Educaton: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు యథేచ్ఛగా ఫీజుల దందా కొనసాగుతున్నా...చూసీ చూడనట్టు అధికారుల తీరు..

ABN , First Publish Date - 2023-03-14T14:02:45+05:30 IST

పాఠశాలల ఫీజుల నియంత్రణ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం చేసిన‌ పలు సిఫారసులను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు(Private School) పక్కన బెట్టాయి.

Educaton: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు యథేచ్ఛగా ఫీజుల దందా కొనసాగుతున్నా...చూసీ చూడనట్టు అధికారుల తీరు..

హైదరాబాద్‌: పాఠశాలల ఫీజుల నియంత్రణ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం చేసిన‌ పలు సిఫారసులను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు(Private School) పక్కన బెట్టాయి. మంత్రి వర్గ ఉపసంఘం సిఫారసు ప్రకారం తెలంగాణలోని పాఠశాలలు మునుపటి సంవత్సరంలో వసూలు చేసిన ఫీజులో 10 శాతానికి మించి ఫీజులను పెంచకూడదు. నిబంధనలను పక్కన బెట్టి వచ్చే విద్యాసంవత్సరాని(2023-24)కి గాను పలు పాఠశాలల యాజమాన్యాలు ఫీజలు (School Fee) భారీగా పెంచాయి. ప్రస్తుతం ఉన్న ఫీజుల కంటే 6 నుంచి 20శాతం వరకు పెంచాయి. దీంతో విద్యార్థుల తల్లితండ్రులపై మోయలేని భారం పడుతోంది. ఈ విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలు ముగియనున్నాయి. వచ్చే ఏడాది కట్టాల్సిన ఫీజుల విషయంలో ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థుల తల్లితండ్రలకు వాట్సాప్‌ మెసెజ్‌లు, నోటీసులు, మెయిల్స్‌ పంపారు.

విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన

సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న ప్రైవేట్‌ పాఠశాలలో వచ్చే ఏడాది (2023-24) ఫీజులు ఎలా ఉన్నాయంటే 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు రూ.70వేల నుంచి రూ.90వేలు, 4వ తరగతి నుంచి 6వ తరగతి వరకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగి వరకు, రూ.80 వేలు నుంచి లక్షా ఇరవై వేల వరకు ఫీజులు నిర్ణయంచారు. మరికొన్ని కార్పొరేట్‌ ఫీజలు ఇందుకు మరో 20నుంచి 50శాతం అధికంగా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఫీజులు పెంచి జనవరిలోపు కట్టమని ఇప్పుడే నోటీసులు ఇచ్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇస్టానుసారంగా ఫీజుల పెంపు

ఇస్టానుసారంగా ఫీజులు పెంచుతున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చల్లని చూపు చూపుతున్నారు. సర్కారు నిబంధనలను లెక్క చేయకుండా, ఇష్టారాజ్యంగా నడుస్తున్న పాఠశాలలపై అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయం. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు యథేచ్ఛగా ఫీజుల దందా కొనసాగుతున్నా...అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తున్నా.. తమకేమీ పట్టనట్టుగా ఉంటున్నారు.

కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో..

ఇంగ్లిషు మీడియంపై మోజు, కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నారు. దీంతో యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి వస్తుండటంతో తల్లిదండ్రులు ఇబ్బందుల్లో పడుతున్నారు.

ప్రతిఏడాది 20 నుంచి 30 శాతం పెంపు

ప్రతిఏడాది ఆయా పాఠశాలల యాజమాన్యాలు 20 శాతం నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచుతూనే ఉన్నా యి. దీంతె విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తోంది. కంప్యూటర్‌ క్లాసులంటూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారు. రాజేంద్రనగర్‌ మండల పరిధిలోని పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు స్కూళ్లు కట్టలేనంత ఫీజులు నిర్ణయించి విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. మొక్కుబడిగా నాలుగు కంప్యూటర్లు, స్ర్కీన్లను ఏర్పా టు చేసి ఫీజులు వసూలు చేస్తున్నారే తప్ప.. విద్యార్థులకు చెప్పెదేమీ లేదని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు.

తొలగని ట్యాగ్‌లు

కొన్ని పాఠశాలల యాజమాన్యాలు రకరకాల పేర్లతో, ట్యాగ్‌ లైన్‌లతో స్కూళ్లు నడుపుతూ దోచుకుంటున్నాయి. గతంలో రాజేంద్రనగర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో సమావేశమైన విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలకు తోకలు (ట్యాగ్‌) తోలగించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు జారీ చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి ట్యాగ్‌(తోకలు) తొలగించలేదు. ఈ విషయంపై అధికారుల మౌనం దాల్చడం శోచనీయం.

నామమాత్రంగా పేరెంట్స్‌ కమిటీలు

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల విషయంలో సరైన నియంత్రణ లేకపోవడంవల్ల పాఠశాలల యాజమన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫీజుల విషయంలో ఈ కమిటీ నిర్ణయం తీసుకోవాలి. అలాంటిది ఏ ఒక్క పాఠశాలలో అమలు కావడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల విషయంలో ఒక్కసారి కూడా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తల్లిదండ్రులతో మార్చి వరకు కమిటీని ఏర్పాటు చేసి ఏప్రిల్‌లో ఫీజులు నిర్ణయించాలి. ఈ నిబంధనలను పట్టించుకునే వారే లేరు.

Updated Date - 2023-03-14T14:03:06+05:30 IST