Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడి పొడిగింపు

ABN , First Publish Date - 2023-04-03T15:28:30+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని పొడిగిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది.

Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడి పొడిగింపు

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) కస్టడీని పొడిగిస్తూ సీబీఐ కోర్టు (CBI Court) నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లై జ్యూడిషిల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఈరోజు ఉదయం పోలీసులు ఆయనను సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో పిళ్లైకు ఏప్రిల్ 17 వరకు జ్యూడిషియల్ కస్టడీని పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైను మార్చి 7న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. మద్యం కుంభకోణంలో అవకతవకలపై రామచంద్ర పిళ్ళైను ఈడీ ప్రశ్నించింది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన మీదట దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించాయి. అరుణ్ పిళ్ళై‌కి చెందిన వట్టినాగులాపల్లిలో రూ .2.2 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. అనంతరం రామచంద్రను ఈడీ అరెస్ట్ చేసింది. ఆపై ఆయనను ఢిల్లీ రౌస్ అవన్యూ కోర్టు (Delhi Rouse Avenue Court)లో హాజరుపర్చగా మొదట వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. మార్చి 13 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ.. కోర్టు ఆదేశాలను జారీ చేసింది. వారం రోజుల కస్టడీ ముగిసిన తర్వాత కూడా మరోసారి మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఈడీ అధికారులు కోరాగా అందుకు కోర్టు అనుమతించింది.

ఇది కూడా ముగియడంతో అధికారులు ఆయను స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. దీంతో పిళ్లైకు ఏప్రిల్ 3 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కస్టడీలో ఉన్నన్ని రోజులు పిళ్లైకు అవసరమైన మందులు సమకూర్చాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరగా న్యాయస్థానం అందుకు అంగీకరించింది. పిళ్లైకి థైరాయిడ్ మెడిసిన్, ఐ డ్రాప్స్, బట్టలు అందించాలని అధికారులను స్పెషల్ కోర్టు ఆదేశించింది. కాగా నేటితో జ్యూడిషియల్ కస్టడీ ముగియడంతో సీబీఐ కోర్టుకు తీసుకురాగా.. పిళ్లైకు సీబీఐ కోర్టు ఏప్రిల్ 17 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.

Updated Date - 2023-04-03T15:38:18+05:30 IST