మాధురీ...

‘‘2009లో మా అపార్ట్‌మెంట్‌లో కేపీ చౌదరి అద్దెకి ఉండే వాడు. అలా మాత్రమే తెలుసు. మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాక.. మా ఇల్లు అద్దెకు అడిగాడు. కానీ ఇవ్వలేదు. గోవా నుంచి తిరిగి వచ్చాక ఇక్కడే అద్దె కోసం ఇల్లు చూసుకున్నాడు. అద్దెకు తీసుకున్న ఇంట్లోకి వెళ్లడానికి వారం రోజుల సమయం ఉండడంతో అంతవరకు స్నేహిత హిల్స్‌లో ఉన్న సిక్కిరెడ్డి (Sikki Reddy) ఇంట్లో ఉంటాను అన్నాడు. అందుకు మేము సరే అని స్నేహిత హిల్స్‌లో ఉండమని చెప్పాం. ఆ ఇంట్లో పార్టీ జరిగింది అంట.. మాకు తెలియదు. మా సిక్కిరెడ్డి కూడా వెళ్లలేదు. కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకోండి. మా అమ్మాయి పార్టీలకు వెళ్లదు.. మందు అలవాటు లేదు. ఎలాంటి పోలీసు విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నాం’’ అని సిక్కిరెడ్డి తల్లి మాధురీ తెలిపారు.

dddd.jpg

సిక్కిరెడ్డి భర్త.....

‘‘సిక్కి రెడ్డికి డ్రగ్స్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. సిక్కిరెడ్డికి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. అసలు పార్టీ కల్చర్ కూడా అలవాటు లేదు. క్రీడాకారులు కాబట్టి రెండు నెలలకొకసారి డోప్ టెస్టులు ఉంటాయి. ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే డోప్ టెస్టులో తెలుస్తుంది. కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలకు కూడా ఎప్పుడూ సిక్కి రెడ్డి వెళ్లలేదు. పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే హాజరు అవ్వటానికి సిద్ధం. సిక్కిరెడ్డి ఫోన్ పోలీసులు అడిగితే ఇవ్వడానికి కూడా మేము సిద్ధం. కేపీ చౌదరికి ఇల్లు అద్దెకు ఇవ్వడం వల్లే ఈ ప్రచారం అంత.’’ అని ఆరోపణలను సిక్కిరెడ్డి భర్త కొట్టిపారేశారు.

యాక్టర్ జ్యోతి...

కేపీ చౌదరితో ఉన్న సంబంధంపై యాక్టర్ జ్యోతి (Actor Jyoti) స్పందించింది. ‘‘ఎప్పుడు ఫోన్ మాట్లాడినా అమ్మానాన్న ఎలా ఉన్నారు అని మాత్రమే మా మధ్య సంభాషణ జరిగింది. కేపీ చౌదరి వాళ్ల అబ్బాయిని మా ఇంటికి తీసుకొచ్చేవాడు. అలాగే కుక్కపిల్లను కూడా మా ఇంటికి తీసుకొచ్చేవాడు. అలా ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది తప్ప డ్రగ్స్ గురించి కాదు. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు నేను సిద్ధమే. నా ఫోన్ ఈ క్షణం ఇవ్వడానికైనా నేను సిద్ధమే. ఫిలిం ఫంక్షన్లలో కేపీ చౌదరితో ఫొటోలు దిగితే డ్రగ్స్ సంబంధాలు అంటగడతారా..? నేను పోలీస్ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను.’’ అని జ్యోతి తెలిపింది.

Updated Date - 2023-06-24T17:07:05+05:30 IST