Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి.. గంగమ్మ ఒడిలోకి గణపయ్య

ABN , First Publish Date - 2023-09-28T13:25:39+05:30 IST

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. ట్యాంక్‌బండ్ క్రేన్ నెంబర్ - 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నారు. క్రేన్ నెంబర్- 4 వద్ద చివరి పూజలు అందుకున్న తర్వాత సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బడా గణేష్‌ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యారు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి.. గంగమ్మ ఒడిలోకి గణపయ్య

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం (Khairatabad Mahaganesh) వైభవంగా జరిగింది. ఎన్టీఆర్‌ మార్గ్ క్రేన్ నెంబర్ - 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నారు. క్రేన్ నెంబర్- 4 వద్ద చివరి పూజలు అందుకున్న తర్వాత సరిగ్గా మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో బడా గణేష్‌ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో క్రేన్ నెంబర్-4 వద్దకు మహాగణపతి రాగానే గంటపాటు వెల్డింగ్‌ పనుల అనంతరం గణనాథుడిని నిమజ్జనం చేశారు. మహాగణపతి నిమజ్జనోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా జనం క్రేన్‌నెంబర్-4 వద్దకు చేరుకున్నారు. బై బై గణేషా అంటూ ఘనంగా బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు భక్తజనసంద్రంగా మారిపోయాయి. మహాగణపతి నిమజ్జనానికి రెండు భారీ క్రేన్లను ఉపయోగించారు.


khairatabad-mahaganapati-3.jpg

ఇదిలా ఉండగా.. షెడ్యూల్‌ కంటే ముందుగానే ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర ఏడు గంటలపాటు నిర్విరామంగా కొనసాగింది. దారి పొడువుగా గణపయ్యకు భక్తులు నీరాజనాలు పలికారు. మహాగణపతి ముందు యువత తీన్మార్ డ్యాన్సులతో హోరెత్తించారు. గణేష్ నామస్మరణతో ట్యాంక్‌బండ్ మారుమోగింది. మహాగణపతి నిమజ్జనం పూర్తి అవడంతో మిగిలిన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం మొదలైంది.


కాగా.. గతంలో జంట నగరాల్లోని వినాయక నిమజ్జనం ముగిశాక చివరిలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉండేది. చివరిలో బడా గణేష్ నిమజ్జనం పెట్టుకుంటే ఇబ్బంది తలెత్తుతోందని ముందుగానే నిర్వహిస్తున్నారు. కాగా.. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రలో బ్యాండ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అలాగే మహాగణపతి నిమజ్జనోత్సవంలో పోలీసుల హడావుడిపై గణేష్ ఉత్సవ నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శోభాయాత్రలో భక్తులు భారీగా పాల్గొనకుండానే నిమజ్జన కార్యక్రమం ప్రారంభించడంపై ఉత్సవ నిర్వాహకులు అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-28T13:51:29+05:30 IST