CM KCR: ఆ విషయంలో బాధగా ఉంది
ABN , First Publish Date - 2023-10-21T02:44:10+05:30 IST
గజ్వేల్ విషయంలో తన మనసులో ఓ బాధ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తాను గజ్వేల్ ఎమ్మెల్యేనే అయినా.. ఇన్నాళ్లూ ఆ నియోజకవర్గ కార్యకర్తలకు
గజ్వేల్ ఎమ్మెల్యేనే అయినా మీకు దొరకలేదు
అందుకు బాధగా ఉంది
ఇకపై నెలకో పూట గజ్వేల్‌కు కేటాయిస్తా..
భూ నిర్వాసితులతో రోజంతా గడుపుతా
రెండో దశ అభివృద్ధి మిగిలే ఉంది..
గుడిసె లేని నియోజకవర్గంగా చేయడమే లక్ష్యం
ప్రతి ఊరికీ మైనర్ లిఫ్టింగ్‌తో గోదారి నీళ్లు..
ఎన్ని ఎకరాల భూమి ఉన్నా రైతుబంధు ఇస్తా
బీఆర్‌ఎ్‌సకు 95 నుంచి 105 సీట్లు..
గజ్వేల్ బీఆర్‌ఎస్ శ్రేణులతో సమావేశంలో కేసీఆర్
గజ్వేల్, అక్టోబరు 20: గజ్వేల్ విషయంలో తన మనసులో ఓ బాధ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తాను గజ్వేల్ ఎమ్మెల్యేనే అయినా.. ఇన్నాళ్లూ ఆ నియోజకవర్గ కార్యకర్తలకు దొరకలేదన్నారు. గతంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామగ్రామానికీ పాదయాత్ర చేసేవాడినని, ఇప్పుడు బాధ్యతలు పెరగడం వల్ల గజ్వేల్ విషయంలో అది సాధ్యపడలేదని చెప్పారు. ఇకపై నెలకో పూట గజ్వేల్‌కు కేటాయిస్తానని, ఇక్కడికే వచ్చి కూర్చుని సమస్యలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. శుక్రవారం మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని అంతాయిగూడలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌లో ఎంతో జరిగిందని చెప్పుకోవద్దని, మొదటి దశ అభివృద్ధి మాత్రమే పూర్తయిందని, ఇంకా రెండో దశ మిగిలే ఉందని అన్నారు. ప్రతి గ్రామానికీ గోదావరి నీటిని తరలించడమే తన లక్ష్యమని, ఆ దిశగా ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయించానని చెప్పారు. మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెక్‌డ్యాంలు నిర్మించి నీటిని తరలిస్తామన్నారు. తాను కూడా భూ నిర్వాసితుడినేనని, నిర్వాసితుల గోస తనకు తెలుసునని ముఖ్యమంత్రి తెలిపారు. తన తాతల భూములు, తన అత్తగారి భూములు ముంపునకు గురయ్యాయన్నారు. ఎన్నికలయ్యాక భూనిర్వాసితులతో ఒక రోజంతా గడపుతానన్నారు. మూడు నాలుగు పాత జిల్లాలకు అన్నం పెట్టే రిజర్వాయర్ మల్లన్నసాగర్ అని, అలాంటి రిజర్వాయర్ కోసం భూములను త్యాగం నిర్వాసితులకు ఏం చేసినా తక్కువేనని కొనియాడారు. వారి త్యాగం వల్లే గజ్వేల్ నియోజకవర్గంలోనే 65 టీఎంసీల నీళ్లు ఉన్నాయని తెలిపారు. రిజర్వాయర్లు కడుతుంటే కాంగ్రెసోళ్లు, కోదండరాం అడ్డుకుని కేసులు వేశారన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భూగర్భ జలమట్టం తగ్గుతుంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఆరున్నర మీటర్లు పెరిగిందని, తమ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందని వివరించారు.

ప్రతి ఎకరాకూ రైతుబంధు..
రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు రైతుబంధు ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గతంలో రైతుల నుంచి తీసుకోవడమే తప్ప ఇచ్చే ఆలోచన ఏ నాయకుడికీ లేదని, తానే మొదటిసారి రైతుబంధు ఇస్తే ఇప్పుడు పక్క రాష్ట్రాలు వివిధ పేర్లతో దానిని అమలు చేస్తున్నాయని తెలిపారు. రైతుబంధు పథకాన్ని యూఎన్‌వో అభినందించిందని, అశోక్ గులాటీ లాంటి వారు కొనియాడారని పేర్కొన్నారు. గజ్వేల్‌ను గుడిసె లేని నియోజకవర్గంగా మార్చేందుకు కృషి చేయాలంటే రెండు పెద్ద దెబ్బలే తగిలాయని చెప్పారు. కరోనా రూపంలో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ప్రతి నిరుపేదకూ సొంతిల్లు లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. తూప్రాన్‌లో డిగ్రీ కళాశాల, దేవాలయాల అభివృద్ధి, ముంపు గ్రామాల ప్రజల సమస్యలు, మినీ ట్యాంకుబండ్‌ల నిర్మాణం లాంటి అన్ని సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను జీవితంలో ఒక్కసారే ఓడిపోయానని, అది కూడా 700 ఓట్లతో ఓడించబడ్డానని చెప్పారు.
రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇవ్వాలి..
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్రంలోనే భారీ మెజారిటీ తీసుకువచ్చేందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని, అధ్యయన కేంద్రంగా గజ్వేల్ మారిందని అన్నారు. రింగ్‌రోడ్డు, ఎడ్యూకేషన్ హబ్‌లు, సమీకృత మార్కెట్, అడవుల పునరుజ్జీవం, అటవీ, ఉద్యానవన యూనివర్సీటీలతో అత్యద్భుత అభివృద్ధి జరిగిందని వివరించారు. పల్లెలు పున ర్‌వైభవాన్ని సాధించాయన్నారు. కుకునూరుపల్లి, మనోహరాబాద్, మర్కూక్ మండలాలుగా, గజ్వేల్, తూప్రాన్ డివిజన్లుగా అవతరించాయన్నారు. కొత్త, పాత అన్న తేడా లేకుండా అంతా సమన్వయంతో 35 రోజులపాటు కష్టపడి పనిచేయాలని సూచించారు. అంతకుముందు ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ విజన్, డిజైన్ ఉన్న లీడర్ కేసీఆర్ అని, గజ్వేల్‌లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు చేస్తామని అన్నారు.
కామారెడ్డి కథ వేరే ఉంది
తాను గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో పోటీ చేస్తుండడం వెనుక వేరే కారణం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్‌ను వదిలి ఎందుకు పోతానని, హైదరాబాద్ పక్క ఉన్న నియోజకవర్గాన్ని వదిలి వెళ్లబోనని స్పష్టం చేశారు. ‘‘గజ్వేల్‌లో వచ్చిన ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంటుంది. ప్రజలకు మనమేందో తెలిసిపోయింది. నాకు ఎంత మెజారిటీ వస్తదనేది మీ దయ’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కామారెడ్డి కథ వేరే ఉందని ఆయన చెప్పగానే కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఆయన ప్రసంగానికి వచ్చే ముందు పెద్దఎత్తున నినాదాలతో హాల్ అంతా మార్మోగిపోయింది. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.