Gadwal Vijayalakshmi: నాలాలో పడి చిన్నారి మృతి... మేయర్ ఆగ్రహం

ABN , First Publish Date - 2023-04-29T11:43:56+05:30 IST

సికింద్రాబాద్ కళాసిగూడలో నాలాలో పడి చిన్నారి మృతి చెందిన ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు.

Gadwal Vijayalakshmi: నాలాలో పడి చిన్నారి మృతి... మేయర్ ఆగ్రహం

హైదరాబాద్: సికింద్రాబాద్ కళాసిగూడలో నాలాలో పడి చిన్నారి మృతి చెందిన ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (GHMC Mayor Gadwal Vijayalakshmi) సందర్శించారు. అక్కడ పరిస్థితులను క్షేత్రస్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కాషన్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి వివరాల కోసం చూస్తున్నామని.. వివరాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పనులు జరుగుతున్న సందర్భంలో అధికారులు ఇచ్చే ఆదేశాలను ఎవరు అతిక్రమించవద్దని అన్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన భారీ కేడింగ్ తొలగిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాప కుటుంబాన్ని జీహెచ్ఎంసీ వైపు నుంచి ఆదుకుంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు.

కాగా.. సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి అయ్యింది. సికింద్రాబాద్‌ కళాసిగూడలో మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండడంతో చిన్నారి మౌనిక డ్రైనేజీలో పడిపోయింది. విషయం తెలిసిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది చిన్నారి కోసం గాలించగా... పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు. ఈరోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాల కోసం వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చివరకు మ్యాన్‌హోల్‌లో పడి పాప మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

Updated Date - 2023-04-29T11:43:56+05:30 IST