Avinash Reddy: గుండెపోటు అని చెప్పినంత మాత్రాన నేరం చేసినట్లు కాదన్న అవినాశ్ తరపు లాయర్

ABN , First Publish Date - 2023-05-26T12:05:51+05:30 IST

హైదరాబాద్: కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. అవినాష్ తరఫున న్యాయవాది ఉమా మహేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు.

Avinash Reddy: గుండెపోటు అని చెప్పినంత మాత్రాన నేరం చేసినట్లు కాదన్న అవినాశ్ తరపు లాయర్

హైదరాబాద్: కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో విచారణ ప్రారంభమైంది. అవినాష్ తరఫున న్యాయవాది ఉమా మహేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టుకు సీబీఐ ఎస్పీ వికాష్ కుమార్ చేరుకున్నారు. అవినాష్ ముందస్తు బెయిల్‌పై జరుగుతున్న వాదనలు ఆయన వింటున్నారు. సీబీఐ కౌంటర్‌ను అవినాష్ న్యాయవాది తప్పుపట్టారు. అవినాష్ నిందితుడని సీబీఐ రికార్డుల్లో ఎక్కడా చెప్పలేదన్నారు. గుండెపోటు అని చెప్పినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని అన్నారు. అవినాష్ పోలీసో, డాక్టరో కాదు కాదా? అని లాయర్ ఉమా మహేశ్వరరావు వాదించారు.

A 1 నిందితుడు ఎర్ర గంగి రెడ్డికి భూవివాదాలు ఉన్నాయని, ఆ కక్షతోనే ఎర్రగంగి రెడ్డి హత్య చేశాడని వాదించారు. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డికి వివేకాతో వజ్రాల వ్యాపారంలో విబేధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో వివేకా డ్రైవర్‌గా ఉన్న దస్తగిరిని తొలగించి ప్రసాద్‌ను పెట్టుకున్నారన్నారు. తమ కుటుంబంలోని మహిళల విషయంలోనూ సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డికి వివేకాపై కోపం ఉందని, వారందరికి వ్యక్తిగత కక్షలు ఉన్నాయి కాబట్టే హత్య చేశారన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి అవినాష్ కారణమని వివేకా ఊహించుకున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి కారణాలను సాక్షులే వివరించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి కారణం ఏంటో సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని అవినాష్ తరపు న్యాయవాది ఉమా మహేశ్వరరావు వాదనలు వినిపించారు.

అనంతరం సునీత తరఫున సీనియర్ కౌన్సిల్ రవిచంద్ వాదనలు వినిపించనున్నారు. అలాగే అదనపు అఫిడవిట్‌ను సీబీఐ దాఖలు చేసింది. పూర్తి స్థాయిలో అవినాష్‌కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు వాదించనున్నారు. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు ఇచ్చామని, దర్యాప్తుకు సహకరించడంలేదని, అవినాష్‌ను పూర్తిస్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఇవాళ హైకోర్టు తీర్పు నేపథ్యంలో వైసీపీ (YCP) శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

కాగా ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి (Sri Lakshmi) ఆరోగ్యం (Health) మెరుగుపడింది. కాసేపట్లో ఆమెను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ (Discharge) చేయనున్నారు. అవినాష్ తల్లి డిశ్చార్జ్ అవగానే మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించే అవకాశమున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే అవినాష్ కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం.

అవినాష్ రెడ్డి వారం రోజుల పాటు ఆయన తన తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతున్న కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్దే ఉన్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఆమెను మరో ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలియవచ్చింది. దీంతో శ్రీలక్ష్మిని చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువస్తారా? లేక పులివెందులకు తీసుకువెళతారా? అన్నది తెలియనుంది. అయితే కర్నూలులో జరిగిన డ్రామానే హైదరాబాద్‌లో కూడా జరుగుతుందా? అన్న దానిపై పోలీసులు, సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. అవినాస్ తదుపరి నిర్ణయం ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 19వ తేదీ నుంచి శ్రీలక్ష్మి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-26T12:15:28+05:30 IST